Home రాష్ట్ర వార్తలు బయటికి చెప్పుకోలేక..సిగ్గుతో చితికిపోతున్నాం

బయటికి చెప్పుకోలేక..సిగ్గుతో చితికిపోతున్నాం

women-bus-conductors2నేను డ్యూటీలో ఉండగా బస్సు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డాను. అయినా నెలరోజులకు మించి సెలవు ఇవ్వలేదు. ఫలితంగా ఉన్న ఆనారోగ్య సమస్యలతో పాటు భరించలేని మోకాళ్ళ నొప్పులు ఏర్పడాయి.- సీనియర్ మహిళా కండక్టర్ శారద.

పొద్దున డ్యూటీ ఎక్కితే ఎప్పుడో కాని ప్రకృతి పిలుపుకు స్పందించలేని పరిస్థితులు మావి. దాంతో మాలో చాలా మంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నాం- మరో మహిళా కండక్టర్ విధులు రమ.

నెలసరి సమయంలో ఇవ్వాల్సిన లీవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం వల్ల తీవ్రమైన ఋతుస్రావం జరిగి ఎక్కువమందికి రక్తహీనత ఏర్పడుతున్నది -రాగిణి

రెస్ట్‌రూముల్లో సరైన మూత్రశాలలు లేక సులభ్ కాంప్లెక్స్‌ల్లో డబ్బులిచ్చి వెళ్ళాల్సిన పరిస్థితులున్నాయి.- రేణుకాదేవి.

టికెట్ ఇష్యూయింగ్ మిషిన్లు సరిగా పని చేయక ఆలస్యమైతే మమ్మల్ని బాధ్యుల్ని చేసి సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం దాని వల్ల కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి పుష్పలత.

నలభై సంవత్సరాల పైబడిన మహిళలకు మెనోపాజ్ సమస్యలు తలెత్తుతున్నాయి. వారికి ఆ సమయంలో ఓ.డి (ఆఫీస్ డ్యూటీ) వేయాలి – నిజామున్నీసా.

అనారోగ్య సమస్యలతో మా దవాఖానాకు పోతే సరైన సదుపాయాలు లేవు. డాక్టర్లు సరిగా చూడరు. బయట చూపించుకుందామంటే సమయం ఉండదు,అన్ని డబ్బులు పెట్టే స్థోమత లేదు – పద్మ.

రన్నింగ్ టైం పెరిగినప్పుడు ఒ.టి కింద జమచేయాలి సునీత.

ఒక్కరా…ఇద్దరా…రాజధానీ నగరంలో, జిల్లాల్లో పని చేస్తున్న ఆర్టీసీ మహిళా కండక్టర్ల మూగ రోదన, వేదన ఇది…వారి పరిస్థితి తెలియటానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంతేనా?…పురుషాహంకారం, ఆధిపత్య ధోరణి వారిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నది. మానసికంగా ఆందోళనలు పెరిగిపో యేందుకు కారణం అవుతున్నది. డ్యూటీ ఎక్కినప్పటినుంచి ఇల్లు చేరే దాకా ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి. ఎవరికి చెప్పుకోవాలన్నా అన్నిటికీ సిద్ధమయ్యే ఇలాంటి ఉద్యోగాలు చేయాలనే వారే తప్ప కనీస సానుభూతి చూపించేవారు కనిపించరు. ప్రతి చిన్న సమస్యనూ యూనియన్ నాయకుల దాకా తీసుకెళ్ళాలంటే మరో అవస్థ. వారు జోక్యం చేసుకుంటే అధికారులు తడాఖా చూపించేది మళ్ళీ వీళ్ళపైనే.

ఇంతేనా…ఇంకా ఉన్నాయి…
కొత్తగా వచ్చిన లేడీ కండక్టర్ మస్తుగుంటదిర బై,టైం పాస్ కోసం బస్సెక్కి మెహదీపట్నం పోయి వద్దాము-ఉప్పల్ బస్సు డిపోలో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు పోకిరీలు…
500 రూపాలకు చిల్లర లేదంటే ఎట్లనమ్మ మరి నా దగ్గర టికెట్‌కు కావల్సిన పది రూపాయలు లేకపా యె-పొద్దున ఎనిమిదిన్నరకే ఒక మహిళ గొడవ…
ఆ కండక్టర్ మన దగ్గరికి వచ్చేలోపు మనం ఇంకో డోర్ నుండి జంప్‌ఐ పోదాం…మధ్యాహ్నం రెండు గంటలకు ఒక బస్సులో ఫ్యాషన్‌గా కనిపించే ఒక యువకుడు.
టికెట్…టికెట్…కండక్టర్ అరుస్తుంటే పాస్ అంటాడు మరో కాలేజీ భావి భారత పౌరుడు. చెకింగ్‌కు ఎవరైనా మధ్యలో వస్తే వాడు టికెట్ కోసం నా వద్దకే రాలేదంటాడు…సాయంత్రం ఆరు గంటలసమ యంలో పరిస్థితి ఇది…
విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న మహిళా కండక్టర్ మెడలోనుండి రెండుతులాల బంగారు గొలుసు లాక్కుపోయిన అగంతకుడు… రాత్రి పదకొండు గంటలకు మామూలుగా జరిగే ఘటనలు…
ఉదయం ఐదు గంటలు… ఒక మహిళ తన ఇంటి,వంట పని పూర్తిచేసుకొని భర్త,అత్త, మామ, పిల్లలకు సర్దిచెప్పుకొని ఒప్పించి చిన్ని డబ్బాలో భోజనం కుక్కుకొని బై చెప్పి తన ఉద్యోగంలో ఆలస్యం వల్ల రిమార్కు రాకూడదని డిపో వైపు వడి వడిగా నడిచి వెళ్ళే కండక్టర్ల ఇబ్బందు లివి. ఇదంతా పట్నం లోని వ్యవస్థ అయితే,60 మంది ప్రయా ణీకులను తీసుకువెళ్ళే సామర్థం ఉన్న బస్సులో చెయ్యెత్తిన చోటల్లా బస్సాపి, బస్సును నిండు గర్భిణిలా మార్చి, మండుటెండలో గతుకుల రోడ్డుమీద పల్లెవెలుగు బస్సును రఫ్ఫాడించే డ్రైవర్ నైపుణ్యం ముందు మరో గ్రామం చేరుకునే లోగా టిక్కెట్ చించలేని మహిళ… కండక్టర్‌గా అవతారమెత్తి అబలగా బలై బేలగానే చూస్తున్నది.1996 నుండి మనరాష్ట్రంలో మహిళలు పలు రంగాల్లో సాధికారత దిశగా వేసిన అడుగులు వారికి వరంగాను శాపంగాను మారాయి.

