Friday, April 19, 2024

మయన్మార్‌లో ఉధృతమౌతున్న ప్రజాందోళనలు

- Advertisement -
- Advertisement -

Rising public unrest in Myanmar

 

ఆందోళనకారులపై జలఫిరంగుల ప్రయోగం
రాజధానితోపాటు అనేక నగరాల్లో నిరసన ప్రదర్శనలు
నిర్బంధంలో ఆస్ట్రేలియా ఆర్థికవేత్త : విడుదల చేయాలని ఆస్ట్రేలియా డిమాండ్

యాంగూన్ : మయన్మార్‌లో మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు పెల్లుబుకుతున్నాయి. పాలక వర్గాలకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగి సోమవారం మరింత ఉద్రిక్తత నెలకొంది. రాజధాని నేప్యిటాలో శాంతియుతంగా నిరసన సాగిస్తున్న ఆందోళన కారులపై పోలీస్‌లు జలఫిరంగులు ప్రయోగించారు. ఆదివారం థాయ్‌లాండ్‌కు ఆనుకుని ఉన్న మయన్మార్ తూర్పు సరిహద్దులో మ్యావడ్డీ పట్టణంలో అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీస్‌లు గాలి లోకి కాల్పులు జరిపారు. ఎవరికైనా గాయపడినట్టు ప్రాథమిక సమాచారం లేకున్నా ఒక మహిళ కాల్పులకు గురైందని స్వతంత్ర నిఘా గ్రూపు వెల్లడించింది. అటు మిలిటరీ కానీ, ఇటు ఆందోళనకారులు కానీ వెనక్కు తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. ఆదివారం నాడు ఇంటర్‌నెట్‌పై నిషేధం స్వల్పంగా ఎత్తివేసిన తరువాత సూకీని తక్షణం విడుదల చేయాలని, ఆమె ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని అహింసాయుత నిరసనలు డిమాండ్ చేయడం ఎక్కువగా కనిపిస్తోంది.

దేశమంతా ఈ డిమాండ్‌తోనే ఆందోళనలు చెలరేగుతున్నాయి. సోమవారం నాడు తాజాగా తూర్పు షాన్ రాష్ట్రం సరిహద్దు నగరం తచిలెక్ లోను రాజధాని నేపిట్యా, మాండలే నగరంలోను ఆందోళనకారుల నిరసన ప్రదర్శనలు, మోటార్‌సైకిళ్ల ర్యాలీలు సాగాయి. నేపిట్యాలో అనేక రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ నగర జనాభాలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు. అయినా ఇక్కడ అసాధారణంగా ఆందోళనలు సాగుతుండడం విశేషం. యాంగూన్‌లో సోమవారం ఉదయం వేలాది మంది ఆందోళన సాగించారు.

మిలిటరీ తిరుగుబాటును తిరస్కరించాలి…మయన్మార్‌కు న్యాయం చేయాలి అని నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈనెల 1 నుంచి 165 మందిని నిర్బంధంలో ఉంచారని, వీరిలో కేవలం 13 మందినే విడుదల చేశారని స్వతంత్ర నిఘా సంస్థ అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ (మయన్మార్) వెల్లడించింది. సూకీ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తున్న ఆస్ట్రేలియా మెక్వారీ యూనివర్శిటీకి చెందిన ఎకనామిస్ట్ సీన్ టర్నెల్ కూడా నిర్బంధంలో ఉన్నారు. ఆయనకు దౌత్యమద్దతు కల్పిస్తామని, ఆయన తక్షణం విడుదల అవుతారని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మెరైస్ ప్యానే నమ్మకం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News