Friday, April 19, 2024

ఇన్ఫోసిస్ మీద ఆర్‌ఎస్‌ఎస్ దాడి!

- Advertisement -
- Advertisement -

RSS attack on Infosys!

ఆర్‌ఎస్‌ఎస్ హిందీ వార పత్రిక పాంచజన్య సెప్టెంబరు ఐదవ తేదీ సంచికలో ఇన్ఫోసిస్ దేశ వ్యతిరేక శక్తంటూ ఆధారం లేని ఆరోపణలతో విషం చల్లారు. అలాంటి చౌకబారు పనికి విలువలు వలువల గురించి నిత్యం వల్లించే మరో పత్రిక ఏదైనా పాల్పడుతుందా? ఏమి రాసినా తమను రక్షించేవారు పైన ఉన్నారనే తెగింపు గాకపోతే మరేమిటి? కొన్ని పత్రికలు ఈ దిగజారుడు రాతలను విమర్శించినా మొత్తంగా మీడియా, కార్పొరేట్ రంగం దీని గురించి నోరు విప్పేందుకు భయపడింది.కొన్ని సంస్థల అధికారులు కార్పొరేట్ జవాబుదారీతనం గురించి చెప్పారు. అనేక కార్పొరేట్ కంపెనీలు వాటాదార్లను నిలువునా ముంచాయి. అప్పుడు ఈ సుద్దులు చెప్పలేదేం. అవి ఆయా కంపెనీల అంతర్గత వ్యవహారాలైతే ఇదేమిటి? ఇప్పుడు ఎవరిని సంతృప్తిపరచేందుకు, మెప్పు పొందేందుకు, తద్వారా లబ్ధి పొందేందుకు ఈ సుభాషితాలు? అవును, ఇన్ఫోసిస్ సంస్ధ తయారు చేసిన ఆదాయపన్ను శాఖ పోర్టల్ ఆశించిన విధంగా పని చేయటం లేదు. అదొక్కటేనా, అనేకం సరిగా పని చేయటం లేదు. సరిదిద్దుతామని ఆ సంస్ధ చెప్పిన వ్యవధిలోపల పూర్తి కాలేదు. ఏం చేయాలి? దానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. దానికి చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టాలి లేదా అవకాశం ఉంటే నష్టపరిహారం కూడా రాబట్టాలి. లేదూ సాధ్యం గాకపోతే మరొక సంస్థతో కొత్త పోర్టల్‌ను తయారు చేయించాలి. అది ప్రభుత్వం ఇన్ఫోసిస్ మధ్య వ్యవహారం. అప్పటి వరకు దేశం ఆర్ధికంగా స్తంభించించి పోదుగా ! ఒక సాంస్కృతిక సంస్థ పత్రిక నుంచి ఎందుకీ దాడి!

పాంచజన్య దాడి వెనుక అజెండా లేకుండా ఉండదు. కార్పొరేట్ శక్తుల హస్తం ఉండే అవకాశం లేకపోలేదు. ఒకనాటికి బయటకు రాకపోదు. ప్రభుత్వ వైఖరులు, విధానాలను విమర్శించే కొన్ని న్యూస్ పోర్టల్స్, వెబ్‌సైట్లకు ఇన్ఫోసిస్ సంస్ధ నిధులు అందచేస్తున్నదనే ప్రచారాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌లో కొందరు చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. వారు కూడా దీని వెనుక ఉండవచ్చు. తమకు నచ్చని లేదా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారిని దేశద్రోహులుగా చిత్రించి ప్రచారం చేయటం గత ఏడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలను కూడా ఆ జాబితాలో చేర్చి దాడి ప్రారంభించారు. ఇన్ఫోసిస్ కంపెనీ స్ధాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని 2014లో కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ప్రస్తుత ప్రభుత్వ “భావజాలాన్ని” నారాయణ మూర్తి వ్యతిరేకించటం ఏమాత్రం దాచలేరని, ఒక నిర్ణీత భావజాలానికి చెందిన వారిని ముఖ్యమైన బాధ్యతల్లో నియమించటం, అలాంటి కంపెనీ ముఖ్యమైన ప్రభుత్వ కాంట్రాక్టులను పొందటం, చైనా, ఐఎస్‌ఐ ప్రభావితం చేసే ముప్పు లేదా అని కూడా ఆ వ్యాసకర్త పేర్కొన్నారు. అసలు విషయం పోర్టల్లో లోపం కాదన్నది ఈ మాటలను బట్టి అర్ధం అవుతోంది.

