Home ఖమ్మం ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి

ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి

RTC Driver

 

కంచన్‌బాగ్‌లోని అపోలో ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తం
ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నేడు ఉమ్మడి ఖమ్మంలో బంద్‌కు జెఎసి పిలుపు

ఖమ్మం : ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన ఆర్‌టిసి డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతిచెందారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నాకి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన అతణ్ణి వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో 90 శాతానికి పైగా శరీరం కాలిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం శ్రీనివాస్‌రెడ్డిని శనివారం సాయంత్రం హైదరాబాద్ తీసుకువచ్చారు. కంచన్‌బాగ్‌లోని అపోలో డిఆర్‌డివొ ఆసుపత్రిలో శ్రీనివాస్‌రెడ్డికి చికిత్స అందించారు. అక్కడే చికత్స పొందుతుండగానే ఆదివారం శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందారు.

శ్రీనివాస్‌రెడ్డి మరణవార్త తెలియగానే కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలగజేసుకుని ఆందోళనకారుల్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. అపోలో ఆసుపత్రిలో ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం చేసిన తరువాత శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని ఖమ్మంకు తీసుకువెళ్లారు. శ్రీనివాస్‌రెడ్డి మృతిలో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. ఆందోళనకు దిగిన ఆర్‌టిసి కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆర్‌టిసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ప్రొ.కోదండరాం ఆసుపత్రికి చేరుకున్నారు.

మృతుడు శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి కె.లక్ష్మణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని.. బిజెపి రాష్ట్ర శాఖ తరపున లక్ష్మణ్ సంతాపం తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. అన్ని డిపోల వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ చేయాలని ఉద్యోగ సంఘాలు, పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులకు ఆర్‌టిసి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఆర్‌టిసి సమ్మె ఆదివారంతో తొమ్మిదో రోజుకు చేరింది. అన్ని ఆర్‌టిసి డిపోల వద్ద పోలీసుల పహారా కొనసాగింది.

కొవ్వొత్తుల ప్రదర్శన..
ఆర్‌టిసి డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతికి నివాళులర్పిస్తూ కార్మికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పలు డిపోల వద్ద ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్దయెత్తున నినాదాలు చేస్తూ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థరించారు.

మృతి బాధించింది : మంత్రి నిరంజన్‌రెడ్డి
ఆర్‌టిసి కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మరణం బాధించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితికి కారణం ఆర్‌టిసి కార్మిక సంఘాలేనని ఆయన దుయ్యబట్టారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కమిటీని వేసి నివేదిక వచ్చిన తరువాత సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా కార్మిక సంఘాల నేతలు పట్టించుకోలేదన్నారు. కార్మిక సంఘాలు సమ్మె వైపు మొగ్గు చూపి కార్మికులను, ప్రజలను అసౌకర్యానికి గురిచేసి అనర్థాలకు కారణం అయ్యాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

శ్రీనివాస్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు…
ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసి డ్రైవర్ మృత దేహం ఆదివారం రాత్రి భారీ బందోబస్తు మధ్య ఖమ్మంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్టీసి కార్మికులు, రాజకీయపక్షనాయకులు వరంగల్ క్రాస్‌రోడ్స్ వద్ద మృతదదేహానికి వాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డికి జోహార్లు అర్పిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్క డి నుంచి బైక్ ర్యాలీ ద్వారా బైపాస్ రోడ్డు మీదుగా వివేకానంద కాలనీలో గల శ్రీనివాస్ రెడ్డి నివాసగృహానికి చేరుకున్నారు. అక్కడ బంధు మిత్రులు, కార్మిక సంఘాల, రాజకీయపార్టీల నాయకులు శ్రీనివాస్ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఖమ్మం నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలా వుండగా శ్రీనివాస్‌రెడ్డి అంతిమ యాత్ర ఆయన నివాసం నుంచి రాత్రి ఆలస్యంగా మొదలైంది.

ఖమ్మం డిపో దగ్గర నుంచి అంతిమయాత్ర వెళ్లడానికి పోలీసులు తొలుత అనుమతినివ్వలేదు. ఆ తర్వాత కాసేపటికి కార్మికుల ఆందోళనతో దిగివచ్చిన పోలీసులు అక్కడి నుంచి యాత్ర కొనసాగించేందుకు అనుమతినిచ్చారు. మయూరి సెంటర్ మీదుగా కాల్వ ఒడ్డులోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఖమ్మం, మహబూబాద్ పోలీసుల ఆధ్వర్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుకోకుండా పటిష్ట చర్యలను పోలీసులు చేపట్టారు.

RTC Driver Srinivas Reddy dies