Home తాజా వార్తలు బురద దారిలో బడికి వెళ్లేదెలా…?

బురద దారిలో బడికి వెళ్లేదెలా…?

School

 

గోదావరిఖని : బడికి వెళ్లే దారి బురదతో నిండిపోయింది.. అడుగు తీసి అడుగు వేస్తే.. జారి ఎక్కడ పడిపోతామో తెలియని పరిస్థితి. ఈదారిని బాగుచేయాలని కోరుతూ విద్యార్థులు సోమవారం అదే దారిలోని బురదలో నిలబడి నిరసన తెలియజేశారు. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖని పట్టణంలో గల సప్తగిరికాలనీ నుండి ప్రశాంత్‌నగర్‌కు వెళ్లే రహదారి రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పూర్తిగా బురదతో నిండి మడుగులా మారింది.

స్థానిక జ్యోతిరావుపూలె గురుకుల, సోషల్ వెల్ఫేర్ పాఠశాలలతో పాటు ఓ ప్రైవేటు పాఠశాల, ఓ జూనియర్ కళాశాల పిల్లలకు సైతం ఇదే ఏకైక దారి. అయితే గతంలో ఇక్కడి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామంటూ పాలకవర్గం దిశగా అభివృద్ధి పనులు ప్రారంభించింది. దీనిలో భాగంగా చేపట్టిన రహదారి నిర్మాణం పనులు పూర్తిచేయకుండా అర్థాంతరంగా నిలిపివేశారు. కాగా ఇటీవల వర్షాలు ప్రారంభం కావటంతో సదరు రోడ్డుపై పోసిన మట్టి కాస్తా పూర్తిగా బురదమయమై నడవడానికి వీలులేకుండా మారిపోయింది.

దీంతో ఇక్కడి పాఠశాలల, కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ దారిగుండా రావడానికి నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. అదేవిధంగా నిత్యం సుమారు 5వేల మంది విద్యార్థులు వెళ్లే ఈ మార్గం పూర్తి బురదమయం కావటంతో అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పోరేషన్ అధికారులు స్పందించి అర్థాంతరంగా నిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తిచేసి సమస్యను పరిష్కరించాలని విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Road to School was full of Mud