Thursday, April 25, 2024

ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Resignation of Prakash Raj panel members

బెనర్జీ, తనీశ్‌లను దూషిస్తూ మోహన్‌బాబు కొట్టడానికి వచ్చారు
సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్‌రాజ్
నరేశ్ నన్ను ఎన్నో మాటలన్నా భరించానుః శ్రీకాంత్
మోహన్‌బాబు తిట్టారని కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ

మన తెలంగాణ/హైదరాబాద్‌ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ప్రకాశ్‌రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిని‘మా’ బిడ్డలం ప్యానల్ నుంచి గెలుపొందిన అభ్యర్థులు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్యానల్ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ‘మా’ ఎన్నికల్లో చాలా రౌడీయిజం చేశారని.. నరేష్ ప్రవర్తన సరిగాలేదని.. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్ నటుడిపై చేయి చేసుకోవడానికి వచ్చారని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ “ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండో రోజు ఎలా ఓడిపోయారు?. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయి. పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారు. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై మా ప్యానల్ సభ్యులతో చర్చించాము. చివరికి ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన సభ్యులు అన్నారు. అందుకే ‘మా’ సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా రాజీనామా నిర్ణయం తీసుకున్నాము. మా ప్యానల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి ‘మా’ సభ్యుల తరపున నిలబడతాము”అని వెల్లడించారు.

అప్పుడే రాజీనామా వెనక్కి…

“నేను ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. మంచు విష్ణు ఆమోదించనని అన్నారు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ ఒక కండీషన్. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘తెలుగువాడు కాని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అనే విధంగా నియమ నిబంధనలు మార్చకపోతే రాజీనామా వెనక్కి తీసుకుంటా. ఒకవేళ మారిస్తే ఓటు వేయడానికో, గెలిపించడానికో నాకు ఇష్టం లేదు. ఇక మేము రాజీనామా చేసినా ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం ప్రశ్నిస్తాము? ఓడిపోయామని మేము వదిలేయబోము” అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

మమ్మల్ని పనిచేయనీయడం లేదని అంటారుః శ్రీకాంత్

“మాకు పదవులు లేకపోయినా విష్ణుకు అండగా ఉంటాము. ఎవరు ఓటు వేసినా, ఒక ప్యానల్ మొత్తానికి ఓటేయండి అని మేము మొదటి నుంచి ‘మా’ సభ్యులను కోరుతున్నాం”అని శ్రీకాంత్ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అభివృద్ధి ముందుకెళ్లాలంటే ఇరు ప్యానళ్ల నుంచి సగం సగం సభ్యులు గెలిస్తే కుదరదు. ఆ ప్యానల్‌లో కొంతమంది, ఈ ప్యానల్‌లో కొంతమంది గెలిచాం. అన్ని విమర్శలు చేసుకున్నాక కలిసి పనిచేయగలమా అనిపించింది. అయితే సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరం కలిసి ఈ రాజీనామాల నిర్ణయం తీసుకున్నాం.

ఇక గతంలో ఇలాగే కలిసి పనిచేసినప్పుడు చాలా వివాదాలు తలెత్తాయి. ఏ సమస్య ఎత్తి చూపినా ‘మమ్మల్ని పనిచేయనీయడం లేదు’ అని అంటారు. విష్ణు నాకు సోదరుడులాంటి వారు. ఆ ప్యానల్‌కు అన్ని తానే అయ్యి నరేశ్ చాలా అద్భుతంగా ఎన్నికలు నడిపించారు. తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం చేకూర్చారు. ఆయన విష్ణు వెనుక ఉండి గెలిపించారు. మా ప్యానల్‌లో ఉన్న వారంతా తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యం ఉన్నవారు. మేం వెళ్లి ప్రశ్నిస్త్తే మళ్లీ గొడవలు మొదలవుతాయి. నరేశ్ నన్ను ఎన్నో మాటలు అన్నాడు… అయినా భరించాను” అని శ్రీకాంత్ అన్నారు.

అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టారుః బెనర్జీ

ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలిచిన బెనర్జీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఎన్నికల సమయంలో మోహన్‌బాబు తనీశ్‌ను తిడుతున్నారు. నేను విష్ణు దగ్గరకు వెళ్లి ‘గొడవలు వద్దు’ అని అన్నాను. అది విన్న మోహన్‌బాబు కొట్టడానికి వచ్చేశారు. విష్ణుబాబు ఆయనను అడ్డుకుని నన్ను పక్కకు లాగేశారు. అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టారు. ఆయన అన్న మాటలకు షాక్‌లోకి వెళ్లిపోయా. మోహన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు మంచు లక్ష్మీ, విష్ణుని ఎత్తుకుని తిరిగేవాడిని. అలాంటి నన్ను పట్టుకుని మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు, మనోజ్‌లు వచ్చి ‘సారీ అంకుల్ ఏమీ అనుకోవద్దు. మీరు కూడా ఏమీ అనొద్దు’ అని సముదాయించారు. రేపు కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు వారికి భయపడి మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్లకి భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం మంచిది” అని బెనర్జీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

నన్ను కొట్టడానికి వచ్చారుః తనీశ్

“మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ అన్నలు అంటే నాకు ఇష్టం. ఓట్ల లెక్కింపు సందర్భంగా మోహన్‌బాబు అసభ్య పదజాలంతో తిడుతూ నన్ను కొట్టడానికి వచ్చారు. బెనర్జీ అడ్డుకునేందుకు వస్తే ఆయనను తిట్టారు. ఆ తర్వాత విషయం తెలిసి విష్ణు, మనోజ్ అన్నలు నన్ను ఓదార్చారు. అయినా మోహన్‌బాబు అన్న మాటలు జీర్ణించుకోలేకపోతున్నా. అందుకే రాజీనామా చేస్తున్నా. రేపు ‘మా’ సమావేశాలు జరిగినప్పుడు ధైర్యంగా మాట్లాడలేను” అని తనీశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

బెనర్జీ ఏడవడం చూడలేదు: ఉత్తేజ్

“మా’ఎన్నికల్లో లోకల్, నాన్‌లోకల్ అన్న వివాదం తీసుకొచ్చారు. సినిమాను అమితంగా ప్రేమించే ప్రకాశ్‌రాజ్ ‘మా’ కోసం ఏదైనా చేయాలని వస్తే, ఆయన వెంట మేము వచ్చాం. శివాజీరాజా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నరేశ్ జనరల్ సెక్రటరీ. ‘మా’ భవనం కోసం డబ్బును వృథా చేయకూడదని చాలా మంది బస్సులోనే వెళ్లాం. ఎన్నికలు జరిగే రోజున నన్ను అసభ్య పదజాలంతో తిట్టారు. నా 25 ఏళ్ల కెరీర్‌లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు. విష్ణు బ్రదర్ మీరు బాగా చేయగలరు. మీ వెనుక మీ నాన్నగారు ఉన్నారు. ‘మా’ సభ్యులను కాపాడే ప్రయత్నం చేయండి” అని ఉత్తేజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News