Home తాజా వార్తలు ఆర్‌ఐఎల్‌కు రేటింగ్ ఎఫెక్ట్ 4 శాతం నష్టపోయిన స్టాక్

ఆర్‌ఐఎల్‌కు రేటింగ్ ఎఫెక్ట్ 4 శాతం నష్టపోయిన స్టాక్

Reliance Industries falls 3%
ఒక్క రోజే రూ.28,081 కోట్ల మార్కెట్ విలువ ఆవిరి

న్యూఢిల్లీ: ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో మార్కెట్లో స్టాక్ వరుసగా నాలుగో రోజు నష్టపోయింది. గురువారం ట్రేడింగ్‌లో స్టాక్ విలువ 3 శాతానికి పైగా నష్టపోయి రూ.1,253కు చేరింది. గత నాలుగు రోజుల్లో సంస్థ షేరు విలువ 11 శాతం నష్టపోగా, మార్కెట్ విలువ రూ.96,288 కోట్లు కోల్పోయింది. ఇక గురువారం ఒక్క రోజే రూ.28,081 కోట్ల మార్కెట్ విలువ ఆవిరైంది. గురువారం అమ్మకాల ఒత్తిడి లోనడంతో ఒకానొక దశలో షేరు 3.50 శాతానికి పైగా నష్టపోయి రూ.1256.30ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇది షేరుకు రెండు నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం, దేశీయంగా ఎన్నికల సీజన్ కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. కాగా రానున్న రెండేళ్ల కాలంలో రిలయన్స్ కంపెనీ ఆదాయాలు పరిమితం కావడంతో పాటు కీలకమైన ఇంధన వ్యాపారంలో ఎదురవనున్న సమస్యలు దృష్ట్యా షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసినట్లు రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. అలాగే కంపెనీకి పెరుగుతున్న రుణభారం, స్థూల రీఫైనరీ మార్జిన్లు తగ్గడం వంటి అంశాలు కంపెనీకి రానున్న రోజుల్లో ప్రతికూలంగా మారుతాయని పేర్కొంది. ఆర్‌ఐఎల్ షేరుకు కేటాయించిన ‘ఓవర్ వెయిట్’ రేటింగ్‌ను ‘ఈక్వల్ – వెయిట్’గా కుదించి, అలాగే షేరు కొనుగోలు ధరను రూ.1,349లకు తగ్గించినట్లు మోర్గాన్ స్టాన్లీ బుధవారం తెలిపింది.

ఆర్‌ఐఎల్ చేతికి బ్రిటీష్ సంస్థ హామ్లీస్

బ్రిటీష్ టాయ్ రిటైలర్ హామ్లీస్‌ను సొంతం చేసుకున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పాగా వేయాలని రిలయన్స్ భావిస్తోంది. 250 ఏళ్ల చరిత్ర కల్గిన హామ్లీస్ అమెజాన్ వంటి ఆన్‌లైన్ సేవల సంస్థల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. దీనిని సొంతం చేసుకోవడం ద్వారా రిలయన్స్ అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగులు వేయాలనుకుంటోంది. చైనీస్ యజమాని సి బ్యానర్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి వైదొలగాలని నిర్ణయించడంతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ హామ్లీస్ ఆగిపోయింది. 2015లో సి బ్యానర్ ఇంటర్నేషనల్ ఈ కంపెనీ కోసం దాదాపు 153 మిలియన్ డాలర్లు చెల్లించింది. అప్పటి నుంచి హామ్లీస్ విక్రయాలు లేక అవస్థలు ఎదుర్కొంటుండగా, సంస్థ విలువగా క్షీణించింది.

‘ఫణి’ బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ ఆపన్న హస్తం

తీర రాష్ట్రాల్లో ఫణి తుపాను బీభత్సం కారణంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇటీవల తీర రాష్ట్రాల్లో ఫణి తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావంతో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తుపాను సమయంలో బాధితులకు ఆపన్నహస్తం అందిస్తోంది. తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలతో కలిసి సహాయక చర్యల్లో సాయం చేసింది. బాధితులకు సహాయం అందించేందుకు ఓ హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఫొని తుపాను ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలోని విపత్తు నిర్వహణ అధికారులతో కలిసి తమ సంస్థ పనిచేసినట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆర్‌ఐఎల్‌ను అధిగమించిన టిసిఎస్

మార్కెట్ విలువ(మార్కెట్ క్యాపిటలైజేషన్)లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) అధిగమించింది. దీంతో దేశంలో అత్యంత విలువైన కంపెనీగా టిసిఎస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌ఐఎల్ రెండో స్థానానికి పడిపోయింది. బిఎస్‌ఇ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం టిసిఎస్ మార్కెట్ విలువ రూ.8.13 లక్షల కోట్లు, అయితే రిలయన్స్ విలువ రూ.7.95 లక్షల కోట్లుగా ఉంది. మోర్గాన్ స్టాన్లీ డౌన్‌గ్రేడ్ రేటింగ్ ఇవ్వడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు గత నాలుగు రోజులుగా పతనమవుతూ వస్తోంది. దాదాపు 11 శాతం పడిపోయింది.

RIL falls 3% after Morgan Stanley downgrades rating