Thursday, April 25, 2024

పంజుగుల గ్రామసభ రసాభాస..

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి మండల పరిధిలోని పంజుగుల గ్రామ సభ రసాభాసగా మారింది. సోమవారం గ్రామ సర్పంచ్ పద్మ ఆంజనేయులు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మయ్య, చంద్రారెడ్డి, మరికొందరు గ్రామంలో జరిగిన స్టేట్ ఫైనాన్స్, తదితర నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామ యువకులు మరికొంత మంది సర్పంచ్, పంచాయతి కార్యదర్శి శ్రీనివాసులుతో వాగ్వివాదానికి దిగారు. దీంతో పంజుగులు గ్రామ సభ రసాభాసగా మారింది. ప్రస్తుత సర్పంచ్ వర్గం, మాజీ సర్పంచ్ వర్గం ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. ఒక దశలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పారు.

గ్రామ పంచాయతి ట్రాక్టర్ వినియోగంలో నిధులు దుర్వినియోగం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతిలలో అభివృద్ధికి దోహదం చేస్తుందని 2020లో ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ను అందించింది. అయితే కొంత మంది గ్రామ పంచాయతి ట్రాక్టర్ వినియోగంలో నిధులు, అలాగే ట్రాక్టర్లను సొంత పనులకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పంజుగుల గ్రామ ట్రాక్టర్ విషయంలో డీజిల్ అవసరాలకు మించి వాడారని గ్రామ ప్రజలు నాయకులపై ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగారు. సహాయ చట్టం ద్వారా అందించిన వివరాల్లో డీజిల్ సంబంధించి ట్రాక్టర్ వినియోగంలో నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు. అలాగే హరితహారంలో సర్పంచ్, కార్యదర్శి చెప్పే లెక్కలకు ఎక్కడ పొంతన లేదని వారు ఆరోపించారు.

40 లక్షల అవినీతి జరిగిందని ఆరోపణలు
పంజుగుల గ్రామానికి సంబంధించి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామ పంచాయతి ఫండ్ తదితర నిధుల విషయంలో సర్పంచ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని గ్రామానికి చెందిన చంద్రారెడ్డి, లక్ష్మయ్య, మరికొంతమంది ఆరోపించారు. అలాగే పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని, లక్షలలో అవినీతి జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా పంచాయతి అధికారికి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.

రాజకీయంగా ఎదుర్కొలేక ఆరోపణలు
రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ పండుగ పద్మ ఆంజనేయులు అన్నారు. తనపై చేసిన 40 లక్షల రూపాయల అవినీతి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సర్పంచ్ అన్నారు. గతంలో గ్రామ పరిధిలో చేసిన వెంచర్‌లలో గ్రామ పంచాయతికి ఇవ్వాల్సిన పదిశాతం స్థలం ఇవ్వలేదని సర్పంచ్ వర్గం ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News