Home దునియా ఏవీ అలకల చిలుకలు?

ఏవీ అలకల చిలుకలు?

                    Chat-Bhandar-Cartoon

చాట్ భండార్: మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిననాడు- సాగరములన్నియు ఏకము కాకపోవు’ అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు అలిగేవాళ్లకు కొదవ లేదుగాని సాగరాలే ఏకం కావటం లేదు. అలుగుతున్నవాళ్లు ‘మహా మహితాత్ములు’ కాదన్నమాట. ఇప్పుడు మాయమాటల నవాజ్ గారు కూడా టెర్రరిస్టుల జోలికివచ్చినందుకు అమెరికా మీద అలుగుతున్నారు.

భారత్ మీద దుష్ప్రచారాలు చేయడానికి భూమి చుట్టుకొలత కనిపెడుతున్నా రాయన ప్రస్తుతం.అదలా ఉంచండి.. నానా కుంభకోణ విరాజితులు కూడా దర్యాప్తులో కేటుగాళ్లని తేలేదాకా ప్రభుత్వం మీద, ‘అడిగో దొంగ’ అని అరిచే వాళ్ల మీదా మా చెడ్డ అలుగుతూనే ఉంటారు.

రకరకాల అలకలన్నీ మన ఆర్‌టిసి బస్సులమీద సొట్టల రూపంలో తేలుతూ ఉంటాయి. సామాజిక అలకలు తీరిపోయే సౌలభ్యం ఒకటుండాలని ఆర్‌టిసి బస్సుని కనిపెట్టినట్టు ఉంది. ఏ జన్మయినా ఎత్తవచ్చుగాని బస్సుజన్మ, అందులోనూ ఆర్‌టిసి బస్సు జన్మ ఎత్తకూడదని ఓ బస్సు నా కలలో కనపడి ఏడుస్తూ చెప్పింది. ఈ కల ఎందుకు వచ్చింది చెప్మా అని ఆలోచిస్తే ఈ అలకల రామాయణం తట్టింది.

అక్కడెక్కడో ప్రజాస్వామ్యంలేదని ఇక్కడ బస్సు.. అదే ఆర్‌టిసి బస్పు తగలెట్టేస్తారు. అందుకు ముందు రాళ్లతో కొడతారు. అసలు అక్కడెక్కడో ప్రజాస్వామ్యం లేకపోడానికి నన్నెందుకు కొట్టి తగలేస్తారని ఆర్‌టిసి బస్సు అడిగితే నా కడుపులో దేవినట్టు అయిపోయింది. అవున్నిజమే! వేళకి బస్సులు నడపడం రాని ఆర్‌టిసి అక్కడెక్కడో ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడగలదు? ఔరా! ఇంతమాత్రంఆలోచించలేరా మన అలకల మొలకలు!

ఆలోచించడానికి, అలగడానికి చుక్కెదురు. అలగడమే మనపని. ఇక అలకతీర్చడం ఏలినవారి పని అన్నట్టుటుంది వారి ధోరణి. ఆ మధ్య మమత గారు ఎప్పుడూ అలుగుతూ రాజకీయ అలకల అడ్రసులా మారి అధికారం పట్ట్టేరు. ఇప్పుడు ఆమెమీదే చాలామంది ప్రజలు అలుగుతున్నారు. రైలు సౌకర్యాల మీద అలిగి వెంటనే రైలు దిగిపోయే రకం వాళ్లుంటారు. అలక దిగాక తెలిసి వస్తుంది వాళ్లకి ..దారిలో దిగకుండా నెక్స్ స్టేషన్‌దాకా ఆగాలని.. లేకపోతే దారీ తెన్నూ వెతుక్కొంటూ దూరాలు నడవాలని.

దేనికోదానికి అలగకుండా అస్తిత్వం నిలబెట్టుకోలేమని చాలా మంది నమ్మకం. అందుకే అన్నం వండడం, బట్టలుతకడం అప్పుడప్పుడు మానేసేవారు పూర్వం గృహిణీమణులు. ఆ వ్యవధిని అలక’కి కేటాయించేవారు.

మన సమాజానికి ఆర్‌టిసి బస్సులా ఇంటికి కూడా ‘అలకా గృహం’ అనే సౌలభ్యం ఉండేది పూర్వం. ఇళ్ల వైశాల్యం తగ్గి, ఖర్చు పెరగడంతో ఆ సౌలభ్యం అటాచ్డ్ బాత్రూం కంటె కనాకష్టానికి పడిపోయి అలకా గృహాలు ఏగృహం లోనూ ఇప్పడు కనపడడం లేదు. ఈవేళ గృహాణి అలిగితే మొత్తం గృహం ఛిద్రమవుతుందే తప్ప ఏదో ఓగది మాత్రమే కాదు. నెలాఖరు రోజుల్లో ఇప్పుడు మధ్య తరగతి ఇళ్లన్నీ అలకా గృహాలే. పూర్వం అలకా గృహ ప్రవేశానికి ఓ యూనిఫాం ఉండేది కామోసు. లేకుంటే ‘ వాసెన కట్టు కట్టి.. నిడువాకిలి కస్తురి బొట్టువెట్టి..’ అనే పద్యం ఎందుకు రాస్తారు నంది తిమ్మన్నగారు?

జీవితాల్లోంచి అందమైన అపరాధాలు మాయమైపోయాక అంతా ‘ఆగ్రహ భైరవాలే కాని అలకల చిలుకలు ఏవీ!
జీవన సాహిత్యంలోంచి సత్యభామ ఎటుపోయిందర్రా?

పురాణం జూనియర్
8977889588