Friday, March 29, 2024

రిలయన్స్- ఫేస్‌బుక్ భారీ డీల్

- Advertisement -
- Advertisement -

Reliance - Facebook

కిరాణాల నుంచి వస్తువుల పంపిణీకి వాట్సాప్ వినియోగం
విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం
10% పెరిగిన రిలయన్స్ షేర్లు

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్‌ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ భాగంగా జియోలో 9.99 శాతం వాటాలను ఫేస్‌బుక్ కొనుగోలు చేయనంది. ఈ ఒప్పందం విలువ ఈ ఒప్పందం విలువ 5.7 బిలియన్ డాలర్లు అంటే రూ.43,574 కోట్లు. ‘రిలయన్స్, జియో లో ఉన్న మనం అందరం ఫేస్‌బుక్‌ను ఆహ్వానిస్తున్నందు కు ఆనందంగా ఉంది’ అని ఒక చిన్న వీడియో సందేశా న్ని ముకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్థానిక పొరుగు కిరాణా దుకాణాల నుంచి వస్తువులను వినియోగదారులకు పంపిణీ చేసేందుకు వాట్సాప్‌ను వినియోగించుకోవాలని ఈ ఒప్పందంలో భాగంగా సంస్థలు భావిస్తున్నాయి. ఆ తర్వాత విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించాలనుకుంటున్నాయి. ఈమేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌లు భాగస్వామ్యంపై ఓ ప్రకటన చేశారు. గత 2 నెలలుగా ముడి చమురు ధరల పతనంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, దుబాయ్‌కు చెందిన చమురు సంస్థ సౌదీ అరాంకో మధ్య జరిగిన ఒప్పందంపై సందేహాలు నెలకొన్నాయి. అందుకే ముఖేష్ అంబానీ ఇప్పుడు చమురు నుండి డేటా వైపు దృష్టిపెట్టారు.

ఆర్‌ఐఎల్‌ను రుణరహితంగా మార్చడమే లక్ష్యం 
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 20 శాతం వాటాను కొనుగోలు చేయడానికి సౌదీ అరామ్‌కోతో గతంలో ఒప్పందం జరిగింది. రెండు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా తగ్గడం వల్ల ఈ ఒప్పందంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరిగే అవకాశం లేదు. ఈ కారణంగానే ముఖేష్ అంబానీ భారతదేశంలోని డేటా, చిన్న కిరాణా దుకాణాలకు చేరుకోవడం ద్వారా వేరే మార్గాన్ని సృష్టించాలనుకుంటున్నారు. ముఖేష్ అంబానీ సంస్థ అప్పులను సున్నా స్థాయి తగ్గించాలని లక్షం చేసుకున్నారు. దీని భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఆయన వెనుకాడడం లేదు. ఫేస్‌బుక్ పెట్టుబడి జియో డిజిటల్ ప్రచారాన్ని వేగవంతం చేస్తుందని క్రెడిట్ సూయిస్ పేర్కొంది. 2019 అక్టోబర్‌లో చేసిన పునర్నిర్మాణ ప్రకటనకు అనుగుణంగా ఈ ఒప్పందం ఉంది. ఇందులో రిలయన్స్ జియో నుండి రూ .1.8 లక్షల కోట్ల రుణాన్ని స్వతంత్ర సంస్థకు బదిలీ చేసిందని సంస్థ తెలిపింది.

2016లో 40 బిలియన్ డాలర్లు పెట్టుబడి
జియో విస్తరణ కారణంగా ఆర్‌ఐఎల్ రుణం ఊహించని విధంగా పెరిగింది. 2016లో అంబానీ 40 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఫేస్‌బుక్ ఒప్పందం మార్చి 2021 నాటికి నికర రుణాన్ని తగ్గించడానికి భారతదేశ అతిపెద్ద ప్రైవేట్ సంస్థకు కీలకంగా మారింది. ఇంతకుముందు ఆర్‌ఐఎల్ తన వ్యాపారాలలో కొంత విక్రయించడానికి ప్రయత్నించడం ద్వారా రుణాన్ని తగ్గించే ప్రయత్నాలను వేగవంతం చేసింది.

