Home వార్తలు బంతిపూలపై సంతకం

బంతిపూలపై సంతకం

ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడేందుకు వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు చూపించే ప్రేమ మరిచిపోలేనిది. అందరికీ నేను వారితో ఆడాలని ఉంటుంది దాంతో నా పక్కకు రావాలన్న తాపత్రయంలో సర్కిల్‌ను చెడగొడతారు,అది కొద్దిగా ఇబ్బందనిపించేది కాని వారి ప్రేమముందు ఆ ఇబ్బంది దూదిపింజలా మాయమయ్యేది. బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడి ఇంటికి వచ్చి చూసుకుంటే చేతినిండా గాట్లు.అందరూ చేయి పట్టి లాగడం,వారు చేతులకు తొడుక్కున్న గాజులు గీరుకపోవడంతో గాట్లు పడేవి.ఇంటికి వచ్చిచూసుకున్నాక ఆ అనుభూతి గమ్మత్తుగా ఉంటుంది. తొమ్మిది రోజులు ఒక్కపొద్దే ఉంటాను కాని అందరితో కలిసి ఉండడం వల్ల ఆకలి తెలియదు.వారి ప్రేమనే ఉత్సాహాన్నిస్తుంది.

రాష్ట్ర సంప్రదాయానికి చిరునామాగా మారిన బతుkavitha2కమ్మపై చెరగని బంతిపూల సంతకం చేశారు కల్వకుంట్ల కవిత.కోటి బతుకమ్మల ఉద్యమ నినాదాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.ఉద్యమంలో బతుకమ్మను, సకలజనులను సమైక్య పరిచే సాధనంగా ఎంచుకున్నారు.తెలంగాణ జాగృతిని స్థాపించి పదిజిల్లాల్లో నలుమూలలా పర్యటించి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను తెలియజెప్పారు.తండ్రికి తగ్గ తనయగా ఉద్యమంలో కెసిఆర్ కుడిభుజంగా వ్యవహరించారు. అభిమాన నాయకురాలిగా, ఉన్నత విద్యావంతురాలిగా, సమకాలీన అంశాలపై తన కలాన్నెక్కుపెట్టే రచయితగా, ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుకగా, పొందికైన కట్టూ, బొట్టుతో, నిండైన నవ్వుతో బహుముఖ ప్రఙ్ఞ కనబరుస్తున్నారు కవిత. కాకతీయుల కాలంనుండి రాష్ట్రానికి సాంస్కృతిక వారసత్వంగా వస్తున్న బతుకమ్మను విశ్వవ్యాపితం చేయాలన్నదే తన లక్షం అని చెబుతున్నారు. ఎంగిలిపూ బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్న ఈ శుభవేళ నిజామాబాద్ యం.పి.తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితతో జరిపిన ఇంటర్వూ మన తెలంగాణ పాఠకులకు ప్రత్యేకం…
మన తెలంగాణ : తెలంగాణ సంప్రదాయంలో బోనాలు, బతుకమ్మ,సమ్మక్క-సారలమ్మ జాతర వంటివన్నీ ఉన్నా, బతుకమ్మ నినాదాన్నే ఎందుకు తీసుకున్నారు..?
కవిత : బోనాలు సమ్మక్క-సారలమ్మ జాతర వంటివి మత పరమైన ఆచారాలు.వాటిని నిష్టతో చేయాల్సిన అవసరముంది.దాన్లో ఏ మాత్రం తేడా ఏర్పడినా అనవసర చర్చలకు దారితీస్తుంది.బోనాలను తీసుకున్నట్లైతే అది రెండు నెలలపాటు సాగే పండగ.ఒక్కో ప్రాంతంలో ఒక్కోవారం జరుగుతుంది.ఆషాఢమాసం మొదలై శ్రావణమాసం వరకు సాగుతుంది.ఉద్యమకార్యాచరణలో భాగంగా లక్షలమందిని ఒక్కతాటిపైకి తేవాలంటే నోములా చేసుకునే పండగ సరైనదనిపించింది.దానికి బతుకమ్మ సరిగ్గా సరిపోతుంది.ఇది ఒక ప్రకృతి ఆరాధన,మరీ ముఖ్యంగా జీవన విధానాన్ని ప్రతిబింబించే సంస్కృతి.రాష్ట్రోద్యమానికి ఊతమవ్వాలన్న ఉద్దేశ్యంతో బతుకమ్మను ఎంచుకున్నాను.
మ.తె: చిన్ననాటి చింతమడక అనుభూతులు చెప్పండి..?
Kavitha4కవిత : నా ఊహ తెలిసినప్పడినుండి ఎనిమిది, తొమ్మిది తరగతుల వరకు దసరా సెలవులకు నానమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం.అక్కడ రంగురంగుల పూలను సేకరించడం, బతుకమ్మను పేర్చడం,చుట్టుపక్కల తోటి పిల్లలతో ఆడి చెరువుగట్టుకు సద్దులుగట్టుకొని వెళ్ళడం మరిచిపోలేనివి.ఇంట్లో పెద్దవాళ్ళు రకరకాల ఫలహారాలు తయారుచేసిచ్చేవారు.సద్దుల బతుకమ్మనాడు ఇంటి ఆడపిల్ల ఎంత ఎత్తులో ఉంటే అంత ఎత్తు బతుకమ్మను పేర్చేది నానమ్మ.అలా తను చనిపోయేంతవరకు బతుకమ్మ ఆడడానికి అక్కడికే వెళ్ళాం.ఆ తర్వాత హైదరాబాద్‌లో ఆడేవాళ్ళం.

మ.తె: వ్యక్తిగతంగా మీకు బతుకమ్మకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది దీనికి కారణం ఏంటి..?
కవిత : కారణం మా నానమ్మ.దసరాసెలవులు ఇచ్చారంటే మెదక్‌జిల్లా సిద్దిపేట దగ్గరలోని చింతమడక గ్రామంలో ఉన్న నానమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం.అక్కడ నానమ్మ పేర్చిన బతుకమ్మే నేటికీ నా ఊహల్లో ఉంది.వేళ్ళను చాకచక్యంగా కదుపుతూ తాను పేర్చిన బతుకమ్మను చూసి నేనూ నేర్చుకున్నాను.ఎంగిలిపువ్వు బతుకమ్మ,సద్దుల బతుకమ్మ నానమ్మ పేర్చి మధ్యలో అన్ని రోజులు నాకు ఆ అవకాశం ఇచ్చేది.అలా రంగులద్దడం,రకరకాల రంగుల పూలను ఒక క్రమంలో అమర్చడం వంటివి చిన్ననాటి నుండే అలవాటయ్యాయి.

మ.తె: గ్రామాల్లో ఆడే ఆటకు నగరాల్లోని ఆటకు తేడా ఏమైనా ఉందా..?
కవిత : చాలా తేడా ఉంటుంది. పదవ తరగతి నుండి కార్పొరేట్ చదువుల ప్రభావం నాపైన కూడా పడింది. దాంతో ఆటకు సమయం దొరికేది కాదు.అయినా ముచ్చట తీర్చాలని అమ్మ శ్రమపడి ఎంగిలిపువ్వు ,సద్దుల బతుకమ్మ ఆడే రెండురోజులు బతుకమ్మను తయారుచేసి ట్యాంక్‌బండ్‌కు పంపేది. చుట్టుపక్కలవారు వచ్చేవారుకాదు.అదంతా కృత్రిమంగా అన్పించేది.ఇంటర్‌లో చదువు ఒత్తిడి పెరగడంతో ఆడడం మానేశాను. తర్వాత ఇంజనీరింగ్,జి ఆర్ ఇ.టోఫెల్. యు.ఎస్ కు వెళ్ళి ఎమ్మెస్ చేయడంతో ఆట పూర్తిగా మానేశాను.
మ.తె: తిరిగి బతుకమ్మ ఆడడం ఎప్పుడు మొదలుపెట్టారు..?

kavithaకవిత : 2005 సంవత్సరంలో ఒక దినపత్రికవారు బతుకమ్మపాటలతో పండుగను నిర్వహించారు.అది చూసి స్ఫూర్తి పొందాను. ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహించుకోవాలన్న ఆలోచన అప్పుడే కలిగింది. సంవత్సరం తర్వాత ఉద్యమంలో భాగంగా నాన్న తన పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళారు.ఆ సమయంలో దేశ విదేశాల నుండి ప్రచారం నిర్వహంచడానికివచ్చిన వారిని చూసి నేనూ ఉద్యమంలో భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నాను.
మ.తె: ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నారు..?
