Friday, April 19, 2024

బైలెల్లిన బస్సులు

- Advertisement -
- Advertisement -

RTC buses started all over the state

 

కరోనా భయంతో అంతగా సాగని ప్రయాణాలు, ఒకటి రెండు చోట్ల మినహా
ఖాళీగానే నడిచిన బస్సులు
జిల్లాల మధ్య రైట్..రైట్ సందడి
రోడ్డెక్కిన 2900 ఆర్‌టిసి బస్సులు
నిజామాబాద్,ఆసిఫాబాద్, ఉమ్మడి
కరీంనగర్ జిల్లాల నుంచి జెబిఎస్
వరకు నడిచిన సర్వీసులు
హైదరాబాద్‌లోకి నో ఎంట్రీ
శివారుల వద్దనే ఆగిపోయిన వాహనాలు
ప్రయాణికుల్లో విశ్వాసం కలిగించడానికి మహబూబ్‌నగర్ నుంచి బస్సులో ప్రయాణం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్లెక్కాయి. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో గత 56 రోజులుగా డిపోలకే పరి మితమైన బస్సులు మళ్లీ రోడ్లపై పరుగులు దీశాయి. ఉదయం నుంచీ ఆయా ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది బస్టాండ్‌లకు చేరుకోవటం తో అంతటా సందడి వాతావరణం ఉత్పన్నమైం ది. డైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించి.. శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకున్నాకే బస్సులను బయటికి తీశారు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో బస్సులు మంగళవార ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 10460 బస్సుల్లో 62౦౦ బస్సులు రోడ్లెక్కాల్సి ఉండగా.. ఆయా జి ల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 29౦౦ బస్సులు నడిచా యి. మాస్కులు ధరించిన ప్రయాణీకులనే బస్సుల్లోకి అనుమతినిచ్చారు.కరోనా భయంతో తొలి రోజు ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంతో ఆర్టీసీ పరిమిత సంఖ్యలోనే బస్సులను నడిపింది.

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో మొత్తాన్ని తనిఖీ చేసి కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఆర్టీసీ బస్సుల్లో తీసుకుంటున్న చర్యల గురంచి ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి బస్సును శానిటైజ్ చేయాలని మంత్రి సూచించారు. మాస్కులు ధరించని వారిని ఎట్టి పరిస్థితుల్లో బస్సుల్లోకి అనుమతించకూడదని అధికారులను ఆదేశంచారు. ఈ సందర్భంగా మంత్రి ప్రయాణీకులను ఉద్దేశించి మాట్లాడూతూ ఏపి రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, తెలంగాణ ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసిఆర్ చేపట్టిన చర్యల వల్ల తెలంగాణ ఆర్టీసీ లాభాల బాటన ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు రవాణా వ్యవస్థతో పోలిస్తే ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఆర్టీసలో ప్రమాదాల శాతం తక్కువ అని గతంలోనే నిరూపణ అయిందనీ.. కాబట్టి ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కూడా ఆర్టీసీయే సురక్షితం అన్న భావనలో నుండే సిఎం కెసిఆర్ ఆర్టీసీ సేవలను పునరుద్ధరించినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. స్వయంగా రాష్ట్ర మంత్రి ఆర్టీసీ ప్రయాణీకులకు విశ్వసనీయతను పెంచేందుకు ఆర్టీసీ బస్సులోనే మహబూబ్‌నగర్ ఉంచి హైదరాబాద్ వరకు ప్రయాణించడంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పలువురి ప్రశంసలనదుకుంటున్నారు.

హైదరాబాద్‌లో నో ఎంట్రీ.. శివారు ప్రాంతాలకే పరిమితం…

నిజామాబాద్, ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే బస్సు సర్వీసులన్నింటినీ జెబీఎస్ వరకు నడిపారు. నల్గొండ, సూర్యాపేట డిపో నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సు సర్వీసులన్నింటినీ హయత్‌నగర్ వరకు నడిపారు, వరంగల్ నుంచి వచ్చే బస్సు సర్వీసులన్నింటినీ ఉప్పల్ చౌరస్తా వరకు నడిపారు. ఆయా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి బయల్దేరే బస్సులన్నింటిని తొలుత హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం కావించారు. బస్సులు బయల్దేరే ముందు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అధికారులు మాస్క్‌లు, శానిటైజర్లు అందించారు. వరంగల్, ఖమ్మం, కరీనంగర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిచాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపో నుంచి ఉదయం 6 గంటలకే బస్సులు బయల్దేరాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 761 బస్సు సర్వీసులు నడిచాయి. ఆ జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులు ఆరాంఘర్ వరకు నడిపారు.

