మహబూబ్‌నగర్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేసి ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి సమ్మె చేయిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల పర్యాటక శాఖ మంత్రి డా. శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా ఆరోపించారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆర్టీసి సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు వినతి పత్రం ఇచ్చేందుకు మంత్రికి ఫోన్ చేయగా మంత్రి స్వయంగా తానే వచ్చి స్వీకరిస్తానని తెలిపారు. ఇచ్చిన మాటలో భాగంగా మంత్రి స్వయంగా కార్మికుల దగ్గరకు వచ్చాడు. ఈ సందర్భంగా కొంత మంది కార్మికులు మంత్రిని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీ సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకోవాలని కోరారు.
అయితే ఒకరిద్దరు కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆర్టీసి కార్మికులకు తమ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో చేసిందని ఇక మీదట కూడా అన్ని సమస్యలు పరిష్కరించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. గత 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆర్టీసి కార్మికులకు 44 శాతం టిఆర్సీ ఇచ్చిన ఘనత తమ ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందని అన్నారు. అదే విధంగా హైయార్ కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వన్నప్పటికి ఆర్టీసి కార్మికులకు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ఇలా ఆర్టీసి పట్ల ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ది ఉందని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసిని గట్టెక్కించేందుకు, కార్మికులను ఆదుకునేందుకు అన్ని విధాల సిద్దంగా ఉందన్నారు. అయినప్పటికి ఆర్టీసి కార్మికులను కొంత మంది కావాలనే రెచ్చగొట్టి సమ్మెలోకి ఉసిగొల్పాయని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఒక కార్మికుడు కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ప్రస్తావించగా కొదండరాంరెడ్డి , ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొమట్రెడ్డి వెంకట్‌రెడ్డిలు ఎవరో నాకు తెలియదని వాళ్లు రెచ్చగొట్టినంత మాత్రన ప్రభుత్వం చెల్లించిపోదని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసి కార్మికులు చేపడుతున్న సమ్మెలో డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. ఇప్పటికే కార్మికుల సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపిందని పేర్కొన్నారు. అయినప్పటికి కార్మికులకు కొన్ని న్యాయమైన డిమాండ్లు ఉన్నప్పటికి సవదానంగా కూర్చొని పరిష్కరించుకోవచ్చునని అన్నారు.
అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. పండుగ సందర్భం అని తెలిసి కూడా కొన్ని శక్తులు ఆర్టీసి కార్మికులను రెచ్చగొట్టి సమ్మె బాట పట్టించాయని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలాగైన చులకన చేయాలన్న భావనతో కొన్ని పత్రికలు, మీడియాలు ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేసి పైసాచిక ఆనందం పొందుతున్నాయని అలాంటి వాటిపట్ల కార్మికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.