కవిత : ఉద్యమ ఆలోచన వచ్చిందే తడవు కొందరు మహిళలను కలిశాను. ఆ సమయంలో ఒక మహిళ నా దగ్గరకు వచ్చి నెలకు వెయ్యి రూపాయలు వచ్చేలా మా బతుకులను మారిస్తే పిల్లలను చదివించుకుంటాం అని దీనంగా అడిగింది. తన మాట నన్ను మరింత లోతుగా ఆలోచింపజేసింది. అదే తెలంగాణ జాగృతికి బీజమయ్యింది.

మ.తె : ఉద్యమస్ఫూర్తి పెంచడానికి బతుకమ్మను ఏ విధంగా వాడుకున్నారు..?
కవిత : ముందుగా తెలంగాణ పదిజిల్లాల్లో విస్తృతంగా పర్యటించాను.ఆచార వ్యవహారాలు అవగాహన చేసుకున్నాను. సంవత్సరంపాటు గ్రౌండ్ వర్క్ చేసి కార్యాచరణ రూపొందించుకున్నాను.ఆ కార్యచరణలో భాగమే కోటి బతుకమ్మల నినాదం.తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ ఎత్తుకోవాలన్నదే నా ఉద్దేశం. దీన్లో కుల, మత, వర్గ, ప్రాంత విభేదాలు లేవు, ఎందుకంటే బతుకమ్మ పండగే కాదు, అదో పెద్ద ఉత్సవం.ఉద్యమంలో భాగంగా పెద్ద సంఖ్యలో మహిళలం చేరి ట్యాంక్‌బండ్(అనుమతి లేదు) మీద ఆడుకున్నాం.అంతమంది మహిళలు ఆడడానికి రావడంతో పోలీసులూ ఏం అనలేకపోయేవారు.

మ.తె: జాగృతికి పేరు,కార్యాచరణ ఎవరు నిర్దేశించారు..?
kavitha8కవిత : అది పూర్తిగా నా ఆలోచనే,ఆలోచన రాగానే మావారితో పంచుకున్నాను, చూచాయగా కార్యాచరణ వివరించాను.ఆ మార్గంలో వెళితే ఎదురయ్యే రకరకాల సమస్యలను చర్చించుకున్నాం.ఇంటగెలిచి రచ్చ గెలవాలన్నది నా సిద్ధాంతం.కుటుంబంలో ఉండే భర్త,పిల్లలు,అత్తమామలనే ఒప్పించలేకపోతే సమాజాన్ని ఏ విధంగా ఒప్పించగలను…రెండు నెలల దీర్ఘాలోచన అనంతరం మావారు గో ఎహెడ్ అని చెప్పారు(బతుకమ్మకు సిబ్బి ఎలా అయితే ఊతం ఇస్తుందో మావారు నాకలా సపోర్ట్ చేస్తారు).తర్వాత అత్తమామలకు చెప్పి అడుగు ముందుకు వేశాను.
మ.తె: బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించడానికి మీరు చేసిన కృషి..?
కవిత : ఏటికేడు మహిళా భాగస్వామ్యం పెంచుతూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం.ప్రభుత్వాన్ని పదే పదే అభ్యర్తించడంతో 2012 సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించింది. తెలంగాణలోని పది జిల్లాలకు ఒక్కో జిల్లాకు లక్ష చొప్పున పది లక్షల రూపాయలను మంజూరు చేసింది.ఇదంతా తెలంగాణ ఆడబిడ్డల ఉద్యమ ఫలితం.
మ.తె: తెలంగాణ జాగృతి బతుకమ్మకు పునరుజ్జీవం పోసిందా..?
కవిత : కాకతీయుల కాలంనుండి వారసత్వంగా మనకు వచ్చింది బతుకమ్మ పండుగ.అదే కొనసాగుతున్నది.మన ముందు తరాలవారు ఆ పాటను,పద్ధతిని కాపాడుతూ వచ్చారు.అలా కొనసాగిన సంస్కృతినే తెలంగాణ జాగృతి చేబట్టి మరింత వెలుగులోకి తెచ్చి,ఆడబిడ్డల్లో స్వరాష్ట్ర సోయిని పెంచింది.మొదట తొమ్మిది సంవత్సరాలు మాత్రమే నిర్వహిద్దామని అనుకున్నాం కాని అమ్మమ్మ నుండి అమ్మకు,అమ్మ నుండి నాకు అందిన ఈ సాంప్రదాయం నా తరువాతి తరానికి అందివ్వడం బాధ్యతగా భావించాను.నాకు బతుకమ్మ అంటే ఎంత ఇష్టమో అమ్మకు తెలుసు అందికే అంటుంది నాకు అమ్మాయి ఉండిఉంటే బాగుండునని.దీన్లో పెద్ద సంఖ్యలో యువతను భాగస్వామ్యం చేయాలని నుకుంటున్నాం.

