Home ఎడిటోరియల్ రాజకీయాలతో అపహాస్యం

రాజకీయాలతో అపహాస్యం

Politicsపుల్వామా టెర్రరిస్టు దాడి ఎంత తీవ్రమైనదో, బాధాకరమైనదో, అందుకు సంబంధించిన తదనంతర రాజకీయాలు అంత అపహాస్యంగా మారాయి. దాడి జరిగిన దరిమిలా యావద్దేశం ఆగ్రహంతో ఊగిపోయింది. అందుకు ప్రతీకారంగా యుద్ధం సరైనదా కాదా అనే చర్చను అట్లుంచి, ఒకవేళ అటువంటిది కేవలం బాలాకోట్ దాడిగా మిగలక పూర్తిస్థాయి యుద్ధంగా సాగినప్పటికీ దేశంలో అత్యధికులు ఆమోదించి ఉండి వారేమో అన్నట్లు కన్పించింది పరిస్థితి. అటువంటిది బాలాకోట్ తర్వాత రెండు రోజులకే అపహాస్యంగా మారటం మొదలైంది. అందుకు కారణం ప్రజలు కాదు. కేవలం రాజకీయాలు, ఒక మేరకు మీడియా. ఎన్నికలు సమీపంలో లేకపోయినప్పటికీ మన దేశంలో రాజకీయ స్థాయి, మీడియా స్థాయి అటువంటివే. ఎన్నికలు ఎపుడైనా రానున్నందున అందు కు ఇక అదుపు లేకుండాపోయింది. వ్యవహారం అపహాస్యం కావటమే కాదు, రాజకీయ పార్టీలపైన జుగుప్స కలుగుతున్నది. విచక్షణ, విలువలతో ఆలోచించే వారికి మీడియాపై కూడా అటువంటి భావమే ఏర్పడుతున్నది.

ఈ క్రమంలో ఏమేమి జరిగిందో, ఇంకా జరుగుతున్నదో ఒకసారి సమీక్షించి చూద్దాము. ఇందుకు అధికార పక్షం, ప్రతిపక్షాలు ఏవీ మినహాయింపు కాదన్నది ఈ సమీక్షకు ముందు గుర్తుంచుకొనవలసిన విషయం. అట్లాగే ఈ ధోరణులు అడుగడుగునా కనిపిస్తూ వస్తున్నాయి. మొదట చో టు చేసుకున్న పరిణామం పుల్వామా వద్ద సిఆర్‌పిఎఫ్ వాహన శ్రేణిపై జైషే మహమ్మద్ అనే సంస్థకు చెందిన స్థానిక కశ్మీర్ యువకుని ఆత్మాహుతి దాడి. అందులో 40 మంది జవాన్లు మృతి చెందారు. అందుకు బాధ్యత తమదని జైష్ సంస్థ స్వయంగా వెంటనే ప్రకటించింది. ఇవన్నీ నిర్వచనాలకు, ఊహాగానాలకు చోటులేని వాస్తవాలు.
అయితే ఇందులో గ్రహించవలసినవి కొనున్నాయి. జైష్ సంస్థ పాకిస్థాన్ నుంచి పని చేస్తున్న పాకిస్థానీ సంస్థ. దానికి కశ్మీర్‌లో అనుయాయులున్నారు. వారిలో స్వయంగా కశ్మీరీలు అయినవారు, పాకిస్థాన్ నుంచి వచ్చి ఆ సంస్థ కోసం పని చేస్తున్న వారు కూడా ఉన్నా రు.

జైష్‌తో, పాక్‌తో సంబంధం లేకుండా స్థానిక సంస్థలలో పని చేస్తున్న స్థానిక మిలిటెం ట్ల క్రమంగా పెరుగుతుండటం కొంత కాలంగా ఉన్న ధోరణి. ఇది భారత ప్రభుత్వం, సైన్యం కూడా గుర్తించిన పరిణామం. ఇదంతా చెప్పుకోవటం ఎందుకంటే, ఇటువంటి వాస్తవాల విశ్లేషణను బట్టే మన ప్రతిస్పందన ఆధారపడి ఉండాలి. పుల్వామా ఘటనకు సంబంధించి అందులో పాల్గొన్న యువకుడు స్థానిక కశ్మీరే అయినప్పటికీ పాక్ భూభాగం నుంచి పని చేస్తున్న పాకిస్థానీ సంస్థ సభ్యునిగా ఉన్నాడు. ఆ ఘటన మహాతీవ్రమైనది. అటువంటపుడు అందుకు స్పందనలో మెతకదనం ఏమీ ఉండనక్కరలేదు. కనుక వాయుసేన బాలాకోట్‌పై దాడి జరిపింది.అది సరిగా జరిగిందా లేదా, ఫలితా లు ఏమిటన్నది పక్కన ఉంచితే, జరగటం అంతవరకు సమర్థించదగినదే. అది దేశ ప్రజలను ఏదో ఒక మేరకు సంతృప్తి పరచింది కూడా.

