Home తాజా వార్తలు మేడారం జాతరకు రూ.75 కోట్లు విడుదల

మేడారం జాతరకు రూ.75 కోట్లు విడుదల

Medaram Jatara

మనతెలంగాణ/హైదరాబాద్: సమ్మక్క సారాలమ్మ జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేయడంపై మంత్రి సత్యవతి రాథోడ్ సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో అత్యధిక భక్తులు సందర్శించే ఈ జాతరపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. శనివారం అధికారులతో జరిపిన సమీక్షలో భాగంగా మంత్రి పలు సూచనలు చేశారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మెరుగైన సేవలందించే విధంగా పనులు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రతి పైసా భక్తుల సౌకర్యార్ధం వినియోగించాలని, వృథా ఖర్చులను నివారించాలని ఆమె సూచించారు. త్వరలోనే జాతర ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ జాతరకు సంబంధించి రోజు వారీ ప్రణాళికలను సిద్ధం చేసుకొని పకడ్భందీ సమన్వయంతో పనిచేయాలన్నారు. శాఖల వారీగా నిధుల కేటాయింపు జరిగిన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని పనిచేయాలని ఆమె సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున పనులను వేగంగా పూర్తి చేయాలని, అదే సమయంలో నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని ఆమె ఆదేశించారు.

Rs 75 crore released for Medaram Jatara