2021 చివరి నాటికి జీరో డెట్ లక్ష్యం
2019 ఆగస్టు 12న సంస్థ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ పలు కీలక ప్రకటనలు చేశారు. 2021 మార్చి 31 నాటికి జీరో నెట్ డెట్ కంపెనీగా అవతరించడానికి కంపెనీకి స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉందని చెప్పారు. పెద్ద ప్రపంచ సంస్థాగత పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించాలనే ఉద్దేశ్యంతో 2018లో రిలయన్స్ 1.25 లక్షల కోట్ల రూపాయల విలువైన టెలికాం మౌలిక సదుపాయాలను రెండు వేర్వేరు ట్రస్టులకు బదిలీ చేసింది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు పెద్దఎత్తున ఆసక్తి చూపాయి. 2021 చివరి నాటికి లావాదేవీ పూర్తవుతుంద నే నమ్మకం ఉందని అంబానీ తెలిపారు. రూ.1,54,478 కోట్ల నికర రుణంతో కంపెనీ 2019 ఆర్థిక సంవత్సరాన్ని ముగించింది.

కెజిడి6లో పెట్టుబడులకు బిపితో ఒప్పందం
ఆర్‌ఐఎల్‌కు చెందిన ఆయిల్-టు-కెమికల్స్ విభాగంలో సౌదీ అరామ్‌కో 20 శాతం వాటాను కొనుగోలు చేస్తుందని అంబానీ చెప్పారు. కెజి-డి6లో పెట్టుబడులు పెట్టడాని కి రిలయన్స్ బిపితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు లావాదేవీలు రూ.1.1 లక్షల కోట్లు అని ఆయన చెప్పారు. ఆర్‌ఐఎల్ ఆయిల్ టు కెమికల్స్ (ఒ 2 సి) వ్యాపారంలో 20 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అరామ్‌కోతో డీల్ ఉంది. దీని విలువ ఇవిలపై 75 బిలియన్ డాలర్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గడం దృష్ట్యా ఈ ఒప్పందానికి ఆటంకాలు ఏర్పడ్డాయి.

జియో షేర్ ధర రూ.550 నుంచి 800 మధ్య
ఏప్రిల్ 14న హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ జియో విలువను రూ .4.8 లక్షల కోట్లుగా నిర్ణయించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.1,400గా పరిగణించినట్లయితే, జియో షేర్ ధర రూ.811 ఉంటుందని అంచనాగా ఉంది. ఈ ప్రాతిపదికన జియో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .3.4 లక్షల కోట్లు అని భావిస్తున్నారు. టెలికాం కంపెనీలకు సుంకాలు పెరగడం వల్ల జియో ఇబిఐటిడిఎ సంవత్సరానికి 78 శాతం పెరుగుతుంది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్‌కు గట్టిపోటీ
ఫేస్‌బుక్, జియో ఒప్పందంతో భారీ వేదిక ఏర్పడనుంది. ఇది ప్రస్తుతం ఇకామర్స్, పేమెంట్ రంగంలో దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్ వంటి సంస్థలకు గట్టి పోటీనివ్వనుందని నిపుణులు పేర్కొంటున్నారు. జియో మార్ట్‌తో ఫేస్‌బుక్ భాగస్వామ్యం వల్ల దేశీయ ఆన్‌లైన్ కామర్స్ మార్కెట్‌లో పెద్ద వాటాను కల్గివున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు పోటీ తప్పదని అంటున్నారు. రిలయన్స్ సంస్థ వ్యూహాలు ఎలా ఉంటాయో జియో సంస్థను చూస్తేనే తెలుస్తోంది. ఇప్పటికే టెలికాం రంగంలో రారాజులుగా వెలుగొందుతున్న ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాల తలదన్నేలా వ్యూహాలు రచించిన రిలయన్స్ సంస్థ జియోను ఇప్పుడు నంబర్ వన్ స్థానంలోకి చేర్చింది.

