Home కరీంనగర్ అన్ని గ్రామాలకు ఆర్‌టిసి బస్సు

అన్ని గ్రామాలకు ఆర్‌టిసి బస్సు

Somarapu-Satyanarayana1157 కొత్త బస్సుల కొనుగోలు
తెలంగాణ ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ

మనతెలంగాణ/జగిత్యాలటౌన్: రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతామని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆదివారం జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 1200 గ్రామాలకు ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని త్వరలోనే అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. గ్రామాలకు రవాణా సౌకర్యం కలిగినప్పుడే ఆయా గ్రామాలు ఆర్థికంగా అభివృద్ది చెందుతాయనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష మేరకు ప్రతి కుగ్రామానికి సైతం బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రజలు పాలు, కూరగాయలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పట్టణాల్లో విక్రయించేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రం నుండి మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 1157 కొత్త బస్సులను కొనుగోలు చేశామని, మరో 3,4 నెలల్లో బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. వీటితో పాటు 236 మినీ బస్సులు, 100 ఎసి బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు సత్యనారాయణ వివరించారు. ప్రతి జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర రాజధానికి ఎసి బస్సులు నడుపుతామని, అదే విధంగా మినీ బస్సులను ప్రతి కాలనీ నుండి పట్టణాలకు నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకో నున్నట్లు తెలిపారు. సెల్‌ఫోన్ ద్వారానే బస్సుల రాకపోకల సమయాలు తెలుసుకోవడంతో పాటు ప్రయాణీకులు ఇంటి వద్దనే ఉండి టిక్కెటు బుకింగ్ చేసుకునేలా ప్రత్యేక ఆప్లికేషన్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామం నుండి పట్టణానికి, పట్టణాల నుండి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర రాజధానికి అనుసంధానించే విధంగా బస్సులను నడుపుతామని తెలిపారు.

రాష్ట్రంలోనే ఆదర్శం జగిత్యాల ఆర్‌డిసి డిపో :అధిక ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా జగిత్యాల ఆర్‌టిసి డిపో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. డిపో మేనేజర్ హన్మంతరావు ప్రజలు, ఆర్‌టిసిసిబ్బంది సహకారంతో డిపోను ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. బస్టాండ్ ఆవరణలో ఎలాంటి ఖాళీ స్థలం లేకుండా ఉద్యానవనాన్ని అభివృద్ది చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నింపడం అభినందనీయమన్నారు. అంకిత భావంతో సేవలందిస్తున్న డిపో మేనేజర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం అభినందించారని, జగిత్యాల ఆర్టీసీ డిపోను రాష్ట్రంలోనే అన్ని డిపోలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు జగిత్యాల డిపోలో చేపట్టిన సంస్కరణలను మిగతా డిపోల మేనేజర్లు ఆచరించి ఆర్టీసీని లాభాల బాటలో నడపాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు. సకల జనుల సమ్మె కాలంలో తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని, పదవీ విరమణ తర్వాత చెల్లించే పెన్షన్‌ను వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు రవీందర్, తోగిటి గంగాధర్, హన్మండ్లు, రాజేశం, దామోదర్, సత్తయ్య తదితరులున్నారు.