Home జోగులాంబ గద్వాల్ బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ

బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ

Beechupalli-Oil-Factory ఎన్‌డిడిబికి రూ.8 కోట్లకు టిఎస్ ఆయిల్‌ఫెడ్ వన్‌టైమ్ సెటిల్‌మెంట్
ఆన్‌లైన్‌లో రూ.2.11 కోట్లు, రూ.3 కోట్లు చెక్కుల ద్వారా చెల్లింపు
మూడు నెలల్లో మిగిలిన మొత్తం చెల్లించాలని నిర్ణయం
2011లో ఫ్యాక్టరీ విలువ రూ.2.37 కోట్లే ఉందంటున్న రిటైర్డ్ ఉద్యోగులు

హైదరాబాద్: ఉమ్మడి ఎపిలో తాళం పడిన గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీని పునరుద్ధరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం తెలంగాణ ఆయిల్‌ఫెడ్ జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్‌డిడిబి)తో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసుకుంది. ఆయిల్‌ఫెడ్ రూ.8కోట్లు చెల్లించి స్వాధీనం చేసుకోవాల్సి ఉం డగా, ఇందులో రూ.2.11 కోట్లు బుధవారం ఆన్‌లైన్ పేమేంట్ ద్వారా చెల్లించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే రూ.3కోట్లు చెక్కుల రూపంలో చెల్లించా రు. ఇంకా మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించేందుకు ఎన్‌డిడిబితో ఆయిల్‌ఫెడ్ అవగాహన కుదుర్చుకుంది.

వాస్తవానికి 2011లో ఈ బీచుపల్లి మిల్లు స్థలం, బిల్డింగ్స్, ప్లాంట్, ఇతర మిషనరి విలువను రూ.2.37 కోట్లుగా ఉందని, అయితే ఇప్పుడు రూ.8 కోట్లకు సెటిల్‌మెంట్ చేసుకోవడంపై మతలబు ఏముందని టిఎస్ ఆయిల్‌ఫెడ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రశ్నించింది. అలాగే బీచుపల్లి ఫ్యాక్టరీ ఉమ్మడి ఆస్తిగా ఉంది. నాడు ఏర్పాటు చేసిన నాడే ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినదిగా చేశారు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత విభజన జరగలేదు. విభజన జరగకుండానే ఎన్‌డిడిబికి అప్పులు చెల్లించడం ద్వారా భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు వస్తాయని వారు పేర్కొంటున్నారు.

వాస్తవానికి వేరుశనగ నుంచి నూనె తీసి విజయవర్ధనే ఆయిల్ ప్యాకెట్లతో పేరుగాంచిన ఈ మిల్లును 2003లో అప్పటి ఉమ్మడి ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దాన్ని మూసి వేశారు. ఈ మిల్లును నమ్ముకుని పంటలు సాగు చేసిన రైతులు ఎంతోకాలం ఆందోళన చేశారు. జాతీయ పాడి అభివృద్ధి మం డలి (ఎన్‌డిడిబి) ఆర్థిక సహకారంతో నిర్మించారు. ఈ ఫ్యాక్టరీని అప్పట్లోనే రూ. 11.26 కోట్లతో నిర్మించారు. వేరుశనగ నూనె, కేక్ ఆయిల్ తయారు చేసేవారు. 2003లో మూతపడినా ఎన్‌డిడిబి నుంచి తీసుకున్న అప్పును పూర్తిస్థాయిలో చెల్లించలేదు. దీంతో ఇప్పుడు ఇది తెరవాలని అప్పును చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

మళ్లీ వేరుశనగ నూనె ఉత్పత్తి మొదలు

ఫ్యాక్టరీని పునరుద్ధరించిన తరువాత మళ్లీ వేరుశనగ నూనెతోపాటు పామాయిల్ సహా ఇతరత్రా నూనెలను కూడా ఉత్పత్తి చేస్తామని ఆయిల్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత ఫ్యాక్టరీ యంత్రాలు బాగానే ఉన్నాయని, మరో కోటిన్నర రూపాయలు ఖర్చు చేస్తే ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో నడుస్తుదంటున్నారు. ఇందుకోసం కొందరు ఉద్యోగులను కూడా తీసుకోనున్నారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు వేరుశనగ సాగు చేసే రైతులకు మరింత ఆదాయం సమకూర్చడం, రాష్ట్రంలో ప్రజలకు తక్కువ ధరకే వేరుశనగ నూనె అందించడం కోసం ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు.

అయితే వివిధ రకాల అడ్డంకులు అధిగమించి ఆ ఫ్యాక్టరీ 1990లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ ఫ్యాక్టరీ పరిధిలో దాదాపు 135 మంది ఉద్యోగులు పనిచేశారు. రోజుకు 200 మెట్రిక్ టన్నుల వేరుశనగ నూనె సహా ఇతరత్రా నూనెలనూ అక్కడ ఉత్పత్తి చేసేవారు. విచ్చలవిడిగా వేరుశనగ కొనుగోలు చేయడం, బయట పడేయడం, పనికి రావంటూ కోట్ల రూపాయలు నష్టం వచ్చిందంటూ లెక్కలు చూపించడం ప్రధానంగా మారింది. దీంతో ఆయిల్‌మిల్లుకు తాళం వేశారు. దాన్ని అక్రమంగా మూసివేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కార్మికులను అనేకమందిని అందులోంచి తొలగించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి విఆర్‌ఎస్ ఇచ్చి తీసేశారు.

Restoration of Beechupalli Oil Factory