Friday, April 26, 2024

అంతిమ సంస్కారాల కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Road accident on way to the funeral: 18 killed

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ లోని నాడియా జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. నబద్వీప్‌లో ఓ వ్యక్తి అంతిమ సంస్కారాల కోసం మినీ ట్రక్కులో 35 మంది చక్డా నుంచి వెళ్తుండగా, హన్సఖాళీ వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న మరో ట్రక్కును ఢీ కొనడంతో అందులో ఉన్న వారిలో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పిల్లవాడు ఉన్నారు. స్థానిక ప్రజలు, పోలీసులు గాయపడిన వారిని శక్తినగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషయంగా ఉండడంతో క్రిష్ణానగర్ లోని ఆస్పత్రికి తరలించారు. దట్టంగా పొగమంచు కమ్ముకోవడం, వ్యాను వేగంగా నడపడమే ప్రమాదానికి దారి తీసిందని పోలీస్ ఆఫీసర్ చెప్పారు.

ప్రధాని మోడీ, అమిత్‌షా సంతాపం

నాడియా రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందడంపై ప్రధాని మోడీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఈ ప్రమాదం తనకు ఎంతో బాధ కలిగించిందని ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని అభిలషించారు. మృతుల కుటుంబాలకు ఓదార్పు కలిగేలా భగవంతుడు ఆత్మబలం చేకూర్చాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రార్ధించారు.

సిఎం మమతాబెనర్జీ సంతాపం

ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్ర సంతాపం వెలిబుచ్చుతూ మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ విషాద వార్త వినగానే తనకు ఎంతో వేదన కలిగిందని, గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆమె అభిలషించారు. ఈ కష్ట సమయంలో భగవంతుడు వారికి మనోనిబ్బరం కలిగించాలని కోరుతున్నట్టు ఆమె మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారంలో రాశారు. గవర్నర్ జగ్‌దీప్ ఢంకార్ ప్రమాదానికి సంతాపం వెలిబుచ్చుతూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News