Friday, April 26, 2024

‘ట్రావెల్స్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

 Travels

 

మార్గదర్శకాల రూపకల్పనలో పర్యాటక శాఖ
టూరిజం సర్కూట్‌లను ఏర్పాటు చేయాలి
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశం

హైదరాబాద్ : ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు టూర్స్, ట్రావెల్ సంస్థలు విధిగా రాష్ట్ర పర్యాటక శాఖలో గుర్తింపు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై పర్యాటక శాఖ దృష్టి సారించింది. కొన్ని ప్రైవేటు సంస్థలు పర్యాటకులను పలు రకాలుగా మోసం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలకు ఉపక్రమించింది. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ప్రతి రోజు పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాలకు దేశ, విదేశాల నుంచి భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే రాష్ట్రానికి వస్తున్న పర్యాటకులను కొంత మంది టూర్స్, ట్రావెల్స్ సంస్థలు అధిక మొత్తంలో ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అలాగే వారిని పలు రకాలుగా మోసాలు చేస్తున్నారన్న విమర్శలు పెద్దఎత్తున వినబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో మన రాష్ట్రానికి వస్తున్న పర్యాటకులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సురక్షితంగా వారిని గమ్యస్థానం చేర్చాలన్న లక్షంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ ఆగడాలకు చెక్‌పట్టేందుకు అవకాశముంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ సోమవారం నగరంలో తెలంగాణ, ఎపి రాష్ట్రాలకు చెందిన టూర్స్, ట్రావెల్స్ ఆపరేటర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పర్యాటక రాష్ట్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అయితే కొన్ని బోగస్ టూర్స్, ట్రావెల్స్ ఏజెంట్ల కారణంగా రాష్ట్రానికి వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా నిబంధనలుపై పర్యటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, ఇతర అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చర్చించారు.

టూర్స్, ట్రావెల్స్ సంస్థలు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖలో గుర్తింపు నమోదు చేసుకోవాలనే విధంగా విధి విధానాలు రూపొందించాలని సంస్థ ఎండిని ఆదేశించారు. పర్యాటక రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, పర్యాటకాన్ని సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటక ప్రదేశాలు నిర్లక్ష్యం చేయబడ్డాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టూరజం ప్రాంతాలను యుద్దప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నామన్నారు. టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధి కి చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా కాళేశ్వరం, లక్నవరం, సోమశిల, బుద్ధవనం, మయూరి ఎకో పార్క్, రామప్ప, పిల్లల మర్రి, మానేరు డ్యామ్, అలంపూర్ లోని జోగులంబా, మల్లెల తీర్థం, మన్ననూరు మొదలైన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి అభివృద్ధి చేస్తున్నామన్నారు.

టూర్స్, ట్రావెల్స్ ల అసోసియేషన్ లు రాష్ట్రానికి దేశీయ, విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున పర్యాటకులను తీసుకవచ్చేందుకు కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు, రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను ప్రమోషన్ కు కృషి చేస్తున్న టూర్ ఆపరేటర్‌లకు అవార్డులు, తగిన ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాలకు రవాణా సౌకర్యాలు కల్పించాలని, అందుకు తగిన ప్రచారం కల్పించాలన్నారు.

రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులకు ఆదేశించారు. త్వరలో ఎపి, తెలంగాణ కు చెందిన టూర్స్ , ట్రావెల్స్ ఆపరేటర్‌లతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎపి, తెలంగాణ టూర్స్ అసోసియేషన్ చైర్మన్ నగేష్, సెక్రెటరీ సాయిబాబా బాదం, టూర్ ఆపరేటర్ హేమంత్ పాండే, సుధీర్ రెడ్డి, రమేష్, విక్రమ్‌తో పాటు పలువురు ఆపరేటర్లు పాల్గొన్నారు.

Registration is mandatory for Travels
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News