Home తాజా వార్తలు ‘హిట్‌మ్యాన్’ వీరవిహారం

‘హిట్‌మ్యాన్’ వీరవిహారం

india-vs-Bangladesh
రాజ్‌కోట్ టి20 మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం, సిరీస్ సమం

రాజ్‌కోట్: బంగ్లాదేశ్‌తో ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గురువారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మొదటి మ్యాచ్‌లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. బంగ్లాదేశ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ వాళ్లకు చుక్కలు చూపించాడు. దీంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.154 పరుగులు విజయ లక్షంతో బరిలోకి దిగిన భారత్ 15.4 ఓవర్లలోనే లక్షాన్ని చేరుకుంది. తన కెరీర్‌లో వందో టి20 మ్యాచ్ ఆడుతున్న రోహిత్ ఈ మ్యాచ్‌ని చిరస్మరణీయం చేసుకున్నాడు. కేవలం 43 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ఈ స్కోరులో ఆరు ఫోర్లు, మరో ఆరు సిక్స్‌లున్నాయి. అయితే త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

శిఖర్ ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించిన తర్వాత ధావన్ ఔటయ్యాడు. అతడిని అమినుల్ ఇస్లామ్ ఔట్ చేశాడు. ధావన్ 27 బంతుల్లో 4 బౌండరాలతో 31 పరుగులు చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రోహిత్ కూడా ఔటయ్యాడు. అయితే అప్పటికే భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్‌లు మరో వికెట్ పడకుండా లాంఛనాన్ని పూర్తి చేశారు. అయ్యర్ 13 బంతుల్లో ఒక సిక్స్, మూడు బౌండరీలతో 24 పరుగులు చేయగా, కెఎల్ రాహుల్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత ఇన్నింగ్స్‌లు పడిన రెండు వికెట్లు అమినుల్ ఇస్లామ్‌కే దక్కాయి. కాగా. సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో టి 20 మ్యాచ్ ఈ నెల 10న నాగపూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది.

కట్టడి చేసిన బౌలర్లు

మొదటి మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ను బాగానే కట్టడి చేశారు. మొదట్లో ధారాళంగా పరుగులు ఇచ్చినా మధ్య ఓవర్లలో పుంజుకున్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీసి డెత్ ఓవర్లలో ప్రత్యర్థిపై బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచారు. దీంతో బ్యాటింగ్‌కు అనుకూలించే రాజ్‌కోట్ పిచ్‌పై బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా యజువేంద్ర చాహల్ (2/28) అద్భుతంగా బౌల్ చేశాడు. అతడికి వాషింగ్టన్ సుందర్ (1/25), దీపక్ చాహర్ (1/25)లు చక్కటి సహకారం అందించారు. శివన్ దూబే, కృణాల్ పాండేలు కూడా పరుగులు కట్టడి చేశారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు లిటన్ దాస్ (29;21 బంతుల్లో నాలుగు ఫోర్లు), మహమ్మద్ నయీమ్( 36; 31 బంతుల్లో5 ఫోర్లు) వరస బౌండరీలతో చెలరేగారు. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్న ఖలీల్ బౌలింగ్‌ను నయీమ్ ఉతికి ఆరేశాడు. ఓపెనర్లు ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వికెట్ కోసం ఎదురు చూస్తున్న భారత్‌కు లిటన్‌దాస్‌ను రనౌట్ చేసి రిషబ్ పంత్ బ్రేక్ ఇచ్చాడు. అయితే అతను పదేపదే పొరబాట్లు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సౌమ్య సర్కార్ కూడా దూకుడుగానే ఆడాడు. అయితే జట్టు స్కోరు 82 పరుగుల వద్ద నయీమ్‌ను సుందర్ ఔట్ చేయడంతో బంగ్లా పరుగుల వేగం మందగించింది. కాస్సేపటికే ముష్ఫికర్ రహీమ్ (4)కూడా ఔటయ్యాడు. ఆ వెంటనే సౌమ్య సరార్ కూడా పెవిలియన్ చేరాడు. సౌమ్య సర్కార్ 20 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 30 పరుగులు చేశాడు. చివర్లో తెలివిగా పరుగులు రాబడుతున్న కెప్టెన్ మహమ్మదుల్లా(21 బంతుల్లో 4 ఫోర్లతో 30)ను దీపక్ చాహర్ ఔట్ టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో తప్పులు చేయకుండా ఉండి ఉంటే బంగ్లాను ఇంకా తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఉండేది.

Rohit Sharma pyrotechnics help India