Home ఎడిటోరియల్ మహిళా బిల్లుకు మోక్షం ఎప్పుడు?

మహిళా బిల్లుకు మోక్షం ఎప్పుడు?

women quota bill in LS

 

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి 17వ లోక్‌సభ కొత్త సభ్యులు కొలువు తీరుతున్న వేళ 78 మంది మహిళా పార్లమెంటు సభ్యులు అడుగిడనున్నారు. 2014 ఎన్నికల్లో 62 మంది మహిళలు గెలిస్తే, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ముగ్గురు (3) గెలుపొందారు. 16వ లోక్‌సభ ముగిసే నాటికి ఆ సంఖ్య 65కు చేరింది. ఈసారి మహిళా ప్రాతినిధ్యం కొంత మెరుగైనప్పటికీ 33% మహిళా రిజర్వేషన్ బిల్లు లక్షానికి మాత్రం అందనంత దూరంలో ఉండిపోవడం జరుగుతున్నది. 1952లో 43 మహిళలు పోటీ చేస్తే 22 మంది గెలుపొందారు. తాజా 17వ లోక్‌సభలో 724 మంది మహిళలు (అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిసి) పోటీ చేస్తే 78 మంది విజయం సాధించారు.

ఏడు దశాబ్దాల పైబడి స్వాతంత్య్ర దేశంలో మహిళలకు లభించిన గుర్తింపు ఇదేనా! ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మహిళా ప్రాతినిధ్యం ఎంతో పేలవంగా ఉందనేది వాస్తవం. పితృస్వామ్య ఆధిపత్యం ఎంతగా సమాజంలో గూడుగట్టుకుందో చెప్పడానికి ఆడ, మగ(లింగ) భేదాలు ఉండకూడదని రాజ్యాంగ నిర్మాతలు గట్టిగా విశ్వసించారు. కాని నేడు ప్రజాస్వామ్య భారతావనిలో పార్టీలు మహిళకు సముచిత స్థాయిలో పార్టీ టికెట్లు ఇవ్వడం లేదు. గెలుపు గుర్రాల పేరుతో ఎవరికి వారే పురుషాధిక్యతను చాటుతూ మహిళలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఈసారి కాంగ్రెసు 54 మంది మహిళలకు, బిజెపి 53 మంది మహిళలకు పార్టీ టికెట్లు ఇచ్చాయి. మిగిలిన వారంతా ప్రాంతీయ పార్టీల తరుపున, స్వతంత్రులుగా నిలబడినవారే.

రాజ్యాంగ సవరణల ఆధారంగా స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు, స్త్రీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించుకున్నాం. చైతన్యం క్రమక్రమంగా పెరిగి మహిళలకు పదవులకు వన్నె తెచ్చి అద్భుత ఫలితాలతో పాలన సాగిస్తున్నారు. పాలకులు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చినట్లే పార్లమెంట్, శాసన(చట్ట) సభలలో ఎందుకు మహిళా రిజర్వేషన్లు కల్పించలేకపోతున్నారు? తమ పదవులకు ఎసరు వస్తుందనే స్వార్థంతో కూడబలుక్కొని అన్ని (పార్టీలు) నేతలు కావాలని మహిళా బిల్లుకు మోక్షం కలగకుండా అడ్డు పడుతున్నారు. ఇది కాదనలేని వాస్తవం. 17వ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పక్షాలైన బిజెపి, కాంగ్రెసు రెండూ మహిళా కోటాకు మద్దతునిస్తామని చాటాయి. “అబ్‌కి బార్ 300కే పార్‌” అంటూ ప్రచార హోరు మ్రోగించాయి. అంచనాలకు మించి సంపూర్ణ మెజార్టీ సాధించిన దరిమిలా మరోవైపు మహిళా కోటకు దాదాపు అందరూ ఒప్పుకుంటున్నందున పాలక బిజెపి చిత్తశుద్ధిని ప్రదర్శించి మహిళా బిల్లుకు మోక్షం కల్పించాల్సిన బాధ్యత ఉందని గమనించాలి.

17వ లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. సిటింగ్ మహిళా ఎం.పి.లు తమ ప్రత్యర్థుల్ని చిత్తు చేశారు. దేశ వ్యాప్తంగా 41 మంది మహిళా సిటింగ్ ఎం.పి.లు పోటీపడగా వారిలో 28 మంది విజయకేతనం ఎగరవేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉంటే కొత్తగా ఎన్నికైన మహిళా ఎం.పిలు కేవలం 5 మందే. మహిళా ప్రాతినిధ్యం పరంగా చూస్తే 193 దేశాల జాబితాలో మన దేశ స్థానం 152తో దీన స్థితిని చూపుతుంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌ల కన్నా వెనకబడింది. ఇది మన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని చెప్పకతప్పదు. స్త్రీని దేవతగా, భారతమాతగా కొలుస్తూ మాటల్లో అత్యుత్తమ స్థానం కల్పిస్తున్న, చూస్తున్న భారతజాతికి ఇది తలవంపు. ఒకవైపు బాలిక విద్య, ఆడపిల్లకు పార్లమెంటులో బెర్తు (సీటు) సంగతేమోకాని, అమ్మ కడుపులో (సీటుంటే) బ్రతకనిస్తే చాలు అనే దుర్భర పరిస్థితులను చూస్తున్నాము. ఇలాంటి విపత్కర సమయంలో మహిళా బిల్లును చట్టంగా పార్లమెంటు ఆమోదించాలి. అలుముకున్న అడ్డంకులను తొలగించడానికి 17వ లోక్‌సభకు పుష్కల అవకాశాలు ఉన్నాయి. ఏడు దశాబ్దాల స్వాతంత్య్రంలోనూ మహిళా బిల్లు కలగానే మిగిలింది.

లోక్‌సభలో పాలక పక్షానికి సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టిన వేళ మహిళా బిల్లు ఆమోదించడం పెద్ద సమస్య కానే కాదు. ఈ సమాజం తీరుపై స్త్రీ ఆవేదన… నా తల్లిదండ్రుల ఆస్తి నాది కాదు. నా అత్తమామల ఇంట్లో ఎలాంటి హక్కులేదు. నన్ను బానిసగా ఇంకెన్నాళ్లు బ్రతకమంటారని నేటి స్త్రీ ప్రశ్నిస్తుంది. స్త్రీలు గౌరవించబడే సమాజం అష్టైశ్వర్యాలతో సౌభాగ్యవంతంగా భాసిల్లుతుందని విశ్వసించేవారు నేడు పాలనా పగ్గాలు చేపట్టినారు. కావున “మహిళా బిల్లు” కు ఎలాంటి అడ్డంకులు లేవనేది వాస్తవం. నూతనంగా కొలువైన భారత దేశ పాలకులు మహిళా బిల్లుతో పాటు అనేక జనరంజక పాలనను సాగించాలి. ప్రజలు ఎంతో నమ్మకంతో పాలన పగ్గాలు ఇచ్చినందున కుల, మత, ప్రాంత, లింగ భేదాలులేని విధంగా రాజ్యాంగంపై ప్రమా ణం చేసిన విధంగా, బడిలో ప్రతిజ్ఞ మననం చేస్తూ… నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా పాలన అందించాల్సి ఉంది.

Urge Govt to ensure passage of women quota bill in LS