Home తాజా వార్తలు ఐదున్నరేళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

ఐదున్నరేళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

Retail Inflation

 

జనవరిలో 7.59 శాతం నమోదు
2014 నుంచి ఇదే గరిష్ట స్థాయి
ఆహార వస్తువుల ధరలు, టెలికాం చార్జీలు పెరగడమే కారణం

న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం ప్రతి నెలా పెరుగుతూ వస్తోంది. జనవరిలో ఇది 7.59 శాతానికి పెరిగింది. గతేడాది(2019) ఇదే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.35 శాతంగా ఉంది. ఆహార వస్తువుల ధరల పెరగడం, మరోవైపు టెలికాం చార్జీలు కూడా పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. 2014 మే నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. కూరగాయలు, పప్పుధాన్యాలు, మాంసం, చేపలు ఖరీదైనవి కావడంతో జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవ నెలలో 7.59 శాతానికి పెరిగింది. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదున్నర ఏళ్ల గరిష్టానికి చేరింది. 2014 మే నెలలో ఇది 8.33 శాతంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం 2019 డిసెంబర్‌లో 7.35 శాతంగా ఉంది.

గత ఏడాది జనవరి నెలలో 1.97 శాతంగా ఉంది. ఎన్‌ఎస్‌ఒ(కేంద్ర గణాంకాల శాఖ) ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని చూస్తే 2020 జనవరిలో 13.63 శాతం నమోదైంది. ఇది ఒక నెల క్రితం 2019 డిసెంబర్‌లో 14.19 శాతంగా ఉంది. అయితే 2019 జనవరిలో ఇది 2.24% క్షీణతను నమోదు చేసింది. కూరగాయల విషయంలో ఈ ఏడాది జనవరిలో ద్రవ్యోల్బణం 50.19 శాతానికి పెరిగింది. పప్పుధాన్యాలు, ఉత్పత్తులలో ద్రవ్యోల్బణం 16.71 శాతం పెరిగింది. మాంసం, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 10.50 శాతం కాగా, గుడ్డు ధరలు 10.41 శాతం పెరిగాయి. గణాంకాల ప్రకారం, ఆహార, పానీయాల విషయంలో ద్రవ్యోల్బణం 11.79 శాతం.

ఇంధనం ద్రవ్యోల్బణం 3.66 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ ద్రవ్య విధానంపై రిజర్వ్ బ్యాంక్ వైఖరి మృదువుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎమ్‌కె గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన రాహుల్ గుప్తా మాట్లాడుతూ, రిటైల్ ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని అధిగమించడం వరుసగా ఇది రెండో నెల అని అన్నారు. ద్రవ్యోల్బణం 6 శాతానికి మించి ఉంటే తదుపరి ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటును తగ్గిస్తుందని భావించడం లేదని అన్నారు. అధిక ద్రవ్యోల్బణాన్ని పేర్కొంటూ ఈ నెల ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.

Retail inflation rises to 7.59% in January