ఇన్ఫోసిస్‌పై పాంచజన్య దాడే జాతీయ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నదని, భారతీయ కార్పొరేట్లు నోరు విప్పాలని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకీయం రాసింది. భావప్రకటన స్వేచ్ఛ గురించి రెండు నాలికలతో మాట్లాడుతున్నారని బిజినెస్ స్టాండర్డ్ పేర్కొన్నది. ప్రత్యర్ధుల మీద, ముస్లింల మీద నోరు పారవేసుకున్న వారెవరి మీద ఇంతవరకు బిజెపి లేదా సంఘపరివార్ చర్య తీసుకున్నది లేదు. మహా అయితే అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాకేమీ సంబంధం లేదని తప్పించుకుంటారు. అందుకే పదేపదే అవి పునరావృతం అవుతున్నాయి. ఉదాహరణకు కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి ముస్లింల మీద వ్యాఖ్యలు చేసి విధిలేక క్షమాపణ చెప్పారు. తిరిగి రెండవసారి ఆమెకు మంత్రి పదవిని బహుకరించారు. కంపు మాటలు సంపదలను నాశనం చేస్తాయనే శీర్షికతో ఎకనమిక్ టైవ్‌‌సు తప్పు పట్టింది. పాంచజన్యకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది. పోర్టల్ సరిగా పని చేయకపోతే కంపెనీని సంప్రదించేందుకు గౌరవప్రదమైన పద్ధతులు ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ట్వీట్ ద్వారా అంత పెద్ద కంపెనీ సిఇఒ తమను కలవాలని ఆదేశించింది.

ఇది ఎవరి గౌరవానికి భంగం? ఇన్ఫోసిస్ కంటే ఎన్నో రెట్లు పెద్దదైన టాటా గ్రూపు కంపెనీ మీద కూడా ఆగస్టు నెలలో వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ దాడి చేశారు. అంబానీ గ్రూపు కోసం అమెజాన్ను అడ్డుకుంటున్న దేశభక్తి ఒకవైపు మనకు కనిపిస్తూనే ఉంది. అనేక మంది అమెజాన్‌పై దాడిని సమర్ధించి మన స్వదేశీ కార్పొరేట్లకు మద్దతు ఇస్తే తప్పేమిటి అని ఎదురుదాడికి దిగిన వారున్నారు. మరి ఇప్పుడు ఇన్ఫోసిస్, టాటా కంపెనీల మీద జరుగుతున్న దాడి గురించి ఏం చెబుతారు? ఇలా విదేశీ స్వదేశీ కంపెనీల మీద దాడులకు దిగితే బయటి నుంచి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? స్వదేశీ కార్పొరేట్లు తమకు అనువైన విదేశాలకు పెట్టుబడులను తరలించవా?

ఒక కంపెనీ వైఫల్యం గురించి ఇంతగా గుండెలు బాదుకుంటున్నవారు, దేశద్రోహాన్ని, ఆర్ధిక వ్యవస్థ విచ్చిన్నాన్ని చూస్తున్న వారికి నరేంద్ర మోడీ సర్కార్ తప్పిదాలు, దిద్దుబాటులో వైఫల్యాలు కనిపించవా? నల్లధనాన్ని వెలికి తీసేందుకు పెద్ద నోట్లను రద్దు చేశానని 2016 నవంబరు ఎనిమిదిన ప్రకటించిన నరేంద్రమోడీ ఇప్పటి వరకు వెలికితీసిన నల్లధనం ఎంతో నోరు విప్పి చెప్పారా? నాలుగు సంవత్సరాల తరువాత తీరికగా సెలవిచ్చిందేమిటి? తన చర్యతో దేశంలో నల్లధనం తగ్గిందట, బ్యాంకు లావాదేవీలు పెరిగాయట? దేనితో నవ్వాలో జనానికి అర్ధం కాలేదు. నోట్ల రద్దు, తగిన కసరత్తు లేకుండా చేసిన జిఎస్‌టి వలన జరిగిన నష్టాన్ని సంవత్సరాలు గడిచినా పూడ్చలేని మోడీ సర్కార్ ఘోర వైఫల్యం కనపడలేదు గానీ పాంచజన్యానికి ఇన్ఫోసిస్ దేశద్రోహం కనిపించిందా? నరేంద్ర మోడీ సర్కార్ ఇవన్నీ జవాబుదారీతనంతో చేసిన నిర్వాకాలని చెబుతారా? పాంచజన్య చేసిన దాడి గురించి వ్యాఖ్యానించాలని కోరగా ఇన్ఫోసిస్, టాటా కంపెనీలు స్పందించలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొన్నది.

తమతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా నోరు విప్పితే సంభవించే పర్యవసానాల గురించి భయపడ్డారని కూడా రాసింది. ఈ వార్త ప్రపంచ వ్యాపితంగా మీడియాలో ప్రాచుర్యం పొందింది. విదేశీ పెట్టుబడిదారులు ఈ పరిణామాన్ని గమనించరా?ఇ కామర్స్ నిబంధనలను విమర్శించినందుకుగాను వాణిజ్య మంత్రి పియుష్ గోయల్ టాటా గ్రూప్ కంపెనీపై ధ్వజమెత్తారు. స్ధానిక వ్యాపారులు కేవలం లాభాల గురించే ఆలోచించకూడదని సుభాషితం పలికారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేరు ప్రస్తావిస్తూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. వినియోగదారులకు లబ్ధి చేకూర్చేందుకు తాను తెస్తున్న చట్టాలను టాటా సన్స్ అభ్యంతర పెడుతున్నారు, అదెంతో బాధ కలిగించింది. కొన్ని విదేశీ కంపెనీలను కొనుగోలు చేసిన తరువాత జాతీయ ప్రయోజనం కంటే అది మరింత ముఖ్యమైంది. నేను, నాది, నా కంపెనీ అనే వైఖరి నుంచి మనం ముందుకు పోవాలి. జాతీయవాద దేశాలైన జపాన్, దక్షిణ కొరియాల్లో మీ ఉక్కు ఉత్పత్తులను అమ్మేందుకు ప్రయత్నించి చూడండి.

దేశంలోని ఎంఎస్‌ఎంఇల నుంచి ధర ఎక్కువైనా జాతీయ ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని వాటిని కొనుగోలు చేయాలని మంత్రి అన్నారని వార్తలు వచ్చాయి. పియూష్ గోయల్ సిఐఐ ఏర్పాటు చేసిన నాలుగు గోడల మధ్య జరిగిన వార్షిక సమావేశంలో ఆ విమర్శ చేశారు. అధికారికంగానే సమావేశం తరువాత సదరు మంత్రి ప్రసంగం ఉన్న వీడియోను సిఐఐ యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. అయితే దాని మీద విమర్శలు రావటంతో ప్రభుత్వమే ఉపసంహరించాలని కోరింది. దాంతో వివాదాస్పద అంశాలను కత్తిరించి తిరిగి విడుదల చేశారు. తరువాత కారణాలు చెప్పకుండానే తరువాత దాన్ని తొలగించారు. పియూష్ గోయల్ స్ఫూర్తితో పాంచజన్య బహిరంగ దాడికి పాల్పడింది. కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన విధానాలను అనుసరించినంత కాలం బడా సంస్థలు మౌనంగా ఉంటాయి. లేనపుడు పాలకులనే మార్చి వేసేందుకు పావులు కదుపుతాయి. మన్మోహన్ సింగ్ కంటే మరింతగా, నిర్దాక్షిణ్యంగా తమకు దోచిపెడతారనే కారణంతోనే నరేంద్ర మోడీని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలు, వాటి ఆధీనంలోని బడా మీడియా ఆకాశానికి ఎత్తిందన్నది బహిరంగ రహస్యం.

