Thursday, April 25, 2024

రెండంచుల కత్తి!

- Advertisement -
- Advertisement -

Regulatory orders on Social Media

 

సభ్యతకు అసభ్యతకు మధ్య ఉండి తీరాల్సిన విభజన రేఖను గౌరవించడం అనేది సామాజిక ఆరోగ్య రక్షణకు అత్యవసరమైన ఔషధం. ఇందులో మరో మాటకు తావులేదు. విమర్శ పేరుతో వ్యక్తిగత దూషణకు, గిట్టని వారిని తిట్టడానికి తెగబడితే, అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ నిజంగానే దేశద్రోహానికి దారి తీసే విధంగా దుర్వినియోగమవుతుంటే అటువంటి వాటిపై కత్తెరపడాల్సిందే. అలాగే, నగ్న, అశ్లీల చిత్రాలతో, దృశ్యాలతో, సందేశాలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం వంటి పోకడలను అరికట్టాల్సిందే. మహిళలను అవమానాల పాలు చేసే చేష్టలను అడ్డుకో వలసిందే. తలుపులు, ద్వార బంధాలు, తాళాలు లేని సంపూర్ణ స్వేచ్ఛా వేదికలుగా, సకల అభిప్రాయాల ప్రకటనకు అనువైనవిగా విశేష జనాదరణ పొందుతున్న గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్, ప్రైమ్ వీడియో వంటి ఒటిటి (ఓవర్ ది టాప్) ప్లాట్‌ఫామ్‌లు ఇటువంటి దుష్ట, స్వప్రయోజక, సంఘ విద్రోహ శక్తుల పన్నాగాలకు దుర్వినియోగమవుతున్న దురదృష్టకర సందర్భాలు లేకపోలేదు.

అందుకు ఇక ముందు ఎంత మాత్రం సందు లభించకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు విడుదల చేసిన సవివరమైన మార్గదర్శక నియమావళి ఆహ్వానించదగినదే. సామాజిక మాధ్యమాలు మన రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి నడచుకునేలా చేయడానికి తగిన సమగ్ర నిబంధనావళిని రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. ఆ మేరకు అవతరించిన ఈ నియమాలు సోషల్ మీడియా సంస్థల మీద ఒటిటిలపైనా కొన్ని గురుతరమైన బాధ్యతలను ఉంచుతున్నాయి. వీటి ప్రకారం తమ వేదికలపై పోస్టు చేసే ఏ సమాచారం, అభిప్రాయం, సందేశం, చిత్రం, దృశ్యం విషయంలోనైనా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిశీలించి తగిన చర్య తీసుకోడానికి వివిధ స్థాయిల్లో బాధ్యత గల అధికారులను నియమించవలసి ఉంటుంది. చట్టవిరుద్ధమైన, రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించే పోస్టింగులు పెట్టిన వారి మూలాలను, చిరునామాలను సంబంధిత దర్యాప్తు సంస్థలకు మూడు రోజులలో తెలియజేయవలసి ఉంటుంది.

న్యాయ స్థానాలు గాని, కేంద్ర ప్రభుత్వం గాని అభ్యంతరకరమైనవని వేలెత్తి చూపించే పోస్టింగులను 36 గంటలలో తొలగించవలసి ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అందుకున్నట్టు వారికి రెండు రోజుల్లో తెలియజేయాలి. 15 రోజుల్లో పరిష్కరించాలి. దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తలపెట్టేవి, శాంతి భద్రతలను దెబ్బ తీసేవి, పరువు నష్టం కలిగించేవి, అశ్లీలమైనవి, ఇతరుల గోప్యతను హరించేవి, పేటెంట్, ట్రేడ్ మార్క్, కాపీ రైట్, యాజమాన్య హక్కులను ఉల్లంఘించేవి అయిన పోస్టింగులు ఈ నిబంధనల ప్రకారం అభ్యంతరకరమైనవిగా పరిగణన పొందుతాయి. వినోద ప్రధానమైన ఒటిటి మాధ్యమాలు తాము ప్రసారం చేసే చిత్రాలకు చిన్న పిల్లలు చూడదగినవి, దగనివి అనే కేటగిరీలుగా విభజించవలసి ఉంటుంది. వివిధ వయో వర్గాలకు చెందిన చిత్రాలను వేరు చేసి ‘యు’ ‘ఎ’ వంటి సర్టిఫికేట్లతో ప్రసారం చేయవలసి ఉంటుంది. పైనుంచి చూసే వారికి ఈ నిబంధనలు సవ్యమైనవిగా, సబబైనవిగా అనిపిస్తాయి, అత్యవసరమైనవనే భావన కలిగిస్తాయి.

అక్రమార్కుల ఆట కట్టించడానికి ఉద్దేశించినవిగానే పరిగణన పొందుతాయి. కాని ఇవి వెల్లడి కాగానే వ్యక్తమైన కొన్ని భయానుమానాలు తప్పనిసరిగా గమనించదగినవి. సామాజిక మాధ్యమాలు ఇప్పుడు అనుభవిస్తున్న స్వాతంత్య్రాన్ని అరికట్టడానికే ఇవి ఊడిపడ్డాయనే విమర్శ పూర్తిగా కొట్టి పారేయదగినది కాదు. ఈ మాధ్యమాల ద్వారా భిన్న వర్గాల ప్రజలు అనుభవిస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛను హరించడానికి ఈ నిబంధనలను అధికారంలో ఉన్న శక్తులు వాడుకునే ప్రమాదం లేదని గట్టిగా చెప్పలేము. అభ్యంతరకరమైనవిగా తాను భావించే పోస్టింగులను సమాధానం కోసం, వివరణ కోసం ఎదురు చూడకుండానే అనుకున్నదే తడవుగా తొలగింప చేసే అధికారాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఈ ఉత్తర్వులు కట్టబెడుతుండడమే ఈ భయాలకు మూలం. ఇది ఎమర్జెన్సీ నాటి కఠిన సెన్సార్ షిప్‌కు దారి తీసినా తీయవచ్చు.

దీనిని పాలకులు తమ రాజకీయ ప్రత్యర్థుల, స్వతంత్ర భావజాలముండే మేధావుల, మీడియా సంస్థల నోరు మూయించడానికి ఉపయోగించుకోరనే హామీ లేదు. ఇప్పటికే రాజ్యాంగ సంస్థ లు సహా తమ చేతిలోని పలు దర్యాప్తు విభాగాలను కేంద్ర పాలకులు రాజకీయావసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శ ఉన్నది. అందుచేత కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సామాజిక మాధ్యమాల నియంత్రణ ఉత్తర్వులు మంచితో పాటు సమాజానికి చెడు కూడా చేయగల రెండంచుల కత్తివంటివని భావించక తప్పదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News