Friday, March 29, 2024

ఆహార పదార్ధాల ప్యాకేజింగ్‌లో నానోటెక్నాలజీ కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

Researchers Show How Nanoparticles Used In Food Packaging Materials

నిట్ ఆంధ్రప్రదేశ్ పరిశోధకుల కృషి

న్యూఢిల్లీ : ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలు నిల్వలోను, నాణ్యత, రంగు, రుచి లోనూ ఎక్కడా చెడిపోకుండా ఉండడానికి నానోటెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఎన్‌ఐటి) కి చెందిన పరిశోధకులు ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. మిజోరాం యూనివర్శిటీ సహకారంతో వీరు చేసిన పరిశోధన ఫలితాలు ప్రముఖ జర్నల్ ఆఫ్ యూరోపియన్ ఫుడ్ రీసెర్చి అండ్ టెక్నాలజీలో వెలువడ్డాయి. ఆహార పదార్ధాల ప్యాకింగ్‌లో నానోపార్టికల్స్ కీలక పాత్ర ఎలా వహిస్తున్నాయో, అలాగే ఆహారం చెడిపోకుండా, కలుషితం కాకుండా ఉండేలా వ్యాధికారక పరాన్నజీవులను, కాలుష్యాలను, పురుగుల మందుల అవశేషాలను, అలర్జీ కారకాలను కనుగొనేలా నానో సెన్సార్లను ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చునో పరిశోధకులు వివరించారు. ఆహారం చెడిపోడానికి కారణమయ్యే సూక్ష్మజీవులను ఏ విధంగా నాశనం చేయవచ్చునో కూడా ఇందులో సమగ్రంగా వివరించినట్టు ఎన్‌ఐటి ఆంధ్రప్రదేశ్ బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ టింగిరికరి జగన్మోహనరావు చెప్పారు.

ఆహార పదార్ధాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం లోను, హానికరమైన అతినీల లోహిత వికిరణాల నుంచి ఆహారాన్ని రక్షించడానికి విడుదలయ్యే అనామ్ల జనకాలు (యాంటీ ఆక్సిడెంట్లు) పాత్ర గురించి ఈ పరిశోధనలో వివరించినట్టు చెప్పారు. నానోమెటీరియల్స్‌కు సంబంధించి ఆహార భద్రతా అంశాలు, ఆహార పదార్ధాలప్యాకేజీలపై లేబుళ్లు సరిగ్గా ముద్రించడం వంటి పర్యావరణహిత విధానాలను కూడా ఇందులో చర్చించారు. ఆహార వ్యర్ధాలను పారవేసినప్పుడు అవి విషపూరితమై మానవులు, జంతువులపై దుష్ప్రభావం చూపకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.

నానోపార్టికల్స్ ప్రభావం గురించి మిజోరాం యూనివర్శిటీ లోని పచ్చుంగ యూనివర్శిటీ కాలేజీ కి చెందిన పరిశోధకులు పూనూరి జయశేఖర్ బాబు వివరించారు. ఆహార పదార్ధాల ప్యాకేజింగ్‌లో నానోపార్టికల్స్ వినియోగం చాలా గొప్పవిషయమని, అయితే అకార్బనిక నానోపార్టికల్స్ ప్రభావాన్ని ఇంకా మరింత అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఆహార పదార్ధాల భద్రత సమస్యలను దృష్టిలో పెట్టుకుని నానోమెటీరియల్స్ వినియోగం, అమలుపై తగిన చట్టాలను ప్రభుత్వం తీసుకురావలసి ఉందని సూచించారు. ఆహార భద్రత, నాణ్యత అంశాలు ఈ విధంగా పరిష్కారమైతే ఫుడ్ ప్రాసెసింగ్‌లో నానోటెక్నాలజీ విప్లవాత్మక ప్రక్రియ అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News