Home తాజా వార్తలు టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన రోహిత్, మయాంక్…

టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన రోహిత్, మయాంక్…

 

దుబాయి: తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో సెంచరీల మోత మోగించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగు పరుచుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో కదంతొక్కిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. సీనియర్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమిలు కూడా తమ ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్నారు. స్టార్ క్రికెటర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలు కూడా టాప్ టెన్‌లో చోటు నిలబెట్టుకున్నారు. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. మరోవైపు సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు డికాక్, ఎల్గర్‌లు కూడా తమ ర్యాంక్‌లను మెరుగు పరుచుకోవడంలో సఫలమయ్యారు. కాగా, విశాఖలో పరుగుల వరద పారించిన ఓపెనర్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి చేరుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కూడా శతకాలు సాధించడంతో రోహిత్ తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగు పరుచుకున్నాడు. టెస్టు కెరీర్‌లో రోహిత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇక, విఖాఖ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా ర్యాంక్‌ను ఎంతో మెరుగు పరుచుకున్నాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో మయాంక్ ఏకంగా 38 స్థానాలు మెరుగు పరుచుకుని ఏకంగా 25వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. మయాంక్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్‌గా నిలిచింది. కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ రెండో ర్యాంక్‌లో నిలిచినా భారీగా రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. మరోవైపు సఫారీ స్టార్ ఆటగాడు డికాక్ ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత స్టార్ పుజారా నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ టాప్ టెన్‌లో నిలిచాడు. విఖాఖ టెస్టులో 8 వికెట్లు పడగొట్టడంతో అశ్విన్ ర్యాంక్ మెరుగైంది. ఇక, ఇదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమి కూడా తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. 710 రేటింగ్ పాయింట్లతో షమి 14వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక, టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది. న్యూజిలాండ్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతోంది.

Rohit reaches Career best 17th in ICC Test Rankings