Home ఎడిటోరియల్ ఆదిత్యనాథ్ నిరంకుశ పాలన!

ఆదిత్యనాథ్ నిరంకుశ పాలన!

Sampadakiyam            ప్రభుత్వానికి అప్రియమైనదేదీ మీడియాలో కనిపించడానికి వీల్లేదనే నిరంకుశ పాదంతో పాలన సాగించడంలో తనకు సాటి లేరని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ మరోసారి చాటుకున్నారు. మీర్జాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనంగా రోటీతో కూరకు బదులు ఉప్పును మాత్రమే వడ్డిస్తున్న దారుణాన్ని బయటపెట్టినందుకు పవన్ జైస్వాల్ అనే జర్నలిస్టుపై నేర పూరిత కుట్ర, మోసం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడం వంటి నేరారోపణలతో కేసు బనాయించడాన్ని ఏమనాలి? తమ పాలన ఎంత అధ్వానంగా మరెంత జన కంటకంగా ఉన్నా కలం కదపరాదు, నోరు మెదపరాదనే చీకటి సామ్రాజ్యానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి అక్కరలేదు.

ఈ సమాచారం వెల్లడయిన వెంటనే ఆదిత్య నాథ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం బాధ్యులైన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేయడం హర్షించదగిన చర్యలే. కాని, విషయాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టుపై కేసు రుద్దడం అంతకంటే తీవ్రమైనది, ప్రజాస్వామ్య ఘాతుకమైనది. ఇలాంటి చేదు వాస్తవాలను ప్రపంచం దృష్టికి తేవడాన్ని తాము రాజద్రోహంగా పరిగణిస్తామని అటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని మొత్తం మీడియాను బెదిరించడం కాక మరేమిటిది? మీడియాను ప్రజలకు కాకుండా చేసే ఈ దుర్మార్గాన్ని ఖండించడానికి మాటలు, అక్షరాలు చాలవు. నిజం చెప్పినందుకు, ఉన్నది ఉన్నట్టు ప్రజల దృష్టికి తెచ్చినందుకు జర్నలిస్టులపై నిర్బంధ కాండకు తలపడడం ఆదిత్య నాథ్ ప్రభుత్వానికి అలవాటైన విద్యే. ఆయనను ప్రేమిస్తున్నానంటూ ఆయన నివాస భవనం బయట ప్రేమ శ్రీవాస్తవ అనే మహిళ ప్రకటించిన విషయంపై చానెల్లో చర్చ నిర్వహించినందుకు, సామాజిక మాధ్యమాల్లో ఆ విడియో పోస్టు చేసినందుకు యుపి ప్రభుత్వం గతంలో ముగ్గురిపై చర్య తీసుకున్న విషయం తెలిసిందే.

వారిలో ఆ విడియోను ట్విట్టర్‌లో ఉంచిన ప్రశాంత్ కనోజియా అనే జర్నలిస్టు కూడా ఉన్నారు. యుపిలోని ధిమాన్ పూర్ అనే చోట ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనను విడియోలో చిత్రీకరించినందుకు ఒక జర్నలిస్టును రైల్వే పోలీసులు కొట్టి నిర్బంధించి అతడి ముఖం మీద మూత్రం విసర్జించినట్టు వార్తల్లో వచ్చిన పాశవిక ఘటన కూడా చోటు చేసుకున్నది. ఆదిత్య నాథ్ ప్రభుత్వం ధిక్కారముల్ సైతునే అనే రీతిలో అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా తమకు గిట్టని సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్న మీడియాను లక్షంగా చేసుకోడం దాని అప్రజాస్వామిక అమానుష లక్షణాన్ని పదేపదే రుజువు చేస్తున్నది. దేశంలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం పలు కోణాల్లో ఎంతైనా ప్రశంసించదగినది. పేద పిల్లల ఆకలి తీర్చడం ద్వారా వారిని బడికి ఆకర్షించడం ఒకటైతే సమాజంలోని అసమానతలు పాఠశాలల్లోనైనా తొలగించడం ద్వారా సామాజిక ఐక్యతను సాధించడం దాని మరో గొప్ప లక్షం.

యుపి, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ లక్షాలను దెబ్బ తీయడానికి అక్కడి ఫ్యూడల్ పెత్తందార్లు ఈ పథకాన్ని పలు విధాలుగా భ్రష్టు పట్టిస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. పూరీతోగాని, చపాతీ, రోటీ లేదా అన్నం తోగాని కాయగూరలతో చేసిన కూరలో, పప్పో వడ్డించడం అవసరం, ఆరోగ్యకరం. కాని మీర్జాపూర్ ప్రభుత్వ పాఠశాలలో రోటీతో కేవలం ఉప్పు వడ్డించి పిల్లల చేత తినిపించడంలోని అమానుషం, దోపిడీ ఇంతింతని చెప్పనలవి కానివి. ఈ విషయాన్ని సచిత్రంగా బయట పెట్టినందుకు జైస్వాల్ అనే ఆ జర్నలిస్టుకు ప్రభుత్వం ఘన పురస్కారం అందించి ఉండవలసింది. అందుకు బదులుగా కేసు బనాయించడం జనహిత జర్నలిజాన్ని ఖబడ్దార్ అని హెచ్చరించడమే. దీనిని ప్రెస్ కౌన్సిల్ వంటి సంస్థలు తీవ్రంగా పరిగణించవలసి ఉంది. న్యాయ స్థానాలు తమంతట తాముగా స్పందిం చి యుపి పాలకులకు బుద్ధి చెప్పవలసి ఉంది.

ప్రపంచ మీడియా స్వేచ్ఛ ర్యాంకింగ్‌లో భారత దేశం తన 140వ స్థానాన్ని గత ఆరేళ్లుగా మార్చుకోలేక పోయింది, అక్కడి నుంచి మెరుగుదలను సాధించలేకపోయిందంటే పాలకులు, పాలక వర్గాలు మీడియాలో ప్రజాస్వామిక ధోరణులను దారుణంగా నిరుత్సాహ పరుస్తూ ఉండడమే అందుకు కారణం. పైపెచ్చు మీడియా వెన్నెముకను విరిచివేసే పలు అపమార్గాలను అవలంబిస్తూ తమకు ఎదురులేని తనాన్ని నెలకొల్పుకోడానికి ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యూహాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఈ దుష్ట క్రీడలో భారతీయ జనతా పార్టీ పాలకులు నాలుగాకు లు ఎక్కువే చదివామని చాటుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు తమంత తాముగా చైతన్యవంతులై మీడియా స్వేచ్ఛను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది జరిగితేనే జైస్వాల్ వంటి జర్నలిస్టులకు మద్దతు లభిస్తుంది.

Roti as lunch for children at Mirzapur Public School