Home వికారాబాద్ సా..గుతున్న రహదారుల పనులు

సా..గుతున్న రహదారుల పనులు

Rs 44 crores for road expansion

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంలా రోడ్లు భవనాలశాఖ అధికారుల పరిస్థితి మారింది. కోట్ల రూపాయలు మంజూరు చేసినా పనులు వేగమంతం చేయడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పైగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నత్తనడకన పనులు జరుగుతున్నాయని ఓ అధికారి వ్యాఖ్యానించడం కొసమెరుపు. వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి తాండూరు డివిజన్ కేంద్రం వరకు రహదారి విస్తరణకు రూ.44 కోట్లు మంజూరు చేశారు. మంత్రి మహేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు వచ్చాయి.  ౩౮ కిలోమీటర్ల పొడవుగల పనులను  మూడు బిట్లుగా విభజించి ముగ్గురు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. 9 నెలల క్రితమే పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు మంబాపూర్, దుగ్గాపూర్, కందనెల్లి, అల్లీపూర్, హరిదాస్‌పల్లి, ధారూరు వద్ద కాజ్‌వేల నిర్మాణం పూర్తి చేశారు. ఇంకా రెండు కాజ్‌వేలను ఉపయోగంలోకి తీసుకురావాల్సి ఉంది.  మార్గమధ్యలో రహదారి విస్తరణ చేపట్టారు. ఇప్పటి వరకు రూ.20 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. రెండవ లేయర్ పనులు ప్రారంభించాల్సి ఉన్నది. అయితే, కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు కేవలం రూ.5.50 కోట్ల వరకు బిల్లులు చెల్లించిన ప్రభుత్వం మిగిలిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేసింది. ఇదే అదనుగా భావించిన కాంట్రాక్టర్లు పనుల వేగం మందగించారు. దానివల్ల వాహనదారులు నిత్యం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాండూరు పట్టణంలో ఇంకా పనులు ప్రారంభించలేదు. విలియమ్‌మూన్స్ చౌరస్తా నుంచి పట్టణ నడిబొడ్డు వరకు సిమెంటు కాంక్రీటు నిర్మించాలని యోచిస్తున్నారు.

రాజీవ్‌గృహకల్ప నుంచి తాండూరు పట్టణం వరకు రోడ్డు డివైడర్ నిర్మించి సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని మంత్రి మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కానీ ఆర్‌అండ్‌బి అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు జరుగనందున పనులు నత్తనడకన సాగుతున్నాయని సాకు చూపుతున్నారు. తాండూరు రాజీవ్‌గృహ కల్ప నుంచి మన్‌సాన్‌పల్లి గ్రామ శివారు వరకు రహదారి విస్తరించారు. ధారూరు మండలం రాంపూర్ తండా నుంచి బాకారం వరకు విస్తరణ పనులు చేపడుతున్నారు. అయితే, కేరెళ్లి గ్రామంలో ఇరుకుగా ఉన్నందున పలు ఇండ్లను తొలగించి రోడ్లు విస్తరించనున్నారు. కేరెళ్లి నుంచి అనంతగిరి మీదుగా వికారాబాద్ వరకు పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. అనంతగిరి కొండలపై అటవీభూములు ఉన్నందున విస్తరణ పనులకు ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన డబుల్ రోడ్డు పనులకు రెండో లేయర్ బిటీ చేపట్టాల్సి ఉన్నది. ఈ పనులు పూర్తి చేసేందుకు మరో రెండు నెలలు పట్టవచ్చని భావిస్తున్నారు. ఇదే రహదారిపై రూ.11 కోట్లతో మరో మూడు చిన్న వంతెనల నిర్మాణానికి ఇటీవల నిధులు మంజూరు చేశారు. మన్‌సాన్‌పల్లి వంతెనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అదే గ్రామ శివార్లలో మరో చిన్న వంతెన నిర్మించనున్నారు.      కందనెల్లి వద్ద కూడా పెద్ద వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. రెండు    వారాల క్రితమే పనులకు టెండర్లు నిర్వహించారు. శిథిలా    వస్థకు చేరిన           మూడు పాత        వంతెన లను తొలగించి కొత్త పనులు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ఉన్నందున అక్టోబరు లేదా నవంబరులో పనులకు శ్రీకారం చుట్టాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ లెక్కన మూడు వంతెనలు పూర్తి చేయాలంటే 2019 ఫిబ్రవరి వరకు గడువు పడుతుందని అంచనా వేస్తున్నారు.

వికారాబాద్ నుంచి తాండూరు డబుల్ రోడ్డు పూర్తి చేసేందుకు మరో ఏడు నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల ఇంకా పలుచోట్ల పెండింగులో ఉన్న ఆర్‌అండ్‌బి రోడ్లను కూడా ఎన్నికల నాటికల్లా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనులూ వేగమంతంగా సాగుతున్నాయి. జాతీయ రహదారుల నిర్వహణ అధికారుల పరిధిలోకి వస్తున్నందున పనులు జోరుగా సాగుతున్నాయి. మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్  మీదుగా కర్నాటక  మెతక్ సరిహద్దు వరకు ఫోర్‌లైన్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులు పూర్తి చేసేందుకు మరో ఆరు నెలలు పడుతుందని అంచనా. ఈ రోడ్లన్నీ బాగుపడితే జిల్లా కేంద్రానికి రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. అధికారులు మొద్దు నిద్ర వీడి కాంట్రాక్టర్లను పురమాయిస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది. కోట్ల రూపాయలు మంజూరు చేసినా అధికారుల ఉదాసీనత వల్ల చాలావరకు రహదారులు నత్తనడకన సాగుతున్నాయి. ఉన్నత స్థాయిలో సమీక్షలు నిర్వహించి పనులను వేగమంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.