Home ఎడిటోరియల్ పతకాల వెలుగులీనేదెప్పుడు?

పతకాల వెలుగులీనేదెప్పుడు?

SINDHUSAK22ఆగస్టు 5 నుండి 21వరకు జరుగుతున్న లింపిక్స్‌లో 42 క్రీడావిభాగాలల్లో 306 ఈవెంట్స్‌లలో 205 దేశాలు పాల్గొంటున్నాయి. కానీ పతకాల పట్టికలో భారత్ వెలాతెలాపోతోంది. ఎట్టకేలకు సాక్షిమాలిక్ అత్యుత్తమ ప్రతిభతో కంచు పతకంతో భారత్ బోణి కొట్టింది. అలాగే పి.వి సింధు బ్యాడ్మింటన్‌లో సాధించిన అసాధారణ ఘనత దేశాన్ని ఉర్రూతలూగిస్తున్నది. వివిధ క్రీడాంశాల్లో పతకాల పంట పండిస్తారన్న ఆశావాహులు ఒక్కొక్కరుగా విఫలమవుతూ, వెనుదిరుగుతున్నా మొక్కవోని పట్టుదలతో కంచు మ్రోగించింది. ఒలింపిక్స్ ముగింపు దశకు చేరిన వేళ సింధు విజయం మార్మోగింది. ఈ ఇద్దరు మహిళలు భారత్ ఆశను పెంచారు. జిమాస్టిక్స్‌లో దీప కర్మాకర్, బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకసాధనలో అంచువరకు వెళ్ళి, ఓటమి పాలైనా ప్రశంసలందుకున్నారు. కానీ ప్రపంచ జనాభాలో రెండవ స్దానంలో ఉన్న భారత్‌కు ఈ ఫలితం ఊరటనిస్తుందేమో కానీ భారతీయ క్రీడాశక్తిని విశ్వ వేదిక మసకబారింది. మానవవనరుల లభ్యతలో అగ్రగామిగా ఉన్న భారత్‌లో క్రీడల పట్ల, క్రీడాభివృద్ధి పట్ల ఉన్నటువంటి శక్తిని నిస్సందేహంగా సద్విమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది. అతి చిన్న దేశాలు సైతం పతకాల పట్టికలో పదుల సంఖ్యతో నిలదొక్కుకుంటుంటే మన స్థానము మాత్రం అడుగంటిపోతోంది. ప్రపంచంలోనే దేశంలో యువశక్తి అధికంగా వున్న దేశం మనది. అంతే కాకుండా మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి.

ఒలింపిక్స్‌లో మన దేశంనుండి 121 మంది అద్లెట్లు పాల్గొన్నారు. అమెరికా నుండి 558 మంది, బ్రెజిల్ నుండి 471, ఆస్ట్రేలియా నుండి 424 , జర్మనీ నుండి 429, చైనా నుండి 403, బ్రిటన్ నుండి 373, జపాన్ 340, కెనడా నుండి 314,న్యూజిల్యాండ్ నుండి 203, కెన్యా నుండి 80 మంది మరియు జమైకా నుండి 60 మంది పాల్గొన్నారు. అతి చిన్న దేశాల నుండి సైతం పదుల సంఖ్యలో పాల్గొనుచున్నారు. 125 కోట్ల జనాభా కలిగిన భారత్ మాత్రం 121 మందితో బరిలో దిగడం అనేది విచారించదగినది. 121 మందిలో సుమారు 60 మందికి పైగా పురుషులు, సుమారు 50 మందికి పైగా స్త్రీలు పాల్గొనుచున్నారు. దీనిలో 42 క్రీడా విభాగాల్లో 15 క్రీడలల్లో మాత్రమే పాల్గొని కొందరు తమ అవకాశాన్ని జారవిడుచుకుని వెనుదిరిగారు. ప్రస్తుతం కొన్నింటిపైనే ఆశలు తప్ప దాదాపుగా అన్నింటిపై ఆశలు అడియాశయ్యాయి. స్వాతంత్య్ర సిద్దించి 70 సంవత్సరాలు గడిచినా నేటికీ క్రీడలల్లో కనీస పోటీలోనూ లేనంత పేలవంగా మన ప్రదర్శన వెక్కిరిస్తుంటే ఇంకెప్పుడూ పతకాల వెలుగులీనుతాయి. ఇప్పటికే అమెరికా 93 పతకాలతో అగ్రస్దానంలో వుండగా, గ్రేట్ బ్రిటన్ 50, చైనా 54, రష్యా 41, జర్మనీ 29, జపాన్ 33, ఫ్రాన్స్ 31, ఇటలీ 23, నెదర్లాండ్స్ 15, ఆస్ట్రేలియా 24 పతకాలతో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. చిన్న దేశాలైన కెన్యా 7, జమైకా 6, డెన్మార్క్ 9 పతకాలతో పట్టికలో ఎగువనుంటే ఇండియా 70వ స్థానంలో నిలిచింది. 15 క్రీడాంశాలల్లో భారత క్రీడాకారులు పాల్గొనుచున్నారు.

గతంలోనూ ఒలింపిక్స్ పతకాల పోటీలో కనీసం పదుల సంఖ్యను చేరుకోపోగా, నేడు కూడా అదే చరిత్ర పునరావృతమవడం క్రీడాభిమానులకు ఖేధాన్ని మిగుల్చుతున్నది. మన క్రీడాకారులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఆసాంతం మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది . క్రికెట్ పట్ల చూపుతున్న ఆదరణలో కొంతైనా మిగతా క్రీడాంశాల పట్ల చూపించాలి. ఒకనాడు వెలుగులీనిన హాకీలో నేటికీ పూర్వవైభవాన్ని సంతరించుకోలేకపోతున్నాము. సరికదా కనీసం గట్టిపోటీనైనా ఇవ్వలేకపోతున్నాము. క్రీడల అభివృద్దికి ఫలితాలే గీటురాయి. ఫలితాలు ఇలా అఘోరిస్తుంటే సంస్కరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం, పాలకులు, క్రీడా శిక్షకులు, నిర్ధిష్టమైన ప్రమాణాలు పాటిస్తూ మన క్రీడాకారులను రాటుదేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎంతో ప్రతిభ కలిగిన శిక్షకులు ఉన్నా వారిని వెన్ను తట్టి ప్రోత్సహించాల్సిన అవసరము ఉన్నది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి సానబెట్టకపోతే ఖండాంతరాల్లో మన ఖాఁతి ఎలా కీర్తిగడిస్తుంది? ఆధునిక భారతంలో మానవ వనరులకు, ప్రతిభకు కొదవలేదు. కానీ ప్రతిభను వెలికితీసి పతకాలకు సిద్దంచేసే ప్రోత్సాహం కావాలిప్పుడు లేకపోతే క్రీడారంగము కళ తప్పుతుంది. శిక్షకులు క్రీడా ప్రోత్సాహక సంస్థలు సంయుక్తంగా ముందుకు సాగితే అపారమైన క్రీడాకుసుమాలు లభించి భారత ఖ్యాతిని ఖండాంతరాల్లోనూ వ్యాపింప చేస్తారు.
ఎ.శ్యామ్ కుమార్,
హన్మకొండ, సెల్ నెం: 8374918513