Saturday, April 20, 2024

పోలీసుల కళ్లుగప్పి పరారైన కిలాడి

- Advertisement -
- Advertisement -

జగిత్యాలః అధిక వడ్డీ చెల్లిస్తానని ఆశ చూపి అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు అప్పులు తీసుకుని కనిపించకుండా పోయిన వ్యక్తిని బాధితులు నాలుగైదు నెలలు గాలించి పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే, పోలీసుల కళ్లుగప్పి మోసగాడు పోలీస్ స్టేషన్ నుంచి పరారైన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రేగొండ నరేష్ అనే వ్యక్తి తాను రియల్టర్, సామాజిక వేత్త, నటుడు, వ్యాపారవేత్తగా అవతారమెత్తడమే కాకుండా ఉన్నత స్థాయి అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకుని అమాయక ప్రజల నుంచి కోట్లల్లో అప్పులు తీసుకున్నాడు. నెల నెలా వడ్డీ చెల్లిస్తానంటూ ఆశ చూపడంతో అమాయక జనం అతగాడి మాటలు నమ్మి లక్షలు, కోట్లల్లో అప్పులు ఇచ్చారు.

మహిళలు వడ్డీకి ఆశ పడి తమ ఒంటి మీద ఉన్న నగలను అతడి చేతిలో పెట్టారు. మహిళల నుంచి తీసుకున్న బంగారం మొత్తం సుమారు 5 కిలోల వరకు ఉంటుందని తెలుస్తోంది. సుమారు రూ.30 కోట్ల వరకు అప్పులు చేసి రాత్రికి రాత్రే నరేష్ కనిపించకుండా పోయాడు. నరేష్ జగిత్యాలలో కనిపించకపోవడంతో బాధితులు పెద్ద ఎత్తున జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నరేష్‌పై ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం పలు ప్రాంతాల్లో గాలింపు చేసినా నరేష్ ఆచూకీ లభించలేదు. కాగా కోట్లల్లో అప్పులు తీసుకుని పరారైన నరేష్ ఆచూకీ కోసం బాధితులు గాలింపును ముమ్మరం చేశారు. ఐదారు నెలలు గాలించగా చివరకు హైదరాబాద్‌లో నరేష్ ఓ బాధితుడికి పట్టుబడ్డారు. అయితే నరేష్ తనను ఏమీ చేయవద్దని, మీ డబ్బులు మీకు తిరిగి చెల్లిస్తానంటూ కొంత గడువు పెట్టాడు.

గడువు మీరినా నరేష్ డబ్బులు చెల్లించకపోగా అతడి ఫోన్ పనిచేయకపోవడంతో ఆయన కోసం బాధితులు గాలింపును మరింత ముమ్మరం చేశారు. చివరకు ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి నరేష్‌ను పట్టుకుని జగిత్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు. నరేష్ పట్టుబడిన విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దాంతో నరేష్‌ను జగిత్యాల టౌన్ నుంచి వేరే పోలీస్ స్టేషన్‌లకు తరలించి విచారణ చేస్తున్నారు. కాగా వారం రోజులుగా పోలీసుల అదుపులో ఉన్న నరేష్ మంగళవారం తెల్లవారుజామున సారంగాపూర్ పోలీస్టేషన్ నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు తెలుస్తోంది. తమకు వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు బురిడి కొట్టించి పరారైన జగత్ కిలాడిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమైతే తాము పట్టుకున్నామని, పట్టుబడిన వ్యక్తి పోలీస్ స్టేషన్ నుంచి పరారు కావడం పట్ల బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News