Home జాతీయ వార్తలు మంట ఆర్పండి

మంట ఆర్పండి

narendra-modi-petrol

పెట్రో ధరలను తగ్గుముఖం పట్టించండి

ఒపెక్‌సభలో ధరల నిర్ణయ విధానాన్ని తప్పుపట్టిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అందరికీ అందుబాటులో పెట్రో ఉత్పత్తుల (చమురుఇంధన) ధరలు ఉండాల్సిన అవసరం ఉం దని ప్రధాని మోడీ సూచించారు. బుధవారం ఆయన 16వ అంతర్జాతీయ ఇంధన ఫోరం (ఐఇఎఫ్) మంత్రిత్వస్థాయి సమావేశంలో మాట్లాడారు. ఇందులో పలు పెట్రోలియంఉత్పత్తులు, ఎగుమతుల దేశాలు(ఒపెక్) మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తప్పుడు ధరల విధానాన్ని నిరసించారు. లోపభూయిష్టమైన ధరల విధానంతో పెట్రో ఉత్పత్తుల ధర లు పెరుగుతున్నాయని, దీనిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కీలకమైన ఒపెక్ మంత్రుల భేటీలో చమురు సంపన్న సౌదీ అరేబియా మంత్రి కూడా పాల్గొన్నారు. సౌదీతో పాటు ఇరాన్, ఖతార్ దేశాల మంత్రులు కూడా ఇందులో ఉన్నారు. కృత్రిమంగా ఏర్పడుతోన్న ధరల బూచీతో ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోందని ప్రధాని హెచ్చరించారు. అందుబాటులో ఇంధన ధరలు ఉండే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయసాధన అవసరం అన్నారు.

          దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న దశలో ప్రధాని ఈ వేదిక నుంచి పెట్రో ఉత్పత్తుల ధరల విధానంపై మాట్లాడారు. తప్పుడు ధరల విధానంతో చమురు దిగుమతి చేసుకునే దేశాలలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, దీని భారం సామాన్యుడు మోయాల్సి వస్తోందన్నా. చాలా కాలంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నాయని, ఇది ఆందోళనకర పరిణామం అని, ఈ దశలో చమురు ఉత్పత్తి దేశాలు మరింత బాధ్యతాయుతంగా చమురు ధరలను ఖరారు చేయాల్సి ఉందని ప్రధాని సూచించారు. వినియోగదారులు, ఉత్పత్తిదారుల ప్రయోజనాల సమతూకం దిశలో ధరల విధానం ఉంటే మంచిదని తెలిపారు. పారదర్శక, వెసులుబాటు మార్కెట్ ఇప్పుడు సహజవాయువు, చమురు మార్కెట్‌కు అత్యవసరం అని ప్రధాని స్పష్టం చేశారు. దీని వల్లనే మానవాళికి అత్యవసరం అయిన ఇంధన అవసరాలు తీరేందుకు వీలేర్పడుతుందని తెలిపారు. ఒపెక్ దేశాలు సాధ్యమైనంత స్థాయిలో అందుబాటు ధరలను తీసుకురావల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో చమురు వినియోగదేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. 8౦ శాతం వరకూ దేశ చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పరస్పర సహకారంతో కూడిన విధానం అవసరం అని, వినియోగదారులు, ఉత్పత్తిదారులకు మధ్య సహేతుక బంధంతోనే సరైన వ్యవస్థకు వీలేర్పడుతుందని ప్రధాని తెలిపారు. ఎప్పటికప్పుడు ఎదుగుతోన్న ఇంధన మార్కెట్ ఇదే క్రమంలో ఇతర ఆర్థిక వ్యవస్థల బాగోగులకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉందని తెలిపారు. తప్పుడు విధానాలతో అనర్థాలు ఉంటాయని చరిత్ర చెపుతోందని, అవాంఛనీయ క్లిష్టత ఏర్పడుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన, వర్థమాన దేశాల నిచ్చెన పరిధిలో చూసుకుంటే అట్టడుగు స్థాయిలో ఉండే దేశాలకు ఈ అస్తవ్యస్థ ధరల విధానం జ్వాలలు రేపుతుందని పేర్కొన్నారు.

           ఇప్పుడు ఈ వేదిక ద్వారా తాను బాధ్యతాయుతమైన ఇంధన ధరల విధానం గురించి అభ్యర్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. భారతదేశం ఇంధన భద్రతను కోరుకొంటోందని , భారతదేశపు ఇంధన భవిష్యత్తుకు నాలుగు మూల స్తంభాలు ఉన్నాయని, ఇంధన సౌకర్యం, ఇంధన స్థిరత, భద్రత ఇంధన సామర్థత వంటి అంశాలు ఉన్నాయని వివరించారు. భారతదేశ దృక్పథంలో హైడ్రోకార్బన్స్ ముఖ్యమైనవని తెలిపారు. ఇంధన వినియోగంలో భారత సామర్థం మరింతగా ఇనుమడించాల్సి ఉందని చెప్పారు. ప్రపంచం ఇప్పుడు ఇంధన సమృద్థికి చేరుకుందని అనుకుంటున్నామని అయితే ఇప్పటికి 120 కోట్ల మంది ప్రజలకు విద్యుత్ సౌకర్యం లేదన్నారు. అత్యధికులకు స్వచ్ఛమైన వంట ఇంధనం లేదని , ఇది బడుగు వర్గాలకు చేటుగా మారుతోందన్నారు. ప్రజందరికీ స్వచ్ఛమైన ఇంధనం అందుబాటు ధరలకు స్థిరంగా అందేలా చూడాల్సి ఉందని ప్రధాని తెలిపారు. ఇంధన అవసరాలు తీర్చడంలో ఇకపై సౌర ఇంధనం కీలక పాత్ర పోషిస్తుందని ఈ దిశలో భారతదేశం చొరవ తీసుకుందని చెప్పారు. 2040 నాటికి ఇంధన డిమాండ్ మూడింతలు అవుతుందని ఒక నివేదికలో వెల్లడైందని, 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 32 కోట్లకు చేరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ భారతదేశం ప్రపంచంలోనే శరవేగంతో పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని తెలిపారు. ఎడిబి, ఐఎంఎఫ్ ప్రపంచబ్యాంక్ ఇతర సంస్థలు భారత్ ప్రగతికి కితాబు ఇచ్చాయని ప్రధాని గుర్తు చేశారు. సమీప భవిష్యత్తులో 78 శాతం అభివృద్ధి చెందుతుందని ఆయా ప్రపంచ సంస్థలు అంచనా వేశాయని వివరించారు. తక్కువ ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు అదుపులో పెట్టుకుంటూ ప్రగతి సాధిస్తున్నామని తెలిపారు. ఈ విధమైన స్థూల ఆర్థిక స్థిరత  పెట్టుబడులకు, వినియోగానికి ఉపయోగపడుతోందని వెల్లడించారు.