ద్విచక్ర వాహనాల మీద 28 శాతంగా ఉన్న జిఎస్‌టిని తగ్గింపు గురించి ఆలోచిస్తామని చెప్పిన నిర్మలా సీతారామన్ ప్రకటనను బజాజ్ కంపెనీ సహజంగానే స్వాగతించింది. పద్దెనిమిది శాతానికి తగ్గించే అవకాశం ఉందని, మోటార్ సైకిళ్లు, స్కూటర్ల వెల ఎనిమిది నుంచి పది వేల మేరకు తగ్గుతుందని ఒక టివి ఇంటర్వ్యూలో బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ చెప్పారు. ఎగుమతి ప్రోత్సహాకాలను రద్దు చేసినందుకు అదే ఇంటర్వ్యూలో రాజీవ్ బజాజ్ కేంద్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. దాని వలన తమ కంపెనీ రూ. 300 కోట్లు నష్టపోయిందని చెప్పారు. ఎగుమతుల ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించిందికేంద్ర ప్రభుత్వం, 201718లో ఎగుమతి ప్రోత్సాహాకాల కింద వివిధ సంస్థలకు చేకూర్చిన లబ్ధి రూ. 34,750 కోట్లు. 2020లో ఏప్రిల్ డిసెంబరు మాసాల మధ్య ఆ మొత్తాన్ని తొమ్మిది వేల కోట్లకు కుదించారు. తరువాత కొత్త దరఖాస్తులను స్వీకరించటాన్నే నిలిపివేశారు. కేసుల నుంచి తప్పుకొనేందుకు తమది రాజకీయ సంస్థ కాదు కేవలం సాంస్కృతిక సంస్థ అని రాజకీయాల్లో పాల్గొనబోమని రాతపూర్వకంగా జాతి పిత గాంధీ హత్య సందర్భంగా రాసి ఇచ్చిన సంస్థ.

అప్పటి నుంచి అది చేస్తున్న రాజకీయం ఏమిటో తెలిసిందే. అందువలన అవసరార్ధం అవాస్తవాలు చెప్పవచ్చని మార్గం చూపిన ఆదర్శం దానిది. ఈ నేపథ్యంలో పాంచజన్య తమ అధికార పత్రిక కాదని ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి చెప్పారు. ఇది వాస్తవమా? అతల్ బిహారీ వాజ్‌పాయి సంపాదకుడిగా 1948లో అది ప్రారంభమైంది. రాష్ర్ట ధర్మ ప్రకాషన్ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ ఒక ప్రచురణ కేంద్రాన్ని ప్రారంభించింది. 1977లో పత్రిక ప్రచురణ హక్కులను ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన మరో సంస్ధ భారత ప్రకాషన్ ఢిల్లీ లిమిటెడ్‌కు బదలాయించింది. అందువలన పత్రిక మాది కాదంటే దబాయింపు తప్ప మరొకటి కాదు. ఇలాంటి వైఖరిని అర్ధం చేసుకోలేని స్ధితిలో జనం ఉన్నారా? లోక్‌సభ ఎన్నికలు ముగిసి రెండవ సారి నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తరువాత బజాజ్ గ్రూప్ అధిపతి రాహుల్ బజాజ్ మాట్లాడింది గుర్తుందా? గో రక్షకుల పేరుతో మూక లు చెలరేగి హత్యాకాండకు పాల్పడుతున్నవారి మీద, పార్లమెంట్‌లో జాతిపిత హంతకుడు గాడ్సేను స్తుతించిన బిజెపి ఎంపి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మీద ఎలాంటి చర్య తీసుకోలేదని రాహుల్ బజాజ్ నరేంద్రమోడీని విమర్శించారు.

ఇదెక్కడో ఎసి గదుల్లో గుసగుసలాడింది కాదు. మోడీ కంటే ఎక్కువ పలుకుబడి కలిగిన నేతగా ప్రాచుర్యం పొందిన అమిత్ షా, పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్ సమక్షంలోనే బహిరంగంగా 2019 డిసెంబరు ఒకటిన చెప్పిన మాటలు. అంతేనా! మోడీ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోతున్నారని, కార్పొరేట్‌లు భయంతో జీవిస్తున్నారని కూడా అన్నారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేదని, ఇన్ఫోసిస్‌పై దాడిని మౌనంగా చూస్తున్న కార్పొరేట్‌ల వైఖరి వెల్లడించటం లేదా ?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News