Home కెరీర్ తూర్పుకు పెరిగిన ప్రాధాన్యత

తూర్పుకు పెరిగిన ప్రాధాన్యత

Rising real business

జోరు పెరిగిన రియల్ వ్యాపారం
ఉప్పల్ జనగాం వరకు బూమ్
వరంగల్ జాతీయ రహదారిలో బైపాస్‌లు
ఉప్పల్ చుట్టూరా అభివృద్ధి పథకాలు
యాదాద్రిలో 10 చ.కి.మీ.ల మేర లేఅవుట్లు

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగర తూర్పు ప్రాంతానికి ప్రాధాన్యత పెరిగింది. మొదటి ఇండస్ట్రియల్ కారిడార్‌గా హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి మార్గాన్ని సూచనప్రాయంగా ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈస్ట్‌లుక్ అంటూ నగరం తూర్పువైపును మరింత వేగంగా విస్తరించేందుకు నూతన పథకాలను, ప్రతిపాదనలను తెరమీదికి తీసుకువస్తోంది. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పశ్చిమ భాగం పెరుగుతూపోతోంది. ఇది గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం తూర్పు ప్రాంతాన్ని అంతకన్నా వేగంగా విస్తరింపజేయాలని నిర్ణయించి ఈస్ట్‌లుక్‌ను తెరపైకి తీసుకువచ్చింది. దీనికి తోడు హెచ్‌ఎండిఎ కూడా ఈ ప్రాంతంలోనే భూసమీకరణ పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు పూర్తిచేసింది. తూర్పుదిశలో వరంగల్ జాతీయ రహదారి ఉండటంతో ఉప్పల్ నుండి భువనగిరి వరకు, అలాగే ఆలేరు, జనగాం వైపు రియల్ వ్యాపారం జోరందుకుంటోంది. ప్రధానంగా ఉప్పల్ నుండి భువనగిరి వరకు రియల్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా మారుతోంది. ఈ ప్రాంతంవైపు నగర వాసులతోపాటు శివారు ప్రాంతవాసులు కూడా వరంగల్ జాతీయ రహదారివైపు ప్లాట్లు, భూములు కొనుగోలుచేసేందుకు అధికశాతం మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఘట్‌కేసర్ నుండి వరంగల్ వరకు భూములు, ప్లాట్ల ధరలు పెరుగుతున్నాయి.

ఈస్ట్‌లుక్: నగరం తూర్పువైపు పెరిగితే అన్నిరకాలుగా శ్రేయస్కరమని ప్రభుత్వ భావన. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్ నుండి భాగ్యనగరం నందనవనం వరకు ప్రత్యేక ఫైవోవర్, చర్లపల్లిలో రైల్వే టెర్మినల్, అవుషాపూర్‌లో ఇంటర్ సిటీ బస్సు టెర్మినల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పూర్తిచేయడం జరిగింది. నాగోల్ నుండి కొర్రెంల మీదుగా ఘట్‌కేసర్ వరకు 150 అడుగుల వెడల్పు రోడ్డు, ఉప్పల్ భగాయత్‌లో మినీ శిల్పారామం, మూసీ సుందరీకరణ, ప్రతాప సింగారంలో 200 ఎకరాల్లో లేఅవుట్, మేడిపల్లిలో 60 ఎకరాల్లో లేఅవుట్‌కు హెచ్‌ఎండిఎ ప్రకటనలను వెలువరించింది. అలాగే, భువనగిరిలో ఫ్రీట్ టెర్మినల్ ఏర్పాటు ప్రతిపాదనలో ఉన్నది. దీంతో ఘట్‌కేసర్, అవుషాపూర్, రాంపల్లి, నాగారం, భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో రియల్ వ్యాపారం ఊపందుకుంది. ఇక్కడ బహుళ అంతస్థుల భవనాలకన్నా వ్యక్తిగత ఇళ్ళ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఉన్నది. దీంతో ఇక్కడ ఖాళీప్లాట్లకు భలే గిరాకీ ఏర్పడుతున్నది. ప్రస్తుతం ఇక్కడ మంచి ప్రదేశంలో చ.గ. ధర రూ. 8 వేలు నుండి ప్రారంభమవుతోంది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ప్లాట్లు కనీసంగా రూ. 20 వేలు నుండి మొదలవుతోంది.

