Thursday, April 25, 2024

అత్యంత విలువైన రిస్ట్ వాచ్ స్మగ్లింగ్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఏడు చేతి గడియారాలను స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తున్న రిస్ట్ వాచీలలో రూ.27.09 కోట్లు విలువచేసే వజ్రాలు పొదిగిన బంగారు వాచీ కూడా ఉందని గురువారం అధికారులు వెల్లడించారు. ఇంత పెద్దమొత్తంలో లగ్జరీ వస్తువులను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ కమిషనర్ జుబేర్ రియాజ్ కమిలి తెలిపారు. ఈ వాచీల విలువ దాదాపు 60 కిలోల బంగారంతో సమానమని ఆయన చెప్పారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడిని తనిఖీ చేసినపుడు ఈ వాచీలు బయటపడ్డాయని ఆయన తెలిపారు. జాకబ్ అండ్ కంపెనీ, పియాజెట్ లైమ్‌లైట్ స్టెల్లా, రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచ్యువల్ డేట్ జస్ట్ బ్రాండ్లకు చెందిన ఈ వాచీలు అత్యంత ఖరీదైనవని, వీటిలో జాకబ్ అండ్ కంపెనీ(మోడల్ బిఎల్115.30ఎ) విలువ రూ. 27.09 కోట్లని ఆయన చెప్పారు. ఏడు రిస్ట్ వాచీలతోపాటు వజ్రాలు పొదిగిన బంగారం బ్రేస్‌లెట్, ఒక ఐఫోన్ పిఆర్‌ఓ 256 జిబి కూడా ఆ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నామని, వీటి మొత్తం విలువ రూ.28.17 కోట్లని ఆయన చెప్పారు. నిందితుడికి, అతడి సమీప బంధువుకు దుబాయ్‌తోపాటు యుఎఇలో ఖరీదైన వాచీలను అమ్మే దుకాణాలు ఉన్నాయని, ఢిల్లీలో ఒక ప్రముఖ వ్యక్తికి అందచేసేందుకు అతడు ఈ వాచీలను తీసుకువచ్చాడని ఒక సీనియర్ అధికారి తెలిపారు. గుజరాత్‌కు చెందిన ఆ క్లయింట్ ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో బసచేశాడని, ఆ వ్యక్తికి వీటిని అందచేయాల్సి ఉందని నిందితుడు చెప్పాడని ఆయన తెలిపారు. తన ప్రాణానికి ముప్పు ఉందన్న కారణంతో ఆ వ్యక్తి పేరు చెప్పేందుకు నిందితుడు నిరాకరిస్తున్నాడని ఆ అధికారి తెలిపారు.

Rs 27 crore Worth Wrist Watches Seized at Delhi Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News