3 కోట్ల కిరాణా దుకాణాలకు ప్రయోజనం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ
రిలయన్స్, జియోలో ఉన్న అందరం ఫేస్‌బుక్‌ను ఆహ్వానిస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ట్విట్టర్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‘ లక్ష్యాలను సాకారం చేయడానికి ఈ భాగస్వామ్యం సహాయపడుతుందని అన్నారు. ఫేస్‌బుక్, జియో భాగస్వామ్యం లక్షం దేశంలో డిజిటల్ అవకాశాలను మెరుగుపర్చడమేనని అన్నారు. ఈ ఒప్పందంతో దేశం ప్రపంచంలోని ప్రముఖ డిజిటల్ సొసైటీలలో ఒకటిగా అవతరించనుందని అన్నారు. ఇందుకు గాను ఫేస్‌బుక్‌ను స్వాగతిస్తున్నందుకు ఆనందంగా ఉందని అంబానీ తెలిపారు. డిజిటల్ టెక్నాలజీతో కొత్త ఉపాధి అవకాశాలు రాబోతున్నాయన్నారు. ఫేస్‌బుక్-జియో అనుసంధానంతో దేశవ్యాప్తంగా 3 కోట్ల కిరాణా దుకాణాలకు భారీ ప్రయోజనాలు కలగనున్నాయని తెలిపారు. అలాగే రైతులు, చిన్న, మధ్యతరహా సంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు,ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో పాటు మహిళలు, యువకులకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. జియోమార్ట్ ద్వారా చిన్న కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టనున్నాయి. తద్వారా స్థానిక దుకాణాలనుండి రోజువారీ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. ఈ దుకాణాలు తమ వ్యాపారాలను పెంచుకోవచ్చని అన్నారు.

వాణిజ్య అవకాశాల కోసం కలిసి పనిచేయనున్నాం
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్
రిలయన్స్ జియోతో ఫేస్‌బుక్ చేతులు కలిపిందని, వాణిజ్య అవకాశాల కోసం ఇరువురం కలిసి పనిచేయాలనుకుంటున్నామని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. భారతదేశం అంతటా ప్రజలకు వాణిజ్య అవకాశాలను తెరిచే కొన్ని ప్రధాన ప్రాజెక్టులపై కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని జుకర్‌బర్గ్ తన అధికారిక ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి, మొత్తం జియో బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. వాట్సాప్, రిలయన్స్ ఆధీనంలోని ఇ-కామర్స్ వెంచర్ జియో మార్ట్ మధ్య సహకారాలపై దృష్టి సారిస్తామని అన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌కు భారత్‌లో పెద్దమొత్తంలో వినియోగదారులు ఉన్నారని, ప్రతిభావంతులైన పారిశ్రామికవేత్తలకు భారతదేశం నిలయమని అన్నారు. భారత్ ఒక పెద్ద డిజిటల్ పరివర్తన క్రమంలో ఉందని, ముఖ్యంగా జియో వంటి సంస్థలు వందల మిలియన్ల భారతీయులను, చిన్న వ్యాపారాలను ఇందులో మిళితం చేయడంలో పెద్ద పాత్ర పోషించాయని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. భారతదేశంలోని కొత్త ఉద్యోగాలు, చిరు వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికే తాము జియోతో జతకట్టామని ఆయన వెల్లడించారు.

ఒక్క రోజులో ధనవంతులయ్యారు
జియోతో ఫేస్‌బుక్ ఒప్పందంతో వాటాదారులు ఒక్క రోజులోనే ధనవంతులయ్యారు. ఈ డీల్ ముఖేష్ అంబానీకి ఉపశమనం కలిగించింది. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్(బిఎస్‌ఇ)లో రిలయన్స్ షేర్లు 10 శాతం పెరిగి రూ.1,359కు చేరుకున్నాయి. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.69 లక్షల కోట్లకు పెరిగింది. మరోవైపు ఫేస్‌బుక్ స్టాక్ మంగళవారం నాస్‌డాక్‌లో 3 శాతం జంప్ చేశాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 486 బిలియన్ డాలర్లు.

Reliance – Facebook is a huge deal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News