Home రాష్ట్ర వార్తలు ఆడబిడ్డల రుణం తీర్చుకునేందుకే దీపం

ఆడబిడ్డల రుణం తీర్చుకునేందుకే దీపం

 దీపం పథకం కోసం రూ.300 కోట్ల కేటాయింపు
 ఏడాదికి 20 లక్షల గ్యాస్ కనెక్షన్ల అందజేత
మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది
 రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల
జిల్లాలో 70 వేల గ్యాస్ కనెక్షన్లు అందజేశాం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
 పాలమూరు- రంగారెడ్డి, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు నీరు వస్తుంది
 ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి
GASచేవెళ్ల : బడ్జెట్ రాస్తున్న సమయంలో సిఎం కెసిఆర్ ఆడ బిడ్డల రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో రూ.300 కోట్లు కేటాయించి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించాలని సూచించారని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఏడాదికి 20 లక్షల గ్యాస్ కనెక్షన్లును అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను అందిస్తోందన్నారు. చేవెళ్ల నియోజక వర్గంలోని ఐదు మండలాల్లోని ఐదువేల మంది దీపం లబ్ధిదారులకు సోమవారం గ్యాస్ కనెక్షన్లు రాష్ట్ర రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటెల మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా విలక్షణమైన జిల్లా అని పేర్కొన్నారు. జిల్లాలో హైటెక్ సిటిని చూసి గొప్ప జిల్లా అనుకుంటాం. కాని చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్‌లకు వెళ్లి చూస్తే తాగేందుకు మంచినీరు కూడా లభించే అవకాశముం డదని తెలిపారు. హైటెక్ సిటి జిల్లాలో ఉన్నా పూర్తిగా వెనుకబడిపోయిందని వివరించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం వస్తే రియల్ బూమ్ తగ్గిపోతుందని కొందరు వ్యాపారులు భావించారు. రాష్ట్రం ఆవిర్భావమైతే మన బతుకులు బాగుపడుతాయని చెప్పామన్నారు. అప్పుడు మా మాటలను ఎవరూ విశ్వసించలేదన్నారు. ఇప్పుడా ఫలితాలను అనుభవించబోతున్నామని వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి సంక్షేమ ఫలాలను అందించేందుకు కృషిచేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం ద్వారా మహిళలకు 20 లక్షల గ్యాస్ కనెక్షన్‌లను అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రం లోని అన్ని కుటుంబాలకు దీపం పథకం ద్వారా కనెక్షన్‌లను అందిస్తామని.. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియని తెలిపారు.
జిల్లాలో 70 వేల గ్యాస్ కనెక్షన్‌లు అందజేశాం : పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి
జిల్లాలో దీపం పథకం కింద 70 వేల గ్యాస్ కనెక్షన్‌లను అందించామని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని రూరల్ ప్రాంతా ల్లో మరో 20 వేల గ్యాస్ కనెక్షన్‌లను అందజేస్తామన్నారు. జిల్లాకు ఎప్పుడులేని విధంగా అత్యధికంగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకువచ్చామని వెల్లడించారు. జీఓ. 59 కింద జిల్లాలో 1 లక్షా 50 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిలో 70 వేల దరఖాస్తులు వివిధ కేసుల కారణంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లాలోని అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేస్తామని చెప్పారు. నియోజకవర్గానికి 400 చొప్పున అందిస్తామని వెల్లడించారు. మిషన్ కాకతీయ ద్వారా మన చెరువులను బాగుచేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వీటిలో భాగంగా 600 చెరువులను మొదటి విడతలో చేపట్టామని తెలిపారు. వర్షాల్లేమి కారణంగా చెరువులు నిండలేదన్నారు. జిల్లాలోని మరిన్ని చెరువులకు పునరుద్దరణ పనులను చేపడుతామని చెప్పారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. మొబైల్ సెలఫోన్‌లాంటి పరిశ్రమలు ఎన్నో మన రంగారెడ్డి జిల్లాకు వస్తున్నాయని తెలిపారు. దీనివల్ల కొంత నిరుద్యోగ సమస్య తీరే అవకాశముందన్నారు. కోట్ల రూపాయలను ఖర్చు చేసి హాస్టల్, పాఠ శాల విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం వండి పెడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు చేపట్టని పనులను సీఎం కేసిఆర్ రాష్ట్రంలో చేస్తున్నారని వెల్లడిం చారు. మరిన్ని నిధులు జిల్లాకు మంజూరు చేయించి రంగారెడ్డి జిల్లా అభివృద్దికి నిరంతరం పాటుపడతానని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు నీరు వస్తుంది ః కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు
ప్రాణహి-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి రెండు ప్రాజెక్టుల ద్వారా రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీరు వస్తుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావమయ్యాకే అభివృద్ది దిశగా పయనిస్తోందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా వెనుకబడి ఉందన్నారు. కట్టెల పొయ్యితో మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారని తలచి ప్రభుత్వం దీపం పథకం ద్వారా మహిళలకు గ్యాస్ కనెక్షన్‌లను అందిస్తోందని చెప్పారు. గ్రామ గ్రామాన బయోగ్యాస్‌ను స్థాపించుకోవాల్సిన అవసరముందన్నారు. సీఎం కేసిఆర్ బయోగ్యాస్‌లను గ్రామాల్లో ఏర్పాటు చేసి అందరికి అందించాలనే లక్షంతో పనిచేస్తున్నారని తెలిపారు. బయోగ్యాస్ గ్రామాల్లో ఏర్పాటు చేయడంవల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయన్నారు. సీఎం కేసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని పేర్కొన్నారు.
అమరుల త్యాగంతోనే తెలంగాణ వచ్చింది : కాలె యాదయ్య, చేవెళ్ల శాసనసభ్యులు
అమరుల త్యాగ ఫలంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైందని చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య తెలిపారు. చేవెళ్ల డివిజన్‌లో రోడ్ల అభివృద్దికి రూ. 53.93 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వాటితో రెన్యూవల్ బిటి రోడ్లను వేశామని చెప్పారు. సీఎం అభివృద్ది ఫలాలను సమానంగా ప్రజలకు అందించేందుకు పాటుపడుతున్నారని వెల్లడించారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ అభివృద్దికి నోచుకోలేకపోయిందని పేర్కొన్నారు. ఆహార భద్రత కార్డుల ద్వారా ఒక్కొక్కరికి 6 కిలోల రేషన్ బియ్యాన్ని అందిస్తోందని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 5 వేల మందికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్‌లు ఇస్తున్నామని చెప్పారు. దీపం పథకం ద్వారా నియోజకవర్గానికి మరిన్ని గ్యాస్ కనెక్షన్‌లు మంజూరు చేయాలని మంత్రి ఈటెల రాజేందర్‌ను ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె. ఆమ్రపాలి, మాజీ ఎంఎల్‌సి పట్నం నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేందర్‌గౌడ్, చేవెళ్ల ఆర్డీఓ కె. చంద్రమోహన్, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి, దేశమల్ల ఆంజనేయులు, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, నవాబ్‌పేట్, షాబాద్ మండలాల ఎంపీపీలు మంగలి బాల్‌రాజ్, అనితాశ్రీహరియాదవ్, నరసింహులు, పాండురంగారెడ్డి, పట్నంశెట్టి జ్యోతి, చేవెళ్ల వైస్ ఎంపిపి పోలీస్ వెంకట్‌రెడ్డి, తహాసీల్థార్ వి. వెంకట్‌రెడ్డి, ఎంపిడిఓలు రత్నమ్మ, పద్మావతి, సుభాషిణి, మొయినాబాద్ జడ్‌పిటిసి సభ్యులు చంద్రలింగంగౌడ్, చేవెళ్ల సర్పంచ్ మంగలి నాగమ్మ, చేవెళ్ల ఎంపిటిసి సభ్యులు గుండాల స్వరూపరాములు, సున్నపు పద్మావసంతం, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సామ మాణిక్యరెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు బేగరి నరసింహులు, ప్రధాన కార్యదర్శి బర్కల రాంరెడ్డి, నాయకులు టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పెద్దోళ్ల ప్రభాకర్, మాసన్నగారి మాణిక్యరెడ్డి, మంగలి యాదగిరి, జూకన్నగారి శ్రీకాంత్‌రెడ్డి, పాండుయాదవ్, షరీఫ్, నాగార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.