Home కామారెడ్డి అధికారుల నిర్లక్ష్యం… ప్రయాణీకులకు శాపం…

అధికారుల నిర్లక్ష్యం… ప్రయాణీకులకు శాపం…

Roadsపిట్లం (కామారెడ్డి) :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను బాగు చేయడానికి కోట్లాది రూపాయలను మంజూరు చేసి గ్రామ గ్రామాన రహదారులు నిర్మిస్తుంది. కానీ క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరు గారిపోతోంది. పిట్లం మండలంలోని తిమ్మానగర్ టు మద్దెల్ చెరువు రోడ్డుకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 23 కోట్ల నిధులు మంజూరు చేయించారు. రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తరాదని ఆయన భావించారు. అయితే సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఎమ్మెల్యే ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. రోడ్లు వేసి ఏడాది కూడా గడువక ముందే రోడ్డుపై గుంతలు, ఇరువైపులా రోడ్డు ఎగిరిపోవడంతో, ప్రయాణీకులు ఏ కాస్త ఎమర పాటుతో ఉన్నా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా రోడ్డు వేసిన మున్నాళ్లకే అధ్వాన్న స్థితికి చేరుతుండటంతో మండల వాసులు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డును సంబంధిత కాంట్రాక్టర్‌కు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందజేస్తూ నాణ్యతతో నిర్మించేలా చూసే అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతోనే ఈ విధంగా రోడ్లు అధ్వాన్నంగా వేశారని, సంవత్సరం కూడా కాక ముందే రోడ్డు వేసినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామ గ్రామాన రహదారులు బాగుపడుతున్నాయని సంతోషిస్తున్న తరుణంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వానికి మచ్చ వస్తుందని, అధికారులు ఇంకా ఏం పనులు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న రోడ్లు పదికాలాల పాటు ఉండాల్సి ఉండగా, ఇలా ప్రయాణీకులకు ఇబ్బందులకు గురిచేసేలా వేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్‌పై, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Roads Damaged in Pitlam Mandal at Kamareddy