అది జరిగిన తర్వాత ప్రభుత్వం, ప్రతిపక్షాలు చేయవలసింది, దేశ ప్రజలు ఆలోచించవలసింది ఏమిటి? ఈ సమస్య పదుల ఏళ్లుగా సాగుతున్నది. ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కశ్మీర్‌ను పురస్కరించుకుని యుద్ధాలు కూడా నడిచాయి. సమస్య మహా క్లిష్టమైనది. ఇరు దేశాలు అణ్వాయుధాలను సమకూర్చుకోవటంతో మరింత క్లిష్టంగా, సున్నితంగా తయారైంది. మొత్తం ప్రపంచంలోని అతి ప్రమాదకరమైన స్థితులలో ఇజ్రాయెల్ పాలస్తీనాకు మించినది కశ్మీర్ అన్నది పరిశీలకుల అభిప్రాయం. ఉత్తర దక్షిణ కొరియాల సమ స్య కూడా ఇదే విధంగా తీవ్రమైనదిగాని, కొన్ని విధాలుగా చూసినపుడు కశ్మీర్ అంతకన్న ప్రమాదకరమని భావించే వారున్నారు. అందుకు పరిష్కారాలను సూచించినవారు లేకపోలేదు. ఉదాహరణకు ఒకపుడు సిమ్లా సమావేశ సమయంలో అప్పటి ప్రధానులు ఇందిరా గాంధీ, జుల్ఫీకర్ అలీ భుట్టోలు “ఎవరి కశ్మీర్‌ను” వారే ఉంచుకుని వాస్తవాధీనరేఖనే అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించుకోవటం మంచిదని సూత్ర రీత్యా అంగీకారానికి రావటం వంటిది. కాని తర్వాత ఇరువురూ తమతమ దేశాలలోని ప్రతిపక్షాలకు, ప్రజాభిప్రాయానికి భయపడి వెనుకకు తగ్గారు. ఇదంతా ఇపుడు రహస్యం కాదు. ఇదంతా చెప్పుకోవటం ఎందుకంటే, పుల్వామా వంటి ఘటన దరిమిలా ఇరు దేశాలు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించటం మొదలు పెట్టవలసింది. బాలాకోట్‌పై వైమానిక దళ దాడి తక్షణమైన, అనివార్య ప్రతిస్పందన అనుకుంటే, అక్కడి నుండి పరిష్కారం దిశగా అడుగులు పడితే అం దువల్ల ఉపయోగం ఉంటుంది. లేనిపక్షంలో ఈ విష వలయం ఇట్లా అంతులేకుండా సాగుతూనే ఉంటుంది. రెండు దేశాల నాయకత్వాలు ఈ పద్ధతిలో పరిణతితో ఆలోచించటం శ్రేయస్కరమయేది. దానిని ప్రపంచం కూడా హర్షించేది.

ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్న దేమిటి? ఒక క్రమంలో చూద్దాము. వెంటనే కన్పించింది, అధికార పక్షం పుల్వామాను ఎన్నికల సమయంలో ఓట్ల జాక్‌పాట్‌వలె చూడటం. అది వారికి నిజంగా నే జాక్‌పాట్ కాగలదనే జంకుతో ప్రతిపక్షాలు ఆ ఘటనపైనా, బాలాకోట్ దాడిపైనా ప్రజలలో రకరకాల అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నించటం. ఆ విధంగా రెండు వైపుల నుంచి ‘మూడ్ సెట్’ కావటమన్నది జరిగిపోయింది. అదే పద్ధతిలో ఎవరి వ్యూహాలు వారు తయారు చేసుకుని వ్యవహరించసాగారు. ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. దీనంతటి మధ్య రెండు వైపుల నుంచి అనేక మాటలు, ప్రశ్నలు, వాదనలు వినిపిస్తూ వస్తున్నాయి. అన్నీ కలిసి ఉభయ పక్షాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరించేవి తప్ప, దేశ ప్రయోజనాలు అన్నవి వారికి నిజంగా ఏమీ లేవన్న అభిప్రాయం ప్రజలకు కలిగేలా చేశాయి. విషయం రాజకీయాలతో అపహాస్యంగా మారిందనటం అందుకే. అపహాస్యమే కాదు దేశానికి వీరు తీరు ఒక విషాదంగానూ మారింది.

