Home తాజా వార్తలు ఐదున్నరేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

ఐదున్నరేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

Onion

 

డిసెంబర్‌లో 7.35 శాతం నమోదు
ఉల్లి వంటి కూరగాయల ధరలు పెరగడమే కారణం
నవంబర్‌లో 5.54 శాతం
ఆర్‌బిఐ లక్ష్యాన్ని దాటింది

ముంబై : ఉల్లి వంటి కూరగాయల ధరలు భారీగా పెరగడం వల్ల గతేడాది డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్టానికి చేరింది. గత నెలలో 7.35 శాతం నమోదైంది. దీంతో ఆర్‌బిఐ లక్షం స్థాయిని దాటిపోయింది. ఈమేరకు సోమవారం జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎస్‌ఒ) తెలిపింది. డేటా ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్‌లో కూరగాయల ద్రవ్యోల్బణం 60.5 శాతానికి పెరిగింది. వినిమయ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2018 డిసెంబర్‌లో 2.11 శాతంగా ఉంది. 2019 నవంబర్‌లో ఇది 5.54 శాతంగా ఉంది. డిసెంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 14.12 శాతం ఉండగా, గతేడాది ఇదే సమయంలో మైనస్ 2.65 శాతంగా ఉంది. 2019 నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 10.01 శాతం గా ఉంది. గతంలో ఇంతటి స్థాయిలో ద్రవ్యోల్బ ణం 2014 సంవత్సరంలో నమోదైంది.

ఆ సమయంలో అత్యంత గరిష్ట స్థాయిలో 7.39 శాతంగా ఉంది. మరో విశేషమేమిటంటే 2014లో తొలిసారి గా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరోవైపు పప్పు ధాన్యాలు, ఉత్పత్తుల్లో ద్రవ్యోల్బణం 15.44 శాతం నమోదవగా, మాంసం చేపలు విషయానికొస్తే 10 శాతం నమోదైంది. 4 శాతం లక్షంగా ద్రవ్యోల్బణం ఉండాలని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్‌బిఐ) నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని తాజాగా గణాంకాలు మించిపోయాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగానే ఆర్‌బిఐ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. ఫిబ్రవరి 6న రిజర్వు బ్యాంక్ ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్ష నిర్వహించనున్నారు.

Retail inflation spikes to 7.35% in December