Home తాజా వార్తలు యాడున్నాడన్నది కాదు… పాలన ముఖ్యం

యాడున్నాడన్నది కాదు… పాలన ముఖ్యం

Rs 250 cr for Mega Dairy in Mamidipally

 

మామిడిపల్లిలో రూ.250కోట్లతో మెగా డెయిరీ నిర్మాణం
ముఖ్యమంత్రి కెసిఆర్ కనబడనంత మాత్రాన పథకాలు ఆగిపోతున్నాయా?
ప్రధాన మంత్రి ఆన్‌లైన్లో సమీక్షలు నిర్వహించడంలేదా?
రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలకు సిఎం ఎప్పటికప్పుడుఅధికారులకు ఆదేశాలిస్తున్నారు, రైతులతోనూ మాట్లాడుతున్నారు
విపక్షాలు బాధ్యయుతంగా వ్యవహరించాలి
లాక్‌డౌన్ వల్ల లాభం లేదు, జాగ్రత్తలతోనే వైరస్ కట్టడి : మంత్రి తలసాని

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడ ఉంటే ఏంటీ? రాష్ట్రంలో పాలన సాగడం లేదా? ఆయన కనపడకపోతే ప్రభుత్వ పథకాలు ఏమైనా ఆగిపోతున్నాయా? అని ప్రతిపక్షాలపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మరోసారి తనదైన శైలిలో ధ్వజమెత్తారు. సిఎం కెసిఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే…ఆయన హెల్త్‌పై ప్రత్యేకంగా ఒక బులిటెన్ విడదల చేయాలని కోరడం సిగ్గుచేటని మండిపడ్డారు.గురువారం నాడిక్కడ మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ, సిఎం కెసిఆర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఖండించారు. అనవసరంగా సిఎం ఆరోగ్యంపై లేనిపోని పుకార్లు సృష్టించడం తగదన్నారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. అలాగే వ్యవసాయ శాఖ అధికారులతో కూడా తరుచూ ఫోన్‌లో మాట్లాడుతున్నారన్నారు. అన్ని ప్రతిపక్షాలకు చెప్పే సి ఎం కెసిఆర్ చేయాలా? అని ఈ సందర్భంగా తలసాని ప్రశ్నించారు. కెసిఆర్ ఉం టున్న ఫాంహౌజ్ కూడా మన రాష్ట్రంలోనే ఉందన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్ర తిపక్షాలు అనవసర రాజకీయాలు మానుకో ని బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని వస్తున్న ప్రచారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో లాక్‌డౌన్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉందన్నారు.

ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్‌ను కట్టడి చేయొచ్చని తెలిపారు. కరోనా వచ్చి పోతుంటుందన్నారు. అందుకు మంత్రి మహమూద్ అలీతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. వారంతా కరోనాను జయించిన వారేనన్నారు. కరోనాపై బిజెపి నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చేతనైతే వారు ప్రధాని మోడీతో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలని ఆయన సవాలు విసిరారు. కరోనా వ్యాప్తి ప్రారంభంలో ప్రధాని మోడీ దేశ ప్రజలను చప్పట్లు కొట్టాలని, దీపాలు వెలిగించాలని చేసిన వ్యాఖ్యలపై తాము ప్రశ్నించలేదు కదా? అని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మంచి సదుపాయాలున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా తలసాని పేర్కొన్నారు.

మామిడిపల్లిలో రూ.250కోట్లతో మెగా డెయిరీ నిర్మాణం
రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లిలో రూ.250 కోట్ల ఖర్చుతో మెగా డెయిరీ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కృత్రిమ గర్భధారణపై రైతులకు అవగాహన కల్పించేందుకు మామిడిపల్లిలో 55 ఎకరాల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనేది సిఎం కెసిఆర్ సంకల్పమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేంద్రం ఎంతో ప్రశంసించిందన్నారు. గొల్ల, కురమల అభివృద్ధి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీలో 50 శాతం మందికి గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన లబ్దిదారులకు త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

బ్రాండెడ్ మటన్ విక్రయాల కోసం ఔట్‌లెట్‌లన ఏర్పాటుకు అధ్యయన కమిటీని నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా పిల్లలతో కలిపి వాటి సంఖ్య 2 కోట్లకు చేరిందన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేలా ప్రతిచోట ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ముందస్తు చర్యలతో కరోనా, లాక్‌డౌన్ పరిస్థితుల్లో కూడా పాలు, పెరుగు కొరత రాకుండా చూడగలిగామన్నారు. ఖమ్మం వనపర్తిలలో ఒక్కోచోట 5 ఎకరాల విస్తీర్ణంలో షీప్స్ మార్కెట్‌ల నిర్మాణానికి రూ.25 లక్షల చొప్పున నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. చేప పిల్లల కొనుగోలు, పంపిణలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అధికారుల సహకారంతో అనేక కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.

Rs 250 cr for Mega Dairy in Mamidipally