Saturday, April 20, 2024

ఇళ్లలోనే ఇండియా

- Advertisement -
- Advertisement -

 Janata curfew

 

‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన
కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు
బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు స్పందించిన కోట్లాది ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావడంతో పాటు వాహనాలేవీ తిరక్క పోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 14 గంటల జనతా బంద్ ఉదయం 7 గంటలకు మొదలు కావడంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తోడ్పడే సామాజిక దూరాన్ని పాటించడానికి ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమైనారు. అత్యవసర వస్తువులు, సేవలకు సంబంధించినవి మినహా అన్ని మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు జనతా కర్ఫూ ముగియనున్నప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సోమవారం ఉదయం వరకు కర్ఫూను పాటించాలని పిలుపునిచ్చాయి.

కర్ఫూ ప్రారంభం కావడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ‘రాబోయే కొద్ది నిమిషాల్లో జనతా కర్ఫూ ప్రారంభం కానుంది. మనమంతా ఈ కర్ఫూలో భాగస్వాములమవుదాం. కోవిడ్19 వైరస్‌ను అదుపు చేయడానికి జరిపే పోరాటానికి ఇది గొప్ప బలాన్ని అందిస్తుంది. ఇప్పుడు మనం తీసుకుంటున్న చర్యలు రాబోయే రోజుల్లో కరోనాపై పోరుకు తోడ్పడతాయి. ఇళ్లలోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి’ అని ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.

జనతా బంద్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఒకటి అరా వాహనాలు తిరిగినప్పటికీ అవన్నీ ప్రైవేటు వాహనాలే కాగా వాటి సంఖ్య కూడా నామమాత్రంగానే ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవడంతో ఉదయం పూట రోడ్లపక్క వ్యాపారాలు చేసుకునే వారు కూడా కనిపించలేదు. కొన్ని ప్రైవేటు బస్సులు మాత్రం తిరుగుతూ కనిపించాయి. ప్రధాని పిలుపులో భాగంగా కశ్మీర్‌లో జనం గుమికూడడం, తిరగడంపై కర్ఫూ తరహా ఆంక్షలు విధించారు. దీనితో పాటుగా కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి కశ్మీర్ లోయలో విధించిన లాక్‌డౌన్ నాలుగో రోజు కూడా కొనసాగింది. కోల్‌కతాలో సాధారణంగా నిత్యం రద్దీగా ఉండే ఎస్‌ప్లనేడ్, డల్హౌసీ ఏరియాలతో పాటు విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.

తూర్పు, ఈశాన్య రైల్వేలు ఈ రెండు జోన్లలో నడిచే అన్ని ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను ఆదివారం ఉదయం 4 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకు రద్దు చేసింది. అయితే పరిమిత సంఖ్యలో లోకల్ రైళ్లను మాత్రం నడిపింది. వాణిజ్య రాజధాని ముంబయిలో నిషేధాజ్ఞలు అమలులో ఉండడంతో జనం ఇళ్లకే పరిమితం కావడంతో మామూలుగా వాహనాల రద్దీతో కిక్కిరిసి ఉండే వెస్ట్రన్, ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వేలు, ఇతర ప్రధాన రహదారులన్నీ బోసిపోయి కనిపించాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే నాలుగు జిల్లాలు లాక్‌డౌన్‌లో ఉండగా, ఆదివారం జనతా కర్ఫూకు మద్దతుగా అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలను మూసివేయడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. గుజరాత్‌లో జనతా బంద్‌కు అద్భుత స్పందన కనిపించింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, సూరత్. వడోదర, రాజ్‌కోట్‌లలో రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలన్నీ ఉదయంనుంచే నిర్మానుష్యంగా మారిపోయాయి.

పర్యాటక ప్రాంతమైన గోవాలో కూడా జనం జనతా బంద్ పిలుపునకు సానుకూలంగా స్పందించడంతో రోడ్లు, బీచ్‌లు అన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. అత్యవసర సేవలకు సంబంధించినవి మినహా బస్సు సర్వీసులు, వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు, ప్రార్థనా స్థలాలు అన్నీ కూడా మూతపడ్డాయి. గోవా చర్చి ఆదివారం ప్రార్థనా సమావేశాలను రద్దు చేసింది. ప్రధాని పిలుపునకు సంఘీభావం తెలియజేస్తూ తమిళనాడులో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రధాన రోడ్లపై అక్కడక్కడా కొన్ని ప్రైవేటు వాహనాలు తిరుగుతూ కనిపించినప్పటికీ వాటి సంఖ్య నామమాత్రంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ఆటోలు, టాక్సీలు ఏవీ తిరలేదు.

ఒకరినుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాపించడాన్ని అడ్డుకోవాలంటే సామాజిక దూరం చాలా ముఖ్యమని, అందువల్ల తమకు తాముగా విధించుకున్న జనతా కర్ఫూను పాటించాలని పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, బిహార్ లాంటి రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకు పూర్తిగా లేదా పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రకటించాయి కూడా. శనివారం రాత్రినుంచే దేశంలోని ఏ రైల్వే స్టేషన్‌నుంచి కూడా ఒక్క ప్యాసింజర్ రైలు కూడా బయలుదేరలేదు.

ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఈ నిషేధం కొనసాగుతుంది. అలాగే ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా లాంటి ప్రధాన నగరాల్లో సబర్బన్ రైలు సర్వీసులను కూడా కనీస స్థాయికి తగ్గించారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ సహా అన్ని నగరాల్లో ఆదివారం మెట్రో సర్వీసులు కూడా రద్దయ్యాయి. గోఎయిర్, ఇండిగో, విస్తారా లాంటి ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా తమ దేశీయ విమాన సర్వీసులను కుదించుకున్నాయి. జనతా బంద్‌లో భాగంగా దేశవ్యాప్తంగా తమ వ్యాపార సంస్థలను మూసి వేయనున్నట్లు అఖిల భారత వ్యాపారుల మహా సమాఖ్య (సిఎఐటి) ప్రకటించింది.

 

response of Indian people to Janata curfew
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News