మ.తె: బంగారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నట్లుగా గిరిజనుల సాంప్రదాయ జాతర అయిన సమ్మక్క-సారలమ్మ జాతరలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పాల్గొనలేదనే వాదన కొందరు చేస్తున్నారు మీరేమంటారు..?
కవిత : గతంలో మూడుసార్లు నేను వెళ్ళాను.వ్యక్తిగత కారణంతో ఈ సంవత్సరం వెళ్ళలేకపోయాను.మిగిలిన కుటుంబ సభ్యులవిషయంలో వారి షెడ్యూల్ వేరే విధంగా ఉండి ఉంటుంది.ఇదొక పాయింట్ ఆఫ్ డిస్కషన్ అని నేననుకోను.ఇటీవలి జాతరలో జాగృతి తరఫున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.జిల్లా ప్రజలు కూడా మెచ్చుకున్నారు.కలెక్టర్ల చేతులమీదుగా జాగృతి ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు.ఈ ప్రశ్న ఆశ్చర్యకరంగా ఉంది.

మ.తె: తెలంగాణ జాగృతి ఎంతమందితో ఏర్పడింది,నేడు ఎంతమంది ఉన్నారు,లక్షం ఏమిటి..?
కవిత : ఉన్నత విద్యావంతులైన 15మంది యువతతో జాగృతి మొదట ఏర్పడింది.వారంతా ఉద్యోగాలను కూడా వదిలి రావడం స్ఫూర్తిదాయకం.నేడు ఆ సంఖ్య లక్షకు చేరింది.సామాజిక సేవచేయడమే తెలంగాణ జాగృతి లక్షం.
మ.తె: రాష్ట్ర ఏర్పాటుకు ముందు సకలజనుల బతుకమ్మగా ఉండి నేడు స్వరాష్ట్రంలో బంగారు బతుకమ్మగా ఎందుకు మార్పు చెందిందనే వారికి ఏం చెబుతారు..?
కవిత : రాష్ట్రం ఏర్పడకముందు కూడా బంగారు బతుకమ్మగా పిలిచాం.బతుకమ్మ సంబరాలన్నాం నేడూ అదే అంటున్నాం. విమర్శలు నాడూ నేడూ ఎదుర్కుంటున్నాం(విద్యార్థులు బలిదానాలు చేసుకుంటుంటే బతుకమ్మ ఆడుతున్నారని అందరూ ప్రశ్నించారు, కాని కష్టాన్ని దాటుతూ విశ్వాసాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అందికే ఆడుతున్నామని చెప్పాం అప్పుడు). బతుకమ్మ అంటేనే అందరి కలయిక.దీన్నుండి బహుజనులను విడదీయాలనే ఆలోచన ఎవరిదో,ఎందుకో నాకు తెలియదు.నా ఆలోచన సుస్పష్టం…బతుకమ్మను ఎన్నిపేర్లు పెట్టి పిలిచినా,ఎంతమంది ఆడబిడ్డలు బతుకమ్మను ఎత్తుకుంటే అంత తెలంగాణ పతాకం పైకి ఎగురుతుందన్నదే.అలా ఎగరాలన్నదే నా కోరిక.
మ.తె: నానమ్మచాటు కవితగా నాడు,జాగృతి అధ్యక్షురాలిగా ప్రజలతో మమేకమై నేడు బతుకమ్మ ఆడుతున్నారు కదా ఆటలో గాని మీలో గాని ఏమైనా మార్పు వచ్చిందా..?
