Home తాజా వార్తలు అరగంట విశ్రాంతి చాలు

అరగంట విశ్రాంతి చాలు

Rest

 

ఒక్క చేత్తో వెయ్యి పనులు చక్కబెట్టుకుంటారు మహిళలు. ఈ క్రమంలో మామూలు గృహిణికైనా, ఉద్యోగస్తురాలికైనా పనుల ఒత్తిడి ఎక్కువే. ఇంటి పనులు, పిల్లల పెంపకం, ఆర్థిక బాధ్యతలు, క్షణం తీరిక లేని పరుగులతో సంఘర్షణ నిత్యకృతం. ప్రతి ఒక్కరినీ సంతోష పెట్టాలి అనుకుంటే కష్టమే. ప్రతి పని పర్‌ఫెక్ట్‌గా చేయాలన్నా ఇబ్బందే. తమ చుట్టూ అల్లుకుంటున్న ప్రతి అంశాన్ని మేనేజ్ చేసుకుంటూ, తమ ఎమోషన్లనీ మేనేజ్ చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు.

సెల్ఫ్ మేనేజ్‌మెంట్ జీవితంలో లభించే వనరులను సమయాన్ని బట్టి ప్రాధాన్య క్రమాలను నిర్ణయించుకోవటం చాలా ముఖ్యం అంటారు నిపుణులు. ఇంటికి, ఆఫీసుకు సంబంధించి ఎన్నో పనులుంటాయి. ప్రతి పనీ సమర్థవంతంగా చేయాలనుకుంటారు మహిళలు. కానీ కొన్ని వర్కవుట్ కాక పోయినా పెద్ద గిల్టీగా ఫీలవనక్కర్లేదు. పనులు ఎప్పుడూ వస్తూ, పూర్తవుతూ, పెండింగ్ పడిపోతూ ఉంటూనే ఉంటాయి. ఈ పనుల ఒత్తిడిలో తమను తాము మేనేజ్ చేసుకోవటం ప్రతి మహిళకు పెద్ద సమస్య. చాలినంత విశ్రాంతి, నిద్ర, వ్యాయామం, పోషకాహారం అనేవి తప్పని సరి ప్రాధాన్యాలు కావాలి.

విశ్రాంతి ముఖ్యం మనుషులు యంత్రాలు కాదు. మనలోపల ఆన్ అండ్ ఆఫ్ బటన్లు ఉండవు. పని నుంచి విశ్రాంతి తీసుకోమని చెప్పే గడియారం ఎక్కడా ఉండదు. శక్తికి మించిన పని ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. చిన్న చిన్న హాబీలు ఉంటేనే కాస్త విశ్రాంతి. మనస్సు, శరీరం రిలాక్స్ అయ్యేందుకు పనుల మధ్య కాస్త విరామం ఉండాలి. ఒత్తిడిని పోగొట్టే వ్యాపకాలు అలవాటు చేసుకుంటూ మనసుకు, శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి.సమాజ పురోగతి అయినా అధోగతి అయినామహిళల స్థితిగతుల్ని బట్టే ఉంటుంది. కుటుంబంలో స్త్రీ పురుషుల్లో ఎవరు గొప్ప అన్న విషయంలో యుద్ధాలు అవసరం లేదు. అన్ని పనులూ ఇద్దరివే. ఇద్దరం కలిస్తేనే కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించ గలమన్న అవగాహన ఉంటే సమస్యలు రావు. జీవిత పరిపూర్ణత కోసం, భావిపౌరుల్ని తీర్చిదిద్దటం కోసం మహిళ అహర్నిశం శ్రమిస్తూ ఉంటుందని సమాజం అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఆహ్లాదపూరితంగా ఉంటుంది.

టైమ్ మేనేజ్‌మెంట్ పనిని, జీవితాన్ని, సమతుల్యపరుచుకోవాలంటే సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించటం నేర్చుకోవాలి. తగిన విధంగా లక్షాలు నిర్ణయించుకుంటే ముఖ్యమైన పనులు సకాలంలో, సజావుగా నడుస్తాయి. ఉన్న సమయాన్ని ఉన్న వనరులను సక్రమంగా వినియోగించటం నేర్చుకుంటే పెద్దగా ఎదుర్కోనవలసిన సవాళ్లు ఏమీ రావు. ప్రాధాన్యతాక్రమాన్ని బట్టి ప్రతి పనీ సవ్యంగా జరుగుతుంది.

జీవితంలో టెక్నాలజీ ఒక అంతర్భాగం. చుట్టూ మనకెన్నో ఉపయోగపడే వస్తువులు అందుబాటులోకొచ్చాయి. ఇంటి పనుల కోసం కొన్ని వస్తువులు సమకూర్చుకుంటే… ఉదాహరణకు కుక్కర్లు, వాషింగ్ మిషన్ లాంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పనిభారాన్ని తగ్గిస్తాయి. ఆ రకంగా ఫోను, వాట్సప్‌లు కూడా ఒక పనిని సమర్థవంతంగా ముగించేందుకు సాయంగా ఉంటాయి. కానీ వాటిని వినియోగించుకోవటంలో తెలివి చూపించాలి. మన చుట్టూ ఉండే పరికరాలు మనపై పెత్తనం చూపించకూడదు. మనం బానిసలు కారాదు. అది మన అదుపులో పనిచేస్తేనే మనకు లాభం.

ఒత్తిడి నిర్వహణ కొత్త తరం వస్తున్న కొద్దీ ఎక్కువ క్లిష్టతలు ఎదుర్కొంటున్నట్లే. పాతతరం కంటే కొత్త తరం ముందున్న బాధ్యతలు చాలా ఎక్కువ.ఈ తరం మహిళ ఇల్లాలిగా, ఉద్యోగినిగా రెండు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. జీవన ప్రయాణాలు, పనులు, ఇతరుల అంచనాలు పెరిగిపోయి ఒత్తిడి అనివార్యంగా పరిణమిస్తోంది. బహుళ పనులు మరింత భారాన్ని, ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మహిళ తెలివిగా వ్యవహరించాలి. తన కోసం స్పేస్ ఉంచుకోవాలి.

పనిలో పడి తన గురించి పట్టించుకోకుంటే అనారోగ్యం పాలుకావాల్సి వస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో కనీసం ఒక్క అరంట, తనకు ఇష్టమైన సంగీతం వినటం, తోటపని, లేదా కాసేపు బయట నడవటం, ఇష్టమైన భోజనం చేయటం, స్నేహితులతో కబుర్లు…ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చే టానిక్‌లు. ఒత్తిడిని తగ్గించే ఔషధాలు. ఆ అవకాశం మాత్రం మహిళలు పోగొట్టుకోకూడదు. నిరంతరం ఎడ తెగని పనుల హడావిడి లోంచి ఒక్క అరగంట విశ్రాంతి మరచిపోకూడదు. తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

 

Rest is important Humans are not machines