Home తాజా వార్తలు అసంపూర్తిగా చర్చలు

అసంపూర్తిగా చర్చలు

RTC

ఆర్‌టిసి యూనియన్లతో సాగి, ఆగిన చర్చలు
హైకోర్టు చెప్పినట్టే చేశాం : ఇన్‌చార్జ్ ఎండి
సమ్మె యథాతథం : అశ్వత్థామరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. శనివారం ఎర్రమంజిల్‌కాలనీలోని ఇఎన్‌సి కార్యాలయంలో జరిగిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదు. హైకోర్టు సూచన మేరకు 21 అంశాలపైనే చర్చించాలని అధికారులు పేర్కొన్నప్పటికీ.. 26 అంశాలపై చర్చించాలని కార్మిక సంఘాలు పట్టుబట్టడంతో ఈ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. సుమారు రెండు గంటల పాటు అధికారులు, కార్మిక సంఘాల మధ్య వివిధ అంశాలపై ఏకాభిప్రాయం రాకపోవడంతో మధ్యలోనే కార్మిక సంఘాలు వెళ్లిపోయాయి. దీంతో అధికారులు కూడా కొద్దిసేపు కార్మిక సంఘాల కోసం నిరీక్షించి వెనుదిరిగారు. దీంతో ఈ రోజు చర్చల్లో పురోగతి వస్తుందని భావించినప్పటికీ అది జరగలేదు. అధికారుల పక్షాన ఇన్‌ఛార్జ్ ఎండి సునీల్‌శర్మ, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు పలువురు పాల్గొనగా జెఎసి పక్షాన కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో..కన్వీనర్‌లు రాజిరెడ్డి, విఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. చర్చల అనంతరం ఆర్‌టిసి ఇన్‌చార్జ్ ఎండి సునీల్ శర్మ మాట్లాడుతూ, హైకోర్టు 21 అంశాలపై చర్చలు జరపాలని చెప్పిందని, ఆ విధంగానే తాము కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపామన్నారు.

జెఎసి నేతలతో చర్చలు అసంపూర్తిగా ముగిసిన అనంతరం ఎర్రమంజిల్ ఇఎన్‌సి కార్యాలయం వద్ద ఆర్‌టిసి ఇన్‌చార్జ్ ఎండి సునీల్‌శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి మాట్లాడారు. తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లిన నేతలు ఇప్పటి వరకు రాలేదని పేర్కొన్నారు. 21 అంశాలపై చర్చిద్దామని తాము చెప్పామని, అన్ని డిమాండ్లపై చర్చించాలని కార్మిక సంఘాలు కోరాయని పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనం మినహా మిగతా వాటినే చర్చిస్తామంటే కార్మిక నేతలు అంగీకరించలేదని ఆయన పేర్కొన్నారు. తమ వాళ్లతో మాట్లాడి వస్తామని జెఎసి నేతలు మధ్యలోనే వెళ్లిపాయరని, సాయంత్రం 6.30 గంటల వరకు వేచి చూసినా వాళ్లు తిరిగి రాలేదని చెప్పారు. ఫోన్లు లాక్కుని నిర్బంధంగా చర్చలు జరిపారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. సమావేశం మధ్యలో ఫోన్‌లు వస్తే చర్చలకు ఆటంకం ఏర్పడుతుందన్న ఉద్దేశ్యంతోనే వాటిని అనుమతించలేదని పేర్కొన్నారు. ఇడిలు చర్చల్లో పాల్గొనాలని ఎక్కడా లేదని మరో ప్రశ్నకు సమాధానిమిచ్చారు.
సమ్మె యధాతథం: జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
తొలివిడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయని ఆర్‌టిసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. మళ్లీ ఎప్పుడు చర్చలకు పిలిస్తే అప్పుడు హాజరవుతామని చెప్పారు. అన్ని అంశాలపై తాము చర్చలు జరపాలని కోరామని, కానీ కొన్ని అంశాలకు మాత్రమే వారు పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఈ విధంగా చర్చలు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. మా సెల్ ఫోన్లు లాక్కున్నారు. 21 అంశాలపై మాట్లాడుతామని యాజమాన్యం అందన్నారు. మేము 26 అంశాలపై చర్చలు జరపాలని కోరామన్నారు. 21 అంశాలు ఆర్థిక అంశాలకు సంబంధం లేదని కోర్టు చెప్పింది. అధికారులు ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని సమావేశానికి వచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేవారు. అన్ని అంశాలపై చర్చలు జరపాలని కోరామన్నారు. అయితే, అధికారులు మళ్లీ చర్చలకు ఆహ్వానిస్తే చర్చలు జరిపిందేకు సిద్ధంగా ఉన్నట్లు ఒక సమాధానంగా చెప్పారు. చర్చల్లో స్పష్టత రాకపోవడంతో సమ్మె యథావిధిగా కొనసాగుతుందన్నారు. హైకోర్టు చెప్పిందనే అధికారులు తమతో చర్చలు జరిపారే తప్పా తమ డిమాండ్లు పరిగణలోనికి తీసుకోలేదన్నారు. సమ్మెలో భాగంగా ఈ నెల 30న సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని జెఎసి ప్రతినిధులు వెల్లడించారు.

RTC negotiations with Trade unions are incomplete