కవిత : (నవ్వుతూ) నాలో మార్పు ఏనాడూ లేదు.అప్పుడూ ఇప్పుడూ ఒకేతీరుగా ఉన్నాను. బతుకమ్మ ఆటలో మాత్రం కొంత మార్పు వచ్చిందనే అనుకుంటున్నాను. అప్పుడు కలుషితం కాని వాతావర ణంలో,బంధుమిత్రులందరితో కలిసి ఆనందంగా ఆడుకున్నాం.ముఖ్యంగా మా ఇంట్లో బతుకమ్మ పండుగ అంటే చిన్నపాటి పెళ్ళి వాతావరణమే ఉండేది.తొమ్మిది మంది మేనత్తలు వచ్చేవారు. మా ఊరి ముఖ్య సెంటర్‌లో పెట్టి ఉత్సాహంగా రకరకాల పాటలు పాడుతూ గంటల తరబడి ఆడేవాళ్ళం.ఆట పూర్తయ్యాక భాజా భజంత్రీలతో చెరువుగట్టుకు తీసుకువెళ్ళి(అందరం వెళ్ళేవాళ్ళం) చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళం కాని నేటి పరిగెత్తే జీవనవిధానంలో సమయం వెచ్చించడం కష్టమవుతుంది.పాత రోజుల్లో చెరువులే జీవనాధారంగా ఉండేవి.వర్షాకాలంలో కొత్తనీరు వచ్చిచేరే సమయంలో బతుకమ్మలో అలంకరించిన ఔషధ విలువలున్న తంగేడు,కట్ల,గునుగు,గుమ్మడి,బంతి,రుద్రాక్ష వంటి పూలు నీరు శుద్ధి కావడానికి ఉపయోగపడేవి.నేడు ఆ అలంకరణల్లో మార్పు చోటుచేసుకున్నది.
మ.తె: బతుకమ్మను మీరు ఇంతగా ఆరాధించడానికి కారణం..?
kavita8కవిత : 1) బతుకమ్మలో అలంకరించే గునుగు,తంగేడు,కట్లపూలు ఎవరో పెంచేవికావు, వాటంతట అవే పూస్తాయి.ఖరీదు ఎక్కువకాదు కేవలం గడ్డిపూలు.కాని వాటికీ ఒక గుర్తింపునిచ్చి బతుకమ్మగా పేర్చితే ఎంత అందం వస్తుందో,సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఉంటే అంతే అందమైన ప్రపంచం ఏర్పడుతుందన్నది దీన్లో అంతర్లీనంగా నాకు అగుపించే సత్యం.
2) ఏదో బతుకమ్మ పేర్చి ఒక్కరే ఆడుకుందామంటే కుదరదు.కలిసికట్టుగా ఆడాల్సిందే.ఇది సమిష్టితత్వాన్ని పెంపొందిస్తుంది.నేడు ఏ పిల్లాడు/పిల్లను చూసినా చేతిలో మొబైల్,ట్యాబ్ ,ల్యాప్‌ట్యాప్‌లతోనే కనిపిస్తారు.పిల్లల్ని వీటినుండి దూరం చేయడానికైనా కోలాటం వంటివి నేర్పించి భాగస్వామ్యులను చేయాలి,దీని ద్వారా లభించే సమైఖ్యభావన ఎన్నో రుగ్మతలను దూరం చేస్తుంది.
3) బతుకమ్మలో ప్రతిది మహిళలకు సంబంధించిన అంశమే ఉంది.సాధారణంగా ఆడపిల్లలకు పెళ్ళిండ్లు చేసి చేతులు దులుపుకోకుండా,వారిని కనీసం సంవత్సరంలో ఒకసారైనా తల్లిగారింటికి ఆహ్వానించి గౌరవించాలన్న సాంప్రదాయం ఇమిడి ఉంది.
మ.తె : మీరు బతుకమ్మ ఆడేందుకు మీ తల్లిగారింటికి వెళుతున్నారా..?
కవిత : ప్రతి సంవత్సరం వెళతాను.ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు విదేశాలకు(తొమ్మిది దేశాలు) వెళుతున్నందున కొంత ఇబ్బందిగా ఉన్నది.కాని అమ్మ తప్పకుండా ఇంటికి రావాలని పట్టుబట్టడంతో మధ్యలో ఇక్కడకు వచ్చి తిరిగి విదేశం వెళుతున్నాను.
మ.తె: ఇక్కడ అభిమానులను వదలి విదేశాల్లో సంబురాలు నిర్వహించాలని ఎందుకనుకున్నారు..?