పెరుగుతోన్న డిమాండ్: ఈస్ట్‌లుక్‌తో పాటు ప్రధానంగా నగరం నుండి వరంగల్ వరకు అభివృద్ధ్దిని తీసుకురావాలని ప్రభుత్వం యోచనగా ఉన్నది. ప్రస్తుతం నగరం నుండి యాదాద్రి వరకు మెట్రోరైలు ప్రతిపాదనలో ఉన్నది. ఆలేరు, జనగాంలలో బైపాస్ రోడ్‌లు వచ్చాయి. దీంతో బైపాస్ రోడ్‌ల వెంట రియల్ వ్యాపారం జోరందుకుంది. వందల్లో ఉన్న చ.గ. కాస్త వేలుగా మారింది. ఇప్పుడు జనగాం చుట్టూరా రింగ్‌రోడ్ ప్రతిపాదనల్లో ఉన్నది. మరోవైపు జిల్లా కేంద్రం కావడంతోనూ అక్కడ ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. అక్కడ శివారులో మహాఅయితే, రూ.1000 చ.గ.లుగా ఉంటే ఇప్పుడు కనీసంగా చ.గ. రూ. 3 వేలు పలుకుతుంది. ప్రధానంగా ఆలేరు, జనగాంలు బైపాస్ రోడ్లవైపు స్థానికులు దృష్టిసారించారు. ఆ పరిసర గ్రామాల వారు కూడా ఆ రహదారి వెంటే ప్రధాన్యత నిస్తుండటంతో అక్కడ ఎకరం ధర కనీసంగా రూ. 30 లక్షలుగా పలుకుతున్నది.

యాదాద్రి: తెలంగాణలోనే తిరుపతి తరహాలోనే యాదాద్రిని తీర్చిదిద్దుతున్నామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడంతో అక్కడి భూములకు రెక్కలు వచ్చాయి. యాదాద్రి చుట్టూరా వేలాదిగా లేఅవుట్లు వెలిశాయి. వాటికి అనుమతులు లేకున్నా కనీసంగా చ.గ. ధర రూ. 3500లుగా మొదలై గరిష్టంగా రూ. 20 వేలుగా పలుకుతోంది. ఎకరాలు కేవలం రూ. 58 లక్షలుగా ఉన్న ధరలు కాస్త రూ. 50 లక్షలు ఆపైనే పలుకుతున్నాయి. యాదాద్రి చుట్టూరా రింగ్ రోడ్, ప్రదక్షిణ రోడ్డు, టెంపుల్ సిటీ, దేవాలయ నూతన నమూనాలో అభివృద్ధి పరచడం వంటివి కార్యరూపంలోకి రావడంతో అక్కడ రియల్ బూమ్ విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్, వరంగల్ వాసులు ఇక్కడకు వచ్చి రియల్ వ్యాపారం సాగిస్తున్నారు. యాదాద్రి పట్టణం నుండి రాయిగిరి వరకు భూములకు, ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో రియల్ వ్యాపారం చాలా మంది యువకులకు ఉపాధిగా మారింది. పరిసర ప్రాంతాల్లో కనీసంగా 10 కి.మీ.ల వరకు రియల్ వ్యాపారానికి రెక్కలు వచ్చాయి.

భువనగిరిలో: బైపాస్ రోడ్ రావడంతోపాటు కోటకు రోప్‌వే ఏర్పాటుకు సన్నాహాలు చోటుచేసుకోవడంతో ఇక్కడ ప్లాట్ల ధరలు పెరిగాయి. పట్టణవాసులే కాకుండా నగరవాసులు, పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన వారు ఈ బైపాస్ రోడ్డు వెంట దృష్టి సారించారు. దీనికి తోడు ఈ ప్రాంతమంతా హెచ్‌ఎండిఎ పరిధిలో ఉన్నది. దీంతో ఇక్కడి ప్లాట్లకు, భూములకు విలువచేకూరింది. ప్రధానంగా భువనగిరి నుండి హైదరాబాద్ నగరం వైపు వచ్చే రహదారి వెంటే డిమాండ్ పెరుగుతూ వస్తున్నది. ఈ రోడ్డు మార్గంలో కనీసంగా రూ. 10 వేలు చ.గ. ధర పలుకుతోంది.

