Home జగిత్యాల కొండగట్టు ఘటన ఎఫెక్ట్… ఆర్టీసి బస్సు సీజ్

కొండగట్టు ఘటన ఎఫెక్ట్… ఆర్టీసి బస్సు సీజ్

మనతెలంగాణ/జగిత్యాల: గత సంవత్సరం సెప్టెంబరులో జిల్లాలోని కొండగట్టులో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బస్సులో పరిమితికి మించి ఎక్కించడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయినా ఆర్టీసీ నిర్వాహకుల్లో చలనం రాలేదు. ఇంత ఘోరం జరిగిన మళ్లీ అదే తీరులో ప్రవర్తిస్తున్నారు. బుధవారం కోరుట్ల నుండి కరీంనగర్ వెళ్తున్న ఓ పల్లెవెలుగు బస్‌లో 55 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా 125 మంది ప్రయాణికులను బస్‌లో ఎక్కించుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్‌రావు ఆర్‌టిసి బస్‌ను సీజ్ చేసి కోడిమ్యాల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్బంగా జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్‌రావు మాట్లాడుతూ, ఇటీవల పరిమితికి మించి ఆర్‌టిసి బస్‌లో ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లె కొండగట్టు వద్ద జరిగిన బస్ ప్రమాదంలో 70 మంది ప్రయాణికులు మృతి చెందారన్నారు. ఈ ఘటన మరువక ముందే ఆర్‌టిసి అధికారులు పరిమితికి మించి బస్‌లో ప్రయాణికులను ఎక్కించుకోవడం శోచనీయమన్నారు. ఇప్పటి నుండి తరుచుగా తనిఖీలు నిర్వహిస్తామని నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు తీసుకుంటామని కిషన్ రావు తెలిపారు.

RTC bus seized for violating permit rules in Jagtial