Home తాజా వార్తలు ఈసారైనా సాధిస్తుందా?

ఈసారైనా సాధిస్తుందా?

ఈసారైనా సాధిస్తుందా?..  అందరి కళ్లు బెంగళూరుపైనే!

royal challengers bangalore has never won IPL Cup

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్‌లోనే అత్యంత పటిష్టమైన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పేరుంది. తొలి సీజన్ నుంచే హేమాహేమీ క్రికెటర్లను బెంగళూరు సొంతం చేసుకుంది. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, బ్రాండన్ మెకొల్లమ్, డివిలియర్స్, కలిస్, మనీష్ పాండే, లోకేశ్ రాహుల్, జహీర్ ఖాన్, వాట్సన్, పార్థివ్ పటేల్ వంటి దిగ్గజాలు బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు. అయితే 11 ఏళ్ల సుదీర్ఘ ఐపిఎల్ ప్రస్థానంలో బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేక పోయింది. 2008లో జరిగిన ఆరంభ సీజన్‌లో బెంగళూరు టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన బెంగళూరు విజేతగా నిలువడం ఖాయమని అందరూ జోస్యం చెప్పారు. అయితే ఈ సీజన్‌లో బెంగళూరు అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. వరుస పరాజయాలతో ఏడో స్థానంతోనే సంతృప్తి పడింది. అయితే దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన రెండో సీజన్‌లో మాత్రం బెంగళూరు అదరగొట్టింది. అసాధారణ ఆటతో లక్షం దిశగా అడుగులు వేసింది. అంచనాలకు తగినట్టుగానే రాణించి ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. కానీ, ఫైనల్లో మాత్రం అప్పటి డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఓటమి తప్పలేదు. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమి పాలై ట్రోఫీని గెలిచే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుంది. ఇక, మూడో సీజన్‌లో కూడా బెంగళూరు బాగానే ఆడింది. అయితే ఈసారి సెమీఫైనల్‌లోనే ఇంటిదారి పట్టింది. ఈ సీజన్‌లో కూడా బెంగళూరుకు అదృష్టం కలిసి రాలేదు. ప్లేఆఫ్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఫైనల్ సమరంలో బెంగళూరు 58 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇలా రెండోసారి కప్పును సాధించే అవకాశాన్ని బెంగళూరు చేజార్చుకుంది. ఆ తర్వాతి సీజన్‌లలో మాత్రం బెంగళూరు ఆశించిన స్థాయిలో ఆటను కనబరచలేక పోయింది. 2012లో లీగ్‌దశలోనే వెనుదిరిగింది. 2013లో ఐదో స్థానంలో నిలిచింది. 2014లో మరింత నిరాశ పరిచింది. ఈసారి ఏకంగా ఏడో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నా బెంగళూరు మాత్రం తన పేలవమైన ప్రదర్శనను ఈసారి కూడా కొనసాగించింది. దీంతో చివరి నుంచి రెండో స్థానం మాత్రమే దక్కింది. కానీ, 2015లో మాత్రం బెంగళూరు అనూహ్యంగా పుంజుకుంది. బ్యాటింగ్‌లో ఎబి డివిలియర్స్, బౌలింగ్‌లో యజువేంద్ర చాహల్ చెలరేగడంతో బెంగళూరు లీగ్ దశలో ఆడిన 14 మ్యాచుల్లో ఏడింటిలో విజయం సాధించింది. ఐదింటిలో ఓటమి పాలవ్వగా మరో రెండు మ్యాచులు రద్దయ్యాయి. లీగ్ దశలో బెంగళూరు మూడో స్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి క్వాలిఫయర్2కు అర్హత సాధించింది. అయితే చెన్నైతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.

మరోసారి నిరాశే
మరోవైపు 2016లో కూడా బెంగళూరు అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి ఈసారి అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. కోహ్లి వీరవిహారం చేయడంతో బెంగళూరు లీగ దశలో వరుస విజయాలు సాధించింది. ఆడిన 14 మ్యాచుల్లో 8 పోటీల్లో విజయం సాధించి లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్1లో గుజరాత్ లయన్స్‌ను ఓడించి బెంగళూరు ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఫైనల్లో మరోసారి బెంగళూరు బోల్తా పడింది. ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ ఫైనల్ ఫొబియాను ఛేదించలేక రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటిగ్ చేసిన సన్‌రైజర్స్ 208 పరుగుల భారీ స్కోరును సాధించింది. అయితే ఓపెనర్ క్రిస్ గేల్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో బెంగళూరు భారీ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. చెలరేగి ఆడిన గేల్ 38 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 76 పరుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లి కూడా వేగంగా 54 పరుగులు చేశాడు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ ఔట్ కావడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఇలా మూడోసారి బెంగళూరు రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు. ఆ తర్వాతి మూడు సీజన్‌లలో బెంగళూరు అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. కనీసం లీగ్ దశను కూడా దాటలేక పోయింది.

నిరీక్షణ ఫలిస్తుందా?
ఇక ఈసారి యుఎఇ వేదికగా ఐపిఎల్ టోర్నమెంట్ జరుగనుంది. మరోసారి బెంగళూరు టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈసారైన బెంగళూరుకు అదృష్టం వరిస్తుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నా కూడా బెంగళూరు ఒక్క సారి కూడా ఐపిఎల్ సాధించక పోవడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్‌కింగ్స్ వంటి జట్లు వరుస ట్రోఫీలతో ఐపిఎల్‌పై తమదైన ముద్ర వేయగా బెంగళూరు మాత్రం రన్నరప్‌లతోనే సరిపెట్టుకుంది. కానీ, ఈసారి బెంగళూరు ఎలాగైన ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ కోహ్లి ట్రోఫీని సాధిస్తానమనే నమ్మకంతో ఉన్నాడు. ఈసారి మెరుగైన ఆటతో నిరీక్షణకు తెరదించుతామనే ధీమాను కోహ్లి వ్యక్తం చేశాడు.

royal challengers bangalore has never won IPL Cup