పరిమిత సంఖ్యలోనే…

ఆయా డిపోల నుంచి బస్సులు బయల్దేరినప్పటికీ నిర్ధేశిత బస్టాండ్‌లన్నీ ప్రయాణీకులు లేక బోసిపోయాయి. కరోనా వేళ ప్రయాణాలెందుకులే అని ప్రజలంతా భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో బస్సులను నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిలా ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి రోడ్లెక్కాయి. తొలిరోజే కదా.. క్రమేపి ప్రయాణీకుల సంఖ్య పెరగొచ్చనే ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నిబంధనలతో బస్సులను నడపడమెలా బస్సు ఛార్జీలను 33 శాతం పెంచాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించలేదు. ఇది ప్రజలపై అదనపు భారం పడగలదని భావించిన ప్రభుత్వం అది సాధ్యపడదని తేల్చి చెప్పింది.

రాత్రి 7గంటలలోపే డిపోలకు చేరుకోవాలి…

రాష్ట్రవ్యాప్తంగా ఆయా డిపోల నుంచి బయల్దేరిన బస్సులన్నీ రాత్రి 7 గంటల లోపే డిపోలకు చేరుకోవాల్సి ఉంది. సమయభావం తప్పనిసరిగా పాటించాల్సిందే. తొలిరోజు కావడం.. నిర్ధేశిత ప్రాంతాలకు వెళ్లిన బస్సులన్నీ 7 గంటలలోపే మళ్లీ తమ డిపోలకు చేరుకున్నాయి.

జెబిఎస్ బస్టాండ్‌లో రద్దీ

కాగా, బస్సులు పునరుద్ధరణ జరగడంతో జెబీఎస్ బస్టాండ్‌లో ప్రయాణీకుల రద్దీ కనిపించింది. లాక్‌డౌన్ 4.0 కొనసాగుతున్న వేళ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా (హైదరాబాద్ మినహా) అన్ని జిల్లాలకు బస్సులు నడిపడంతో నిజామాబాద్, ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు తరలివెళ్లేందుకు ప్రయాణీకులు చేరుకుని ఆయా బస్సులలో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. అయితే, నిబంధనలు కఠినతరంగా ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇలాంటి చర్యలు చేపట్టడం ముదావహమని ప్రయాణీకులంతా ముక్తకంఠంతో ప్రభుత్వ చర్యను సమర్థించారు.

లాక్‌డౌన్ ముగిసేవరకూ…

ప్రయాణీకులు పలుచగా ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆయా డిపోలలో బస్సులను ఖాళీగా ఉంచుకునే కంటే నడపడమే మేలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. లాక్‌డౌన్ వేళ ఇంతకంటే ప్రయాణీకులను ఆశించడం కష్టమేనని అధికారుల భావనగా ఉంది. అయితే, రానున్న కాలంలో ప్రయాణీకుల సంఖ్య పెరగవచ్చనే ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ముగిసేవరకూ రోజూవారీ ఆదాయం రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకూ వచ్చినా చాలని అధికారులు భావిస్తున్నారు. రూరల్ ప్రాంతాల్లో ఆర్టీసీకి సాధారణ రోజుల్లో రమారమి రూ.8 కోట్ల ఆదాయం వచ్చేదని.. ప్రస్తుతం అందులో సగమైనా వచ్చినా చాలని అధికారులు భావిస్తున్నారు. ఈ రకంగా వచ్చినా ప్రతి నెలా చెల్లించే రూ.120 కోట్ల సిబ్బంది జీతభత్యాల సమస్య తీరగలదన్నది అధికారుల యోచనగా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News