Thursday, April 18, 2024

రేవంతు భూతంతు

- Advertisement -
- Advertisement -

Revanth Reddy

 

తప్పుడు డాక్యుమెంట్లతో 4.39 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేసిన రేవంత్‌రెడ్డి బ్రదర్స్!

సహకరించిన రెవెన్యూ అధికారులు
ప్రభుత్వ విచారణలో తేలిన విస్తుగొల్పే నిజాలు
గోపన్నపల్లిలోని 167 సర్వేనంబర్‌లోగల 10.2 ఎకరాల భూమికి తప్పుడు డాక్యుమెంట్ల సృష్టి
వేరే వారి పేరుమీద భూమి రాయించి వారి నుంచి కొనుగోలు చేసినట్లు కాగితాలు రాయించుకున్న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి
బాధ్యులపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్ : మల్కాజిగిరి ఎంపి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి, అతడి సోదరుడు కొండల్ రెడ్డి అక్రమంగా, తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా 4 ఎకరాల 39 గుంటల భూమిని తమ పేరు మీద రాయించుకున్నట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. ఈ నివేదికను రంగారెడ్డి జిల్లా రెవిన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు పంపారు. అక్రమ డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని మ్యుటేషన్ చేసిన అధికారులపైన, తప్పుడు మార్గంలో భూమిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించిన వారిపైనా చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ క్రమంలో గోపన్ పల్లి గ్రామంలోని 127 సర్వే నెంబర్ అక్రమ మ్యుటేషన్ చేసిన, అప్పటి తహసిల్దార్, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా డిప్యూటి కలెక్టర్, తహసిల్దార్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సిఎస్ సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సిఎస్‌కు అందిన నివేదిక, విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో అత్యంత ఖరీదు చేసే దాదాపు ఐదెకరాల భూమిని రేవంత్, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి అక్రమ మార్గంలో దక్కించుకున్నట్లు ఆధారాలతో సహా విచారణ అధికారులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ తప్పుడు పనికి పాల్పడినట్లు అధికారులు జరిపిన విచారణలో వెల్లడయింది. గోపన్‌పల్లిలోని సర్వే నెంబరు 127లో గల 10.21 ఎకరాల భూమికి సంబంధించి తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా క్రయ విక్రయాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణ జరిపింది. ఈ విచారణలో తప్పుడు మార్గాల ద్వారా, తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా మొదట వేరే వారి పేరు మీద భూమి రాయించి, తర్వాత వారి నుంచి తాము కొనుగోలు చేసినట్లు రేవంత్ రెడ్డి, అతడి సోదరుడు కాగితాలు రాసుకున్నట్లు తెలిసింది.

ఇంటి పేరు లేకపోవడంతో !
రంగారెడ్డి జిల్లా అధికారులకు సిఎస్‌కు పంపిన నివేదికలో ఈ భూ వివాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో 10.21 ఎకరాల భూమి ఉంది. -1977 వరకు ఈ భూమి వడ్డె హనుమ, అతని వారసుడు వడ్డె మల్లయ్య పేరు మీద ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. కానీ, 1978 నుంచి ఈ భూమి మల్లయ్య పేరు మీద పహాణీలో నమోదవుతూ వస్తున్నది. మల్లయ్య పేరు ఉంది కానీ, ఆయన ఇంటి పేరు లేదు. -199394నుంచి ఈ భూమికి పట్టాదారుగా దబ్బ మల్లయ్య అని రెవెన్యూ రికార్డుల్లో ఎంటర్ అవుతూ వస్తున్నది. దబ్బ మల్లయ్య పేరును ఎంటర్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, 200102 నుంచి పహాణీల్లో మల్లయ్య పేరును తొలగించారు.

ఆధారాలు లేకుండానే మార్పిడి
-2005లో అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్/తహసిల్దార్ ఇ.మల్లయ్యకు వారసుడిగా చెప్పుకునే ఇ.లక్ష్మయ్య పేరు మీద 2 ఎకరాల 21 గుంటల భూమిని రాసేశారు. ఆ భూమి లక్ష్మయ్య కాస్తులో ఉన్నట్లు తేల్చేశారు. అదే తహసిల్దార్ మళ్ళీ ఈ వివరాలను సవరిస్తూ, లక్ష్మయ్య కేవలం 31 1/2 గుంటల్లో కాస్తులో ఉన్నట్లు రాశారు. ఎలాంటి ఆధారం లేకుండానే లక్ష్మయ్య పేరు మీద మొదట 2 ఎకరాల 21 ఎకరాలను రాయడం, మళ్లీ సవరించి 31 1/2 గుంటలకు మార్చడం రెండూ కూడా తహసిల్దార్ తన అధికార పరిధిని అతిక్రమించి చేశారని విచారణలో గుర్తించినట్లు తెలిసింది.

ముందు వేరే వారి పేరు మీదకు.. తరువాత వారి పేరుకు
అక్రమంగా లక్ష్మయ్య పేరు మీద రికార్డుల్లో ఎంటర్ అయిన 31 1/2 గుంటల భూమిని ఎనుముల రేవంత్ రెడ్డి కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్ రాసుకున్నారు. ఇ. లక్ష్మయ్యకు ఎలాంటి పట్టదారు హక్కులు లేనప్పటికీ, అతని నుంచి భూమిని కొనుగోలు చేసినట్లు చేసుకున్న సేల్ డీడ్ ఆధారంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా తహసిల్దార్ వ్యవహరించారని సిఎస్‌కు పంపిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి పేరును ఈ భూమికి హక్కు దారుడిగా పేర్కొంటూ 2005లో అప్పటి తహసిల్దార్ రికార్డుల్లో ఎంటర్ చేశారు. -ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇ.లక్ష్మయ్య ఒక ఎకరం 29 గుంటల భూమిని రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి అమ్మాడు. అధికారులు ఆ కొనుగోలు ప్రకారం కొండల్ రెడ్డి పేరిట 2015లో మ్యుటేషన్ చేశారు.

మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ తన పేరు మీద ఉన్న డాక్యుమెంట్ల ద్వారా డి.మల్లయ్య అనే వ్యక్తి 2 ఎకరాల 20 గుంటల భూమిని కళావతి అనే వ్యక్తికి అమ్మాడు. ఈ భూమిని కూడా అధికారులు కళావతి పేరు మీద మార్పిడి (మ్యుటేషన్) చేశారు. ఆ తర్వాత ఆ భూమిని కళావతి నుంచి ఎ. కొండల్ రెడ్డి పేరు మీదికి బదిలీ చేశారు. ఇంకోవైపు 1989లో ఎ. వెంకటరెడ్డి అనే వ్యక్తి దబ్బ మల్లయ్య నుంచి ఒక ఎకరం పదిన్నర గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే 1989లో దబ్బ మల్లయ్య పేరు మీద భూమి ఉన్నట్లు రికార్డుల్లో లేదు. వెంకటరావు ఈ భూమిలోని 13 గుంటల భూమిని తర్వాత ఎ. కొండల్ రెడ్డి పేరు మీదికి బదలాయించారు. గోపనపల్లిలోని సర్వే నెంబరు 127లో గల భూమికి హక్కు దారులెవరు అనే విషయంలో స్పష్టత లేదని అధికారులు తేల్చారు.

Revanth Reddy who occupy land with false Documents
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News