ముఖ్యంగా రవాణా రంగంలో మహిళా కండక్టర్లుగా సామాన్య కుటుంబాల్లోని మహిళలు సాధికారత దిశగా అడుగులు వేశారు.అది ముమ్మాటికి విజయవంతమైన ప్రయోగమే.చాలా మంది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 1996లో నలుగురు మహిళా కండక్టర్లతో మొదలైన ఆర్ టి సి ప్రయాణం ఇప్పుడు సుమారు నాలుగువేల మందికి చేరింది. నేటికీ వారిని కించపరిచేవారే ఎక్కువ. అది గమనించినా పరిస్థితులకు తలొగ్గక తప్పని పరిస్థితి. సహజంగానే కొంత కఠినమైన వృత్తి కండక్టర్ వృత్తి.ఎండ,వాన,చలి కాలాలతో సంబంధం లేకుండా కిటికీలు తలుపులు సరిగా లేని బస్సుల్లో నిమిషం ఆలస్యం కాకుండా వచ్చి చేయాల్సిన ఉద్యోగం కండక్టర్లది. మహిళలకు ఆర్ టి సిలో ఉద్యోగ అవకాశాలు కల్పించినా సరైన వసతులు కల్పించలేదనేది వాస్తవం.

2006 వ సంవత్సరంలో అప్పటి గుర్తింపు యూనియన్ మరియు వర్కింగ్ ఉమెన్స్ ఫోరం (ఎ ఐ టి యు సి) ప్రయత్నాలు చేయడంతో సులభ్ కాంప్లెక్స్‌లు వాడుకునే అవకాశం కల్పిస్తూ w1/329(10)/04-H C R సర్కులర్ అప్పటి రీజినల్ మేనేజర్ జారీ చేశారు. అవకాశం ఉన్నచోట టాయిలెట్ వసతి కల్పిస్తూ స్టాఫ్ రూములను ఏర్పాటు చేశారు. స్టాఫ్ రూముల్లో ఫ్యాన్ మంచినీటి వసతి, పార్టిషన్ లను ఏర్పాటు చేశారు. నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండే డిపోలకు బదిలీలు చేశారు.గర్భణీ స్త్రీలకు సరిపడా సెలవులు మంజూరు చెశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మహిళలకు డ్యూటీలు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. స్టాఫ్ బస్ సౌకర్యం కల్పించారు. ఆ సమయంలో తీసుకున్న చర్యలే తప్ప మళ్ళీ ఎలాంటి సంక్షేమ చర్యలు ఆర్ టి సిలో నేటి వరకు చేపట్టలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్ టి సి ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్ పెంచారు. పెరిగిన ఫిట్‌మెంట్‌తో పాటే వారిపై ఒత్తిడి కూడా పెరిగింది అంటున్నారు మహిళా ఉద్యోగులు. వారి సమస్యలను విన్నవించుకుందామన్నా వినని వారే ఉన్నారని పైరవీలతో వెళ్ళేవారికి న్యాయం జరుగుతుందని వారన్నారు. మహిళా కండక్టర్ల హక్కులసాధన కోసం మరొకసారి ఉద్యమం చేయడానికి కూడా వెనుకాడేది లేదని తేల్చి చెబుతూ పదహేడు డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రం మొత్తంలో ఉన్న కండక్టర్లలో 10% ఉన్నమహిళా కండక్టర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం ఏమాత్రం అసాధ్యం కాదని వారంటున్నారు. డిమాండ్ల సాధనకు కొంగుబిగించి సంఘటిత పోరాటాలకు సిద్ధపడుతున్న మహిళా కండక్టర్లకు తెలంగాణ రాష్ట్ర ముంఖ్యమంత్రి డిమాండ్లు నెరవేరుస్తారనే అపారమైన నమ్మకం ఉండడం విశేషం.