బీబీనగర్‌లో.. గత రెండు దశాబ్దాల క్రితమే ఇక్కడ ఈస్ట్ సిటీ ఏర్పడింది. దీనికి తోడు ప్రధాన ఆకర్షణగా నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్), జాతీయ రహదారి ఔటర్ రింగ్ రోడ్ నుండి మొదలై బీబీనగర్ మీదుగా ఖమ్మం, మధిర ప్రాంతాలకు రోడ్డును ప్రతిపాదించారు. దీనికి తోడు పరిసర ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చాయి. ఫలితంగా ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం రూ. 10001500 చ.గ.లుగా ఉండే ఇక్కడ కనీసం రూ. 5 వేలుగా డిమాండ్ పలుకుతోంది. ఎకరాలు కనీసంగా 25 లక్షలుగా పలుకుతుంది. నగరానికి చేరువగా ఉండటంతో నగర వాసులు అధికంగా ఇటుగా దృష్టిసారించారు. ఇక్కడ లేఅవుట్లు విపరీతంగా వెలుస్తున్నాయి.

ఘట్‌కేసర్‌లో : ప్రధానంగా నగరానికి అనుకుని, ఔటర్ రింగ్‌రోడ్ కూడలి వద్ద ఉన్న పట్టణం ఇది. వరంగల్‌కు వెళ్లేందుకు బైపాస్‌రోడ్ కూడా వినియోగంలో ఉన్నది. ప్రధానంగా బ్రూక్‌బాండ్ టీ పరిశ్రమ, హౌసింగ్‌బోర్డు కాలనీ, ఇంజనీరింగ్ కళాశాలలు పట్టణం చుట్టూరా ఉన్నాయి. ఇక్కడి నుండి కీసర, శామీర్‌పేట్‌లకు, ఇసిఐఎల్‌లకు ప్రత్యేక మార్గాలున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలోనే ఉండటంతో నగరంలోనివారంతా వ్యక్తిగత ఇండ్లను నిర్మించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇక్కడ రియల్ వ్యాపారం జోరందుకున్నది. కనీసంగా చ.గ. ధర రూ. 8 వేలుగా పలుకుతుంది. ఈ పట్టణం కాస్త నగరానికి ఆనుకుని ఉన్నది. చర్లపలిలో రానున్న రైల్వే టెర్మినల్ కేవలం 6 కి.మీ.ల దూరంలోనే ఉన్నది. ఇన్‌ఫోసిస్, రహేజాపార్కు, మలేషియా టౌన్‌షిప్‌లు ఈ ప్రాంతంలోనే ఉండటంతో రియల్ వ్యాపారం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా మారింది. మంచి ప్రాంతంలో చ.గ. ధర రూ. 12 వేలు కనిష్టంగా ఉన్నది.

ఉప్పల్ చుట్టూరా రియల్ బూమ్: నగర శివారులోని ఉప్పల్ ప్రాంతం ఇప్పుడు రియల్ బూమ్ నడుస్తోంది. 413.32 ఎకరాల్లో ఒకటి, 72 ఎకరాల్లో హెచ్‌ఎండిఎ లేఅవుట్ చేసింది. త్వరలోనే ప్లాట్లను వేలం వేయనున్నది. అందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ జిఎ 633 ని విడుదలచేసింది. ఇక్కడ కనీసంగా చ.గ. ధర రూ. 37 వేలుగా నిర్ణయించాలని హెచ్‌ఎండిఎ యోచన. దీనికి తోడు నల్ల చెరువును సుందరీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడే ఉన్న పర్వతాపూర్‌కు వెళ్ళే మార్గంలో మరో 105 ఎకరాల్లో భారీ లేఅవుట్‌కు అథారిటీ సిద్ధ్దమవుతోంది. ముఖ్యంగా మూసీ సుందరీకరణ, మినీ శిల్పారామం, ఫ్లైవోవర్, నాగోల్ కొర్రెంల ఘట్‌కేసర్‌కు రోడ్డు వంటివి అందుబాటులోకి వస్తుండటంతో ఇక్కడ రియల్ వ్యాపారం విపరీతంగా పెరుగుతోంది. నల్ల చెరువు నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు మోనో ట్రేయిన్ వేసే యోచన కూడా అధికారుల్లో వినిపిస్తుంది. ఉప్పల్ చుట్టూరా విద్యాసంస్థలు అందుబాటులో ఉండటంతోనూ ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ వస్తుంది. ప్రతాపసింగారం, మేడిపల్లిలో లేఅవుట్ల వస్తే ప్లాట్లు మరింత ప్రియం కానున్నవి. ఇక్కడ కనీసంగా చ.గ. రూ. 20 వేలుగా ఉన్నది.

                                                                                                                                                   – మంచె మహేశ్వర్