Friday, April 19, 2024

ఆస్ట్రేలియా సవాల్‌కు సిద్ధం

- Advertisement -
- Advertisement -

 

ముంబై: ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో రోహిత్ శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం లభించడంతో చాలా మంది క్రికెటర్లు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. అంతేగాక అభిమానులు, సహచర క్రికెటర్లతో లైవ్ చాట్‌లు నిర్వహిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక, రోహిత్ శర్మ ఇప్పటికే చాలా మంది క్రికెటర్లతో లైవ్ చాట్ నిర్వహించాడు. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌తో కూడా లైవ్ చాట్‌లో పాల్గొన్నాడు. ఇద్దరి మధ్య క్రికెట్‌కు సంబంధించిన పలు విషయాలు చర్చకు వచ్చాయి.

ఇక, ఈ సందర్భంగా రోహిత్ తన అనుభవాలు, ఆశయాలను వార్నర్‌తో పంచుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై క్రికెట్ ఆడడం అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. గతంలో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం ఇప్పటికీ తీపి జ్ఞాపకంగా ఉందన్నాడు. ఆ జట్టులో తాను కూడా సభ్యుడిగా ఉండడం గర్వంగా భావిస్తున్నట్టు చెప్పాడు. ఈసారి జరిగే సిరీస్ కోసం ఎంతో ఆసక్తితో ఉన్నానని, ఛాన్స్ దొరికితే సత్తా చాటేందుకు సిద్ధమన్నాడు. ఈసారి కూడా తమకే గెలుపు అవకాశాలున్నాయన్నాడు. ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించే సత్తా భారత్‌కు ఉందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదన్నాడు.

మరో ఐదేళ్లు ఆడతా

ఇక, మరో ఐదేళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగాలని ఉందని చెప్పాడు. ఫిట్‌నెస్ సహకరించక పోతే మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించేందుకు వెనకాడనని స్పష్టం చేశాడు. అయితే మరో ఐదేళ్ల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా క్రికెట్ కెరీర్ కొనసాగించే సత్తా తనకు ఉందన్నాడు. ఒకవేళ ఫిట్‌నెస్ సమస్యలు ఎదురైతే మాత్రం దీనిపై పునరాలోచన చుస్తానన్నాడు. ఇక, కరోనా వల్ల ఐపిఎల్ టోర్నీ నిరవధికంగా వాయిదా పడడం కాస్త బాధగా ఉందన్నాడు. అయితే ప్రజల ఆరోగ్యంతో పోల్చుకుంటే క్రికెట్ అనేది చాలా చిన్న అంశమన్నాడు. ఇలాంటి సమయంలో క్రికెట్ గురించి ఆలోచించడం తన దృష్టిలో ఏమాత్రం సమంజసం కాదన్నాడు.

ధావన్ ఓ ఇడియట్

మరోవైపు తన సహచర ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి రోహిత్ సరదాగా స్పందించాడు. ఒక మాటలో చెప్పాలంటే తన దృష్టిలో ధావన్ ఓ ఇడియట్ అని పేర్కొన్నాడు. ఎందుకంటే తొలి బంతిని ఎదుర్కొనేందుకు ధావన్ చాలా భయపడుతాడన్నాడు. దీంతో తాను అతన్ని ఇడియట్ అని పిలిచేందుకు సందేహించనన్నాడు. ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేయడాన్ని గర్వంగా భావిస్తానని, అతనిలాంటి గొప్ప ఆటగాడు ఓపెనింగ్‌లో పార్టనర్‌గా ఉండడం అదృష్టంగా భావిస్తానని స్పష్టం చేశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News