Home అంతర్జాతీయ వార్తలు ఒమిక్రాన్ తీరుతెన్నులపై పరిశోధనలు

ఒమిక్రాన్ తీరుతెన్నులపై పరిశోధనలు

Research from all over world is now in finding this omicron

 

బ్రిస్బేన్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అనేక సందేహాలు చెలరేగుతున్నాయి. ఇది తీవ్రస్థాయి వ్యాధిని కలిగిస్తుందా? ప్రస్తుత కొవిడ్ టీకాలను ఏమారుస్తుందా? దీని తీరుతెన్నులు ఎలా ఉంటాయి? వంటి అంశాలపై చర్చ సాగుతోంది. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పూర్తి వివరాలు వెలుగు లోకి రాడానికి మరికొన్ని వారాలు ఎదురుచూడక తప్పదని చెబుతున్నారు. కొవిడ్ కారక సార్స్ కోవ్2 వైరస్ లోని జన్యుక్రమం లోని అన్ని భాగాల్లో అనేక ఉత్పరివర్తనాలు తలెత్తడం వల్ల ఒమిక్రాన్ పుట్టుకొచ్చింది. దీనికి తోడు దక్షిణాఫ్రికాలో ఇది విస్తృతంగా వ్యాపించడం , ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లుహెచ్‌వో) దీన్ని ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించడంతో అనేక దేశాలు భయపడుతున్నాయి. మరోపక్క ఒమిక్రాన్ లోని కొన్ని ఉత్పరివర్తనాలు ఇతర వేరియంట్లలోనూ కనిపించడం గమనార్హం. విడివిడిగా చూసినప్పుడు వీటిలో కొన్ని వైరస్ వ్యాప్తిని పెంచేవే.

అయితే ఒమిక్రాన్‌లో అనేక ప్రత్యేక ముటేషన్లు ఉన్నాయి. ఉదాహరణకు చైనా లోని వుహాన్‌లో బయటపడిన తొలి కరోనా వైరస్‌తో పోలిస్తే ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌లో దాదాపు 30 మార్పులు వచ్చాయి. డెల్టాలో ఇలాంటివి 10 మాత్రమే ఉన్నాయి. ఒమిక్రాన్‌లోని బహుళ ఉత్పరివర్తనాలు పరస్పరం ఎలా చర్యలు జరుపుతాయో అర్ధం చేసుకోవడం కీలకం. దీనిపై పరిశోధనలు సంక్లిష్టమైనవి. రోగి నుంచి ఒమిక్రాన్ నమూనాలను పరిశోధకులు సేకరించి ల్యాబ్‌లో వృద్ధి చేయాలి. రోగుల స్వాబ్‌లో వైరస్ పరిమాణం చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి దీన్ని వృద్ధి చేస్తే ప్రయోగాలకు సరిపడిన సంఖ్యలో వైరస్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రక్రియలో వైరస్ వృద్ధికి అనువైన కణాల లభ్యత చాలా కీలకం. అత్యున్నత స్థాయి బయో సేఫ్టీ ప్రమాణాలున్న ల్యాబ్ లోనే ఈ ప్రయోగాలను నిర్వహించాల్సి ఉంటుంది. జన్యు సాధనాలను ఉపయోగించి కూడా ల్యాబ్‌లో వైరస్‌ను తయారు చేయవచ్చు. ఇందులో వైరస్ ఉత్పత్తిని ప్రారంభించడానికి సార్స్ కోవ్ 2 జన్యుక్రమం సరిపోతుంది.

రోగి నమూనాలు అవసరం లేదు. ఒమిక్రాన్ లోని ఉత్పరివర్తనాల వల్ల ఈ వేరియంట్ వ్యాప్తి, టీకాలతో వచ్చే రోగ నిరోధక శక్తిని ఎలా ఏమారుస్తుందన్నది ప్రాథమిక అధ్యయనాలు పరిశీలిస్తాయి. మానవ కణాల్లోకి ప్రవేశానికి వైరస్‌కు ఉపయోగపడే ఏసీఈ2 గ్రాహకాలతో ఒమిక్రాన్ స్పైక్ ప్రొటోన్ చర్యలు జరిపే తీరును పరిశోధిస్తారు. కణం లోకి ప్రవేశించాక ఈ వేరియంట్ ఎలా వృద్ధి చెందుతుందన్నది తదుపరి పరిశోధనల్లో దృష్టి సారిస్తారు. ప్రస్తుత టీకాలతో ఉత్పన్నమైన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను ఎంతమేర అడ్డుకుంటాయన్నది న్యూట్రలైజేషన్ అధ్యనాల్లో తేలుతుంది.. దీనికి టీకా పొందిన వ్యక్తి నుంచి సీరం అవసరం. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌పై ఇవి ఎంత సమర్ధంగా పనిచేస్తున్నాయన్నది పరిశీలిస్తారు. బూస్టర్ డోసుల సమర్ధతనూ పరిశోధించనున్నారు.

Research from all over world is now in finding this omicron