వీరి మాటలు కొన్నింటిని గమనించండి. పుల్వామా ఇక తమకు ఎన్నికల వరప్రదాయిని అన్నట్లు అధికార పక్షం బాహాటంగానే మాట్లాడటం మొదలుపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఎంతో కృత్రిమంగా తోచే కవిత్వం ఒకటి ఒక సభలో కృత్రిమమైన హావభావాల మధ్య చదివి వినిపించారు. ఈ ఘటనల ఫలితంగా తమ సీట్లు పెరుగుతాయని కర్ణాటక బిజెపి నాయకుడు ఒకరు బాహాటంగా నమ్మకాన్ని ప్రకటించారు. ఇటువంటివి ఇంకా ఉన్నాయి. ఇందుకు ప్రతిపక్షాలు తీసిపోలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులైతే అసలు పుల్వామా, బాలాకోట్‌లపట్లనే సందేహాలు వ్యక్తపరచారు. పుల్వామా దాడి జైష్ చేసింది కాదని నేరుగా అనే సాహసం చేయలేక పరోక్షమైన రీతిలో అనుమానాలు సృష్టించజూశారు. ఇక బాలాకోట్ అయితే ఒక వివాదాల పండగగా మారింది. ఒక్కడ భారత వైమానిక దళం కలిగించిన నష్టాన్ని చూపి లాభపడాలన్నది అధికార పక్షం ధోరణి కాగా, అందులోని లొసుగులను చూపి బిజెపికి లాభాలను తగ్గించాలనేది ప్రతిపక్షాల తీరుగా తయారైంది.

బాలాకోట్ దాడి నిజంగా జైష్ స్థావరంపై జరిగిందా? గతంలోని సర్జికల్ స్ట్రయిక్ వలెనే అనుమానాస్పదంగా ఉందా? భారత దాడిని ముందే ఊహించిన పాక్ సైన్యం జైష్ మనుషులను స్థావరం నుంచి తరలించి వేసిందా? దాడి స్థావరంపైగాక గుట్టమైన, చెట్లపైన జరిగిందా? అక్కడ అసలు ఎవరైనా మరణించారా? మరణిస్తే ఎందరు, ఎవరు? ఎందరో కొందరు మరణించి ఉంటే వారు టెర్రరిస్టులా, పౌరులా? మృతుల సంఖ్యను వైమానిక దళం చెప్పాలా లేక భారత ప్రభుత్వమా? అసలు ఆ దాడులూ నష్టాల చిత్రాలను స్వయంగా తీసినవో లేక ఉపగ్రహాలవో భారత ప్రభుత్వం ఎందుకు విడుదల చేయటం లేదు? వంటి నూటొక్క ప్రశ్నలు, అందుకు ఏదో ఒక విధంగా కాకుండా పలు రకాల సమాధానాలు మనము వింటున్నాము. దాడి జరిగిన వెంటనే “300’ అంకె ఒకటి ఎట్లానోగాని ప్రచారంలోకి వచ్చింది. అది కొన్ని ప్రశ్నలకు దారి తీసింది. ఇంతకూ ఈ రాజకీయ క్రీడలో ఎవరి ఉద్దేశం కూడా వాస్తవాలు చెప్ప టం కాదు, తెలుసుకోవటం కాదు. ఇరువురూ చేస్తున్నది ఎన్నికల దృష్టా ప్రచారాలు, ఎదురు ప్రచారాలు. అసత్యాలు చెప్పి ఓట్ల సంపాదన ఒకరి లక్షం కాగా, అనుమానాలు కల్పించి ఓట్లు తేవటం మరొకరి ఎత్తుగడ. 

Ridiculed with Politics in India

-టంకశాల అశోక్, 9848191767