Friday, March 29, 2024

ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు!

- Advertisement -
- Advertisement -

Reservations in Higher Education

 

మన దేశంలోని ఉన్నతమైన జాతీయ విద్యా సంస్థలు 18 ఎఐఐఎంఎస్‌లు, 23 ఐఐటిలు, 29 ఎన్‌ఐటిలు, 25 ఐఐఐటిలు, 18 ఐఐఎంలు, 7 ఎన్‌ఐపిఇఆర్‌లు, 23 ఎన్‌ఎఎల్‌ఎస్‌ఎఆర్‌లు, 7 ఐఐఎస్‌ఇఆర్‌లు, 54 కేంద్ర విశ్వవిద్యాలయాలు మొదలైన విద్యా సంస్థలలో నియామకాలు నియమా నుసారంగా, చట్టం ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించడంలేదనే ఆరోపణలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకెన్నాళ్లు వినాల్సి వస్తుందో తెలియడం లేదు. ఎన్నెన్నో నియమాలు, నిబంధనలు అడ్డు వేస్తూ ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు అమలుపరచడం లేదు. కొన్ని విద్యా సంస్థలలో అన్ని స్థాయిలలో అంటే (10+ 2+3/10+2+4+3) ప్రథమశ్రేణి , స్వయం ప్రతిపత్తి, మాధ్యమం లాంటి అమానవీయ నిబంధనల పేరిట టీచింగ్ పోస్టుల భర్తీలో అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్లు పాటించకపోవటం అన్యాయం.

ఒక ఉదాహరణను పరిశీలించినట్లయితే ప్రఖ్యాత ఐఐటి ముంబైలో గత 14 సంవత్సరాలుగా అధ్యాపక ఉద్యోగాలలో కనీసం ఒక్క ఒబిసి, ఒక్క ఎస్‌సిని గాని నియమించకపోవటం దురదృష్టకరం, రాజ్యాంగ విరుద్ధం. మన దేశంలో అన్ని ఐఐటిలలో మంజూరు అయిన అధ్యాపక పోస్టులు 9718. వీటిలో భర్తీ చేయబడ్డ అధ్యాపక పోస్టులు 8856. భర్తీ చేయబడ్డ అధ్యాపక పోస్టులలో 4871 మంది ఒసిలు, 336 మంది ఒబిసిలు, 150 మంది ఎస్‌సిలు, 17 మంది ఎస్‌టిలు సుమారుగా. ఇప్పుడైతే చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఒబిసిలకు 27%, ఎస్‌సిలకు 15%, ఎస్‌టిలకు 7 % ప్రకారం సుమారుగా ఒబిసిలకు 2391, ఎస్‌సిలకు 1328, ఎస్‌టిలకు 620 అధ్యాపక ఉద్యోగాలు భర్తీ కావాలి.

కానీ అలా జరగలేదు. దాదాపు అన్ని ఉన్నత శ్రేణి జాతీయ విద్యా సంస్థలలో బోధన అధ్యాపక నియామకాలలో రిజర్వేషన్ల జాబితా అమలులో విద్యా సంస్థలను యూనిట్‌గా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల నిమ్నవర్గాల వారికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి యుజిసి నిబంధనల మేరకు విభాగాన్ని/ డిపార్టుమెంట్‌ను యూనిట్‌గా తీసుకొని ఖాళీలను భర్తీ చేసిన ఎడల నిమ్న వర్గాల వారికి కొంతవరకూ న్యాయం జరుగుతుంది. విభాగాన్ని యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్ల జాబితాను ఖచ్చితంగా అమలు చేస్తేనే అణగారిన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆశ కలుగుతుంది. యుజిసి నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థనే యూనిట్‌గా తీసుకుంటున్నారు. స్వయం ప్రతిపత్తి ఉన్న విద్యాసంస్థల అధిపతులు తమ ఇష్టానుసారంగా రిజర్వేషన్ల జాబితాకు తూట్లు పొడుస్తున్నారు.

