Home తాజా వార్తలు రెండో రోజూ తగ్గిన పసిడి ధర

రెండో రోజూ తగ్గిన పసిడి ధర

gold

ముంబై: డిమాండ్ ఆశించినంతగా లేకపోవడంతో బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. గురువారం 10 గ్రాముల పసిడి ధర రూ.145 తగ్గి రూ.31,570కు చేరింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదిరినప్పటికీ పసిడి బలహీనపడటం పట్ల నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు బలపడుతున్న కారణంగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తాజాగా ఆరు నెలల కనిష్టానికి చేరింది. దీంతో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపిస్తోంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కల్గిన బంగారం ధర రూ.145 తగ్గి వరుసగా రూ.31,570, రూ.31,420గా నమోదైంది. అంతర్జాతీయంగా చూస్తే న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 10 డాలర్లు క్షీణించింది. ఆగస్ట్ డెలివరీ 1264 డాలర్ల వద్ద ట్రేడయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్స్ రేట్లను 1.75- నుంచి 2 శాతానికి పెంచడంతో డాలరుతోపాటు బాండ్ల ఈల్డ్ ఊపందుకున్నాయి. ఈ ఏడాది మరో రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచనున్నట్లు సంకేతాలివ్వడంతో డాలరు ఇండెక్స్ తాజాగా 11 నెలల గరిష్టానికి బలపడింది. ప్రపంచంలోనే రెండోపెద్ద దిగుమతిదారు అయిన భారత్ మే నెలలో 39 శాతం తక్కువగా 48 మెట్రిక్ టన్నుల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. వెరసి వరుసగా ఐదో నెలలోనూ పసిడి దిగుమతులు క్షీణించాయి.