Wednesday, April 24, 2024

టాప్ 100లో రిలయన్స్

- Advertisement -
- Advertisement -

టాప్ 100లో రిలయన్స్ 
151వ స్థానంలో ఇండియన్ ఆయిల్
అగ్రస్థానంలో వాల్‌మార్ట్: ‘ఫార్చ్యూన్ గ్లోబల్ 500’ జాబితా వెల్లడి

Reliance into top 100 in ‘Fortune Global 500’ List

న్యూఢిల్లీ: ఆసియాలో అత్యంత సంపన్నుడు, వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సాధించింది. ఈ కంపెనీ 10 స్థానాలు ఎగబాకి ‘ఫార్చ్యూన్ గ్లోబల్ 500’ జాబితాలోని టాప్ 100 కంపెనీలలో చేరింది. చమురు నుంచి టెలికాం వరకు వివిధ రంగాలలో పనిచేస్తున్న రిలయన్స్ ఫార్చ్యూన్ ప్రపంచ కంపెనీల జాబితాలో 96వ స్థానం (86.2 బిలియన్ డాలర్లు) దక్కించుకుంది. అయితే ఫార్చ్యూన్ టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ రిలయన్స్ కావడం విశేషం. ఇంతకుముందు 2012లో రిలయన్స్ ఈ జాబితాలో 99వ స్థానంలో ఉంది, కాని ఆ తరువాతి సంవత్సరాల్లో 2016లో 215వ స్థానానికి పడిపోయింది. అయితే అప్పటి నుండి రిలయన్స్ ర్యాంకింగ్ క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది.
టాప్ 500లో ఇతర భారతీయ కంపెనీలు
‘ఫార్చ్యూన్ గ్లోబల్ 500’ జాబితాలో 34 పాయింట్లు పడిపోయి ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) 151వ స్థానంలో (69.2 బిలియన్ డాలర్లు) ఉంది. మరోవైపు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) ర్యాంకింగ్ గత సంవత్సరంతో పోలిస్తే 30 స్థానాలు తగ్గి 190వ స్థానానికి (57 బిలియన్ డాలర్లు) చేరుకుంది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్ 15 స్థానాలు పెరిగి 221వ ర్యాంక్‌లో (51 బిలియన్ డాలర్లు) ఉంది. ఈ జాబితాలో ఇతర భారతీయ కంపెనీలు భారత్ పెట్రోలియం 309వ స్థానంలో, టాటా మోటార్స్ 337వ స్థానంలో, రాజేష్ ఎక్స్‌పోర్ట్ 462వ స్థానంలో ఉన్నాయి.
జాబితా ఎలా రూపొందిస్తారు?
గత ఆర్థిక సంవత్సరం ఆయా సంస్థల మొత్తం ఆదాయం ఆధారంగా ‘ఫార్చ్యూన్ గ్లోబల్ 500’ జాబితాను తయారు చేస్తారు. భారతదేశం విషయానికొస్తే 2020 మార్చి 31 ముగింపు నాటి ఆర్థిక సంవత్సరం ఫలితాల ఆధారంగా కంపెనీలను ఈ జాబితాలో నమోదు చేశారు.
అగ్రస్థానంలో వాల్‌మార్ట్
ఈ ఏడాది ‘ఫార్చ్యూన్ గ్లోబల్ 500’ జాబితాలో 524 బిలియన్ డాలర్ల నికర విలువతో వాల్‌మార్ట్ అగ్రస్థానంలో నిలిచింది. దీని తరువాత మూడు చైనా కంపెనీలు సినోపెక్ గ్రూప్, స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం ఉన్నాయి. ఈ జాబితాలో రాయల్ డచ్ షెల్ ఐదో స్థానంలో, సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ చమురు కంపెనీ అరామ్‌కో ఆరో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో వాల్‌మార్ట్, సినోపెక్, చైనా నేషనల్ పెట్రోలియం స్థానాలు మారలేదు. అయితే స్టేట్ గ్రిడ్ రెండు స్థానాలు, షెల్ రెండు స్థానాలు పడిపోయాయి.

Reliance into top 100 in ‘Fortune Global 500’ List

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News