కవిత : రాష్ట్రావతరణంతో పాటుగా మన అస్తిత్వం మనకు వచ్చింది.ఇప్పుడు బతుకమ్మతో పాటుగా రాష్ట్రఖ్యాతినీ విశ్వవ్యాపితం చేయాలన్న ఉద్దేశంతో విదేశాల్లో సంబరాలను నిర్వహించేందుకు జాగృతి నిర్ణయించింది.దీన్ని నేను కల్చరల్ ఎక్స్‌ఛేంజ్‌గా భావిస్తాను. పాశ్చాత్య పండుగలను మనం నిర్వహించుకున్నట్లే వారూ మన పండుగలను ఆదరించాలన్నది జాగృతి ఆలోచన. యోగా,భారతీయ కుటుంబ వ్యవస్థ ఏ విధంగా అయితే గ్లోబలైజ్ అయ్యాయో బతుకమ్మకు కూడా ఆ గుర్తింపు తీసుకురావాలన్నదే నా లక్షం. అందికే బతుకమ్మ సంబరాలు ఈ సంవత్సరం విదేశాల్లో నిర్వహించి అక్కడి ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అమ్మకు దూరమయ్యామనే భావన వారిని భారతీయతవైపు మళ్ళిస్తుంది. అక్కడ ఉండే పిల్లలతో పోలిస్తే నా కొడుకుకు తక్కువ తెలుగు పద్యాలు వస్తాయి. వాళ్ళకంటే మనం ఎక్కువ ఇంగ్లిష్‌లో మాట్లాడతాం.ఇక ఇక్కడ కార్యక్రమాలను జాగృతి కార్యకర్తలకే వదిలేశాను.1100 ప్రదేశాల్లో జాగృతి కార్యకర్తల ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో సంబురాలు జరుగుతాయి. కాకపోతే ఇక్కడి ఆడబిడ్డలను మిస్ అవుతాననే బాధ మాత్రం ఉంది.
మ.తె: మీ ధృఢసంకల్పానికి,ఆలోచనలకు,ఆచరణలకు స్ఫూర్తి ఎవరు..?
కవిత : 100శాతం నాన్నగారే మాకు స్ఫూర్తి.నాన్నగారిది ముక్కుసూటి మనస్తత్వం,మాక్కూడా వారసత్వంగా దాన్ని అందించారు.మనసులో ఒకటి పెట్టుకొని బయటకు వేరేది చెప్పడం నాన్నకు ఇష్టముండదు.చిన్నప్పుడు నాన్న మాకెప్పుడూ ఓ పద్యం చెప్పేవారుఆరంభించరు నీచమానవులు అని అదే మమ్మల్ని కార్యసాధన దిశగా నడిపిస్తున్నది.
మ.తె: మీ కుటుంబంలో మీకు అత్యంత సన్నిహితులు ఎవరు..?
కవిత : అన్నయ్యనే(రామ్ కల్వకుంట్ల) నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి.నాకు కలిగే సంతోషం,బాధ అన్నతోనే పంచుకుంటాను.మా ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్ చూసి మా వారు కూడా కుళ్ళుకుంటారు.
మ.తె: ఉద్యమ సమయంలో జాగృతి ద్వారా జనాలను జాగృతం చేసి కె సి ఆర్ గారికి కుడిభుజంగా వ్యవహరించారు,మరి కె సి ఆర్ గారి రాజకీయ వారసత్వం కూడా అందుకుంటారా..?
కవిత : ఆ చర్చే లేదు. వారసత్వం గూర్చి ఇప్పుడెందుకు. కె సి ఆర్ గారే గట్టిగా ఉన్నారు. పదికాలాల పాటు ఉంటారు కూడా.
మ.తె: బతుకమ్మకు ప్రభుత్వం మంజూరు చేసిన 15కోట్ల నిధులు మీకోసమే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.తెలంగాణ జాగృతికి వాటితో సంబంధం ఉందా..?
కవిత : ఎంతమాత్రం సంబంధం లేదు.మన సమాజంలో చట్టాలపై అందరికీ అవగాహన ఉంది.సమాచారా హక్కు చట్టం ద్వారా ఎవరైనా వివరాలు పొందవచ్చు.
మ.తె: కవిత గారు మీ విదేశీ పర్యటన మరియు బతుకమ్మ సంబురాలు విజయవంతమవ్వాలని కోరుతూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా పాఠకుల తరఫున తెలియజేస్తున్నాం.
కవిత- ధన్యవాదాలు.ఈ బతుకమ్మ మన తెలంగాణ పాఠకులందరి జీవితాల్లో శుభాల్ని నింపి,ఆనందాన్ని పంచాలని కోరుతున్నాను.