Home కరీంనగర్ హుజూరాబాద్ ఎన్నికల ఇంఛార్జిలు, సమన్వయకర్తలతో రేవంత్ భేటీ

హుజూరాబాద్ ఎన్నికల ఇంఛార్జిలు, సమన్వయకర్తలతో రేవంత్ భేటీ

Revanth reddy meeting with party leaders in huzurabad bypoll

 

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు వేయండి అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని టిపిసిసి చీప్ రేవంత్‌రెడ్డి కోరారు. హుజూరాబాద్ ఎన్నికల ఇంఛార్జిలు, సమన్వయకర్తలతో గురువారం భేటీ అయ్యారు. రానున్న వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలపై పార్టీ నేతలతో రేవంత్ చర్చలు జరిపారు. హుజూరాబాద్ ఎన్నికలలో నిరుద్యోగ యువత, విద్యార్థులను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఒక యువనాయకుడికి, విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చి ప్రొత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకెళ్లాలన్నారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలనే విషయమై ఓటర్లకు వివరించాలని ఆయన నేతలను కోరారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ల మోసపూరిత విధానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేసిన నష్టాలను వివరించాలని నేతలకు తెలిపారు.

బిజెపి, టిఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందాలని చీకటి రాజకీయాలను బయటపెట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉండేలా ప్రచార వ్యూహాలను అమలు చేయాలని నేతలను రేవంత్ కోరారు. ఈ ఉప ఎన్నికకు కారణం ఎవరు, దళిత బంధును అడ్డుకున్నదెవరనే విషయాలపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని పార్టీ విషయమై కూడ లోతుగా చర్చ జరగాలన్నారు. సమావేశంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపిలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Revanth reddy meeting with party leaders in huzurabad bypoll