యూజిసి చట్టం 1956లోని సెక్షన్ 3 కింద స్థాపించబడిన లేదా కేంద్ర సహకారంతో స్థాపించబడిన ఏ విద్యా సంస్థ అయినా రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్శిటీల లో రిజర్వేషన్లు అమలు అయినట్లుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలలో అమలు కావటం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్య సంస్థల అధిపతులు స్వయం ప్రతిపత్తి పేరిట తమకున్న అధికారాలను ఉపయోగించి రిజర్వేషన్లను అమలు చేయడం లేదు. ఫలితంగా బడుగు, బలహీన వర్గాలు వెనుకబడిపోతున్నారు. నల్సార్ యూనివర్శిటీ లను పరిశీలించినట్లయితే రిజర్వేషన్లు అమలు సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్య విషయం ఏమిటంటే రిజర్వేషన్ అభ్యర్థులు లేనియెడల ఇతర వర్గాల వారిని ప్రతిభ ఆధారంగా నియమించుకోవచ్చు.

కానీ స్వయం ప్రతిపత్తి ఉన్న విద్యాసంస్థలు అణగారినవర్గాల వారిని టీచింగ్ పోస్టులలో రానివ్వకుండా చేస్తున్నాయి. కొన్ని ఉన్నత విద్యా సంస్థలు ఆచరణాత్మక పరీక్షలు, అంతర్గత పరీక్షలలో అణగారిన వర్గాల విద్యార్థులకు తక్కువ మార్కులు వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది సరైనది కాదు. అదే విధంగా ఉన్నత విద్యా సంస్థలలో కూడా నిమ్న వర్గాల అధ్యాపకులు ఉన్నట్లయితే ఇలా జరగకుండా ఉంటుంది. కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామాలలో ఉండే బడులలో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు సరైన సమాచార నైపుణ్యాలు లేక, సరి అయిన ఆంగ్ల భాషా నైపుణ్యం లేక పాఠశాల విద్యలో వెనుకబడి అష్టకష్టాలు పడుకుంటూ కళాశాల స్థాయికి వచ్చినాక ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వాటిని తట్టుకుంటూ వారి ప్రతిభను మెరుగు పరుచుకుంటూ పై చదువులలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులు అవుతున్నప్పటికీ అన్ని స్థాయిలలో (10+2+3+2 లేదా 10+2+4+3) ప్రథమ శ్రేణి నిబంధన పెట్టడం వలన వారు ఉన్నత స్థాయి విద్యా సంస్థల లోని టీచింగ్ పోస్టులకు అర్హత సాధించలేకపోతున్నారు.

ఉన్నత చదువులలో ఉత్తమ మార్కులు సాధించినప్పటికీ పాఠశాల స్థాయిలో తక్కువ మార్కులు ఉండడం వారికి శాపంగా మారుతున్నది. కావున ఉద్యోగ, అధ్యాపక నియామకాలలో ప్రభుత్వం అన్ని స్థాయిలలో ప్రథమ శ్రేణి అనే నిబంధనను తొలగించి రిజర్వేషన్లను ఖచ్చితంగా పాటించినప్పుడే బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుంది. దేశంలోని 411 రాష్ట్ర స్థాయి యూనివర్శిటీలలో రిజర్వేషన్లను అమలు పరుస్తున్న విధంగా, అన్ని కేంద్ర విద్యా సంస్థలలో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలి. 282 ప్రైవేటు యూనివర్శిటీలలో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలి. లేనియెడల ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన బడుగు బలహీన వర్గాలు అశాంతికి లోనవుతారు. ఇది దేశ సంక్షేమానికి గొడ్డలిపెట్టు వంటిది.

పార్టీలు, ప్రభుత్వాలు మారుతూ ఉండవచ్చు. కానీ బడుగుల తలరాతను మాత్రం మారలేకపోతున్నాయి. అందువలన బడుగు, బలహీన వర్గాల వారు అందరూ ఏకమై తమ హక్కుల కోసం పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదే విధంగా ప్రభుత్వాలు కూడా తాత్సారం చేయకుండా ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం పాటుపడిన నాడే దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అధిక సంఖ్యాక బడుగు బలహీన వర్గాలను విస్మరించిన ప్రభుత్వాలు గాని, దేశాలు గాని శాంతంగా ఉన్న దాఖలాలు లేవు. కావున దేశంలో పుట్టిన ప్రజలందరూ విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక రంగాలలో సమానంగా ముందుకు వెళ్లిన నాడే మన దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News