Home తాజా వార్తలు దిగొస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం

దిగొస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం

Retail inflation dips to 5.3 percent in august

 

ఆగస్టులో 5.30 శాతం నమోదు

న్యూఢిల్లీ : దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం దిగొస్తోంది. ఆగస్టు నెలలో నిలకడగా 5.30 శాతం నమోదైంది. ఇది వరుసగా రెండో నెలలోనూ ఆర్‌బిఐ కంఫర్ట్ జోన్‌లోనే ఉంది. అంతకుముందు జూలైలో ఇది 5.59 శాతంగా ఉంది. సోమవారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, వినిమయ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.30 శాతం నమోదైంది. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద 2 శాతం పైన, కింది స్థాయి పరిధిలోనే ఉండాలనేది ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) లక్షంగా ఉంది. ఇప్పుడు లక్షం పరిధిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం ఉంది. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.11 శాతంతో క్షీణించగా, జూలైలో ఇది 4 శాతంగా ఉంది. ఇక కూరగాయల ధరలు 11.7 శాతం తగ్గాయి. అయితే ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 12.95 శాతానికి పెరగ్గా, సేవల ద్రవ్యోల్బణం కూడా 6.4 శాతంతో పెరిగింది.

గత నెలలో సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ద్రవ్యోల్బణం ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ జూన్ త్రైమాసికంలో వేగంగా వృద్ధిని సాధించింది. తయారీ రంగం మెరుగైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202122) ఆర్‌బిఐ వృద్ధి రేటు అంచనా 9.5 శాతం ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి జూలైలో 11.5 శాతానికి పెరిగింది. తయారీ రంగం, గనులు, విద్యుత్ రంగం మంచి పనితీరును కనబర్చాయి. అయితే ఉత్పత్తి ఇప్పటికీ కరోనా మహమ్మారి ముందు స్థాయికి చేరుకోలేదు. తయారీ రంగానికి చెందిన ఐఐపి (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) 77.63 శాతం నమోదైంది. అంటే జూలైలో 10.5 శాతం పెరిగింది.

స్వల్ప నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడుదుడుకులను ఎదుర్కొన్నాయి. సూచీలు రేంజ్‌బౌండ్‌లోనే ట్రేడ్ అయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికిస సెన్సెక్స్ 127 పాయింట్లు లేదా 0.22 శాతం కోల్పోయి 58,177 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 14 పాయింట్లు కోల్పోయి 17,355 పాయింట్ల వద్ద ముగిసింది. హెవీవెయిట్ ఫైనాన్షియల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అయితే ఐటి, మెటల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు మార్కెట్‌కు భారీ నష్టాల ముప్పును తప్పించాయి. టిసిఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. మరోవైపు రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్, అదానీ పోర్ట్‌లో నష్టాలు వచ్చాయి. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ మెటల్స్, మీడియా 1.3 శాతం పెరిగాయి. ఫార్మా, ఐటి, రియాల్టీ సూచీలు కూడా మంచి లాభాలను చూశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ 100 సూచీలు అర శాతం పెరిగాయి.

Retail inflation dips to 5.3 percent in August