Home తాజా వార్తలు మైనారిటీల అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం

మైనారిటీల అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం

KCR1

అల్లా దయవల్లే రాష్ట్రం వచ్చింది
అజ్మీర్ దర్గాలో రుబాత్ నిర్మిస్తాం
త్వరలో ప్రత్యేక రైల్‌లో వెళ్లి మొక్కులు తీర్చుకుంటాం
ఎల్‌బి స్టేడియం ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : ముస్లిం మైనారిటీ అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శం గా ఉన్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ఎల్‌బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు శుక్రవారం సాయంత్రం దావత్‌ఎఇఫ్తార్ విందు నిర్వహించింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మైనారిటీలనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు బడ్జెట్‌లో నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మైనారిటీలకు రెండు వేల కోట్లు కేటాయించిందన్నారు. ఇది దేశానికే ఆదర్శమన్నారు. ముస్లిం మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. “నాలుగేళ్ళ ముందు రాష్ట్రం కోసం పోరాటం చేశాం. అల్లా దయ వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. ఈ నాలుగేళ్ళలో ప్రభు త్వం చేస్తున్న పనిని మీరే చూస్తున్నారు” అని అన్నారు. భగవంతుడి కరుణ ఉన్నందునే అనేక అంశాల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలోనే ఆగ్రభాగాన ఉందని, ఆదర్శంగా నిలిచిందని అన్నారు. మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మైనారిటీ గురుకులాలతో అందిస్తున్న విద్య కారణంగా నేడు మైనారిటీ విద్యార్థులు ‘నాసా’ పిలుపుతో అమెరికా వెళ్ళి వచ్చారని అన్నారు. గురుకులాలలో మైనారిటీలకు అత్యుత్తమ విద్య నందించేందుకు మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొపైటీ కార్యదర్శి షఫిఉల్లా చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఎస్‌సి, ఎస్‌టిల మాదిరిగానే ముస్లిం మైనారిటీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
అజ్మీర్ దర్గాలో ‘రుబాత్’ నిర్మాణం : నిజాం హాయంలో హజ్ యాత్రీకుల కోసం ఆనాడు సౌదీలో రుబాత్‌ను కట్టించారని అది నేడు తెలంగాణ హజ్ యాత్రీకులకు ఎంతగానో ఉపయోగ కరంగా ఉందని అన్నారు. అదే తరహాలో ఇప్పుడు రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా వద్ద రుబాత్‌ను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాజస్తాన్ ప్రభుత్వం ఎకరం భూమి ఇచ్చిందని, అందులో రూ.5 కోట్లతో రుబాత్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. నాడు తెలంగాణ కోసం అజ్మీర్ దర్గాను మొక్కుకున్నామని, అక్కడ మొక్కుకున్న వారు ఖాళీ చేతులతో రారని, తెలంగాణ సిద్దించినందున త్వరలోనే ప్రత్యేక రైలుతో అజ్మీర్ దర్గాకు వెళ్లనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే 10 ఎకరాల్లో ఇస్లామిక్ సెంటర్ నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు. అనిసుల్ గుర్బ విద్యార్థులకు కూడా భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగిందన్నారు. ముఖ్యమంత్రి చెపట్టిన కార్యక్రమాల వల్ల తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ కంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎక్కువ అని అన్నారు. ప్రతీ రంగంలోనూ తెలంగాణ అభివృద్ధి పథం వైపు దూసుకుపోతోందన్నారు. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ కార్యక్రమాలు దేశంలో ఎక్కదా లేని విధంగా తెలంగాణలోనే నిర్వహిస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయురారోగ్యాలు రివ్వాలని భగవంతుడ్ని ప్రార్థించాలని సూచించారు. ముఖ్యమంత్రికి అనిసుల్ గుర్బా తరఫున మెమొంటోను అందజేశారు. అనంతరం మక్కామసీదు షాహీ ఇమామ్ మొహమ్మద్ ఉస్మాన్ నక్ష్ బంది ప్రత్యేక ప్రార్థనలతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షను ముగించారు. ఈ కార్యక్రమంలో అనీసుల్ గుర్బా అనాథ విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శాసన స్వామి గౌడ్, మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, పార్లమెంటు సభ్యులు డి. శ్రీనివాస్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసి, శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దాన కిషోర్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఒమర్ జలీల్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రా జేశం గౌడ్, నగర పోలీసు కమిషనర్ , డిజిపి, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ విభాగాలు ఉన్నతాధికారులు, పాల్గొన్నారు. ఇఫ్తా